విద్వేష ప్రసంగాలపై విరుద్ధ వైఖరులు

బంగ్లాదేశ్లో మారణహౌమానికి కారణమైన యువత జకిర్ నాయక్ ప్రసంగాలతో ఉత్తేజపడ్డామని చెప్పిన తర్వాత వాటిపై నిషేదం విధించాలనే చర్చ మొదలైంది. ఆయన పీస్ టీవీ వున్నట్టే తెలియదని నూతన సమాచార శాఖామంత్రి వెంకయ్య నాయుడు వ్యాఖ్యలు వెల్లడించాయి. దేశంలో 600 చానళ్లను ఎలక్ట్రానిక్ మీడియా మానిటరింగ్ సెంటర్(ఇఎంఎంసి) ద్వారా పర్యవేక్షిస్తుంటారు. అయితే అనధికారికంగా మరెన్నో ఛానళ్లు ప్రసారమవుతున్నట్టు సమాచారం వుంది. జకిర్ నాయక్ విదేశాల నుంచి తిరిగి రాకుండా తనపై ఆరోపణలకు సమాధానమిచ్చారు.తనెప్పుడూ తీవ్రవాదాన్ని బలపర్చలేదని వాదించారు. అయినా ఆయన విద్వేష ప్రసంగాలు చేశారనే విమర్శ వుంది గనక తప్పక విచారించి తగు చర్యలు తీసుకోవల్సిందే. అయితే దానికి ముందు వివరమైన దర్యాప్తు జరగాలి.
ఇలాటి ఫిర్యాదు మాత్రమే గాక కేసు కూడా ఎదుర్కొంటున్న బిజెపి ఎంపి సుబ్రహ్మణ్య స్వామి విషయంలో కేంద్రం పూర్తి భిన్నమైన వైఖరి తీసుకోవడం ఆసక్తికరం. అస్సాంలో విద్వేష ప్రసంగం చేసినందుకు గాను ఆయనపై కేంద్రమే కేసు వేసింది.మార్చి 19న వారంటు కూడా జారీ అయింది. ఈ కేసు విచారణ సందర్భంలో స్వామి అసలు ఐపిసి 156(3) చెప్పే విద్వేష ప్రసంగం అన్న దాన్ని చట్టం నుంచి తొలగించాలని వాదించారు.తమాషా ఏమంటే కేంద్రం కూడా తాము ఆయన చేసిన ప్రసంగం గురించి వాస్తవాలను నివేదించామే గాని శిక్ష వేయాలని అడగలేదని చెప్పింది. తనను ఇరికించాలని చూసిన అటార్జీ జనరల్ ముకుల్ రోహ్తగికి కేంద్రం వైఖరి చెంపపెట్టు అయిందని సుబ్రహ్మణ్య స్వామి ట్విట్టర్లో ఆనందం వ్యక్తం చేశారు.
మరో విచిత్రమేమంటే కాంగ్రెస్ నాయకుడు దిగ్విజరు సింగ్ జకిర్ నాయక్తో కలసి వున్నారని బిజెపి విమర్శించడం. ప్రధానిమోడీ తో వేదికలపై కనిపించే రవిశంకర్ గురూజీ కూడా ఆయనతో కలసి కార్యక్రమాలు నిర్వహించారు కదా అన్న దిగ్విజరు ప్రశ్నకు మాత్రం జవాబు లేదు. విమర్శలు అందరికీ ఒకేలా వర్తించాలి కదా మరి!