కొమ్మినేని ఇంటర్వ్యూలో ఒక అనౌచిత్యం

kom4444
దీర్ఘకాల మిత్రులు కొమ్మినేని శ్రీనివాసరావు ఎ న్‌టివినుంచి నిష్క్రమించడానికి దారితీసిన రాజకీయ ఒత్తిళ్లపై చాలా చర్చనే జరిగింది. మీడియాలో జోక్యాలు ఒత్తిళ్లు ఇదే మొదటి సారి కాదు, చివరి సారి కాదు గనక పెద్ద ఆశ్చర్యం లేదు. అమెరికా మేధావి నామ్‌ చామ్‌స్కీ రాసిన పుస్తకంలో కొంత భాగాన్ని మీడియా మాయాజాలం పేరిట అనువదిస్తూ నేనొక పెద్ద ఉపోద్ఘాతం రాశాను. అందులో చాలా ఉదాహరణలుంటాయి. ఇక్కడ ఆ వివరాలన్నింటిలోకి పోను. మిత్రుడుగా ఆయనతో అప్పుడప్పుడూ మాట్లాడుతూనే వున్నాను.సాక్షిలోకి వచ్చాక తన కార్యక్రమంలో పాల్గొనడం ఇంకా కుదరలేదు. ఈ లోగా అనుకోకుండాే యూ ట్యూబ్‌లో ఆయన ఇంటర్వ్యూ భాగాలు చూశాను. అన్నీ చూడలేదు గాని చూసిన దాంట్లో ఒక్క భాగమే నాకు ఒకింత అభ్యంతరం అనిపించింది. ఒత్తిడి చేసిన వారెవరో సూటిగా చెప్పడానికి ఆయన సిద్ధంగా లేరు. పరిస్థితుల రీత్యా దాన్ని అమలు చేసిన యాజమాన్యాన్ని విమర్శించకూడదని భావించడం కూడా సమంజసమే అనుకోవచ్చు. తర్వాత తనను ఆదరించి అవకాశమిచ్చిన జగన్‌కు మరీమరీ కృతజ్ఞతలు చెప్పడం కూడా సహజమే. నిజానికి తను అంతకు ముందు ఉద్యోగం చేసిన ఈనాడు అధినేత రామోజీరావు గురించీ మంచి మాటలు చెప్పారు. ఇన్ని చేసిన మిత్రుడు కొమ్మినేని తన నిష్క్రమణ నూతన నియామకం మధ్య కాలంలో మిగతా ఛానళ్లు ‘భయపడి’ పిలవలేదని ఆరోపించడం బాగాలేదు. భయపడ్డారని అనడం సరికాదని కొంత సర్దుకున్నా ఇక్కడ సమస్య పదం కాదు. ఆ ఆలోచన. మాలాటి వాళ్లం అవకాశం వచ్చినప్పుడల్లా రెండు రాష్ట్రాలోనూ నచ్చని మీడియాపై వత్తిళ్లు గాని ఛానళ్ల నిలిపివేత కాని సరైంది కాదని చెబుతూనే వున్నాం. మొన్న కర్నూలు వెళితే అక్కడ స్థానికంగా వున్న సీమ ఛానెల్‌ వైర్లు కత్తిరించడం చూసిన తర్వాత ఇవన్నీ కలిపి మీడియాతో మాట్లాడాను. దాన్ని ఒక అగ్రశ్రేణి పత్రిక ఒక్కటంటే ఒక్క వాక్యం అది కూడా టేబులాయిడ్‌లో ఇచ్చి సరిపెట్టింది. అంత చిన్న వార్త నా నలభై ఏళ్ల పాత్రికేయజీవితంలో చూళ్లేదు. తమాషా ఏమంటే వారి సంస్థలపై వైఎస్‌ ప్రభుత్వం కేసులు పెట్టినప్పుడు మరో పత్రిక ఆంధ్రజ్యోతిలోని నా కాలమ్‌ గమనంలో వివరంగా రాశాను,వారు వేశారు కూడా! సరే ఎవరి పద్దతి వారిది. తెలుగు ఛానళ్లలోనూ పత్రికలలో నాకూ చాలా అనుభవాలున్నాయి. ఒకప్పుడు నాకు సమయం దొరక్కపోతే చర్చనే వాయిదా వేసుకున్న, ఆ కార్యక్రమ నిర్వహణ చేపట్టవలసిందిగా రెండు మూడు సార్లు ఆహ్వానించిన ఒక జాతీయ గొలుసుకట్టు ఛానల్‌కు ఇప్పుడు నా వూసే నచ్చడం లేదు.అది వారి ఇష్టం. ఇంతకు ముందే చెప్పినట్టు వారి సంస్థలపైన దాడి జరిగినప్పుడు- కొందరు పాత్రికేయ నేతలు కూడా వంతపాడుతున్నప్పుడు నేను నిశితంగా విశ్లేషించాను. అదంతా గతం. కనుక కొమ్మినేని వంటి అనుభవజ్ఞుడు ఇతర ఛానళ్లు తనను పిలవకపోవడం అపరాధమైనట్టు ఏ భాషలోనైనా సరే ఆరోపించడం అసంబద్దం. ఆయన కొన్ని చోట్ల పనిచేస్తున్నప్పుడు కూడా ఇతరులుఆహ్వానించిన సంగతి సాకు తెలుసు. ఒక సందర్బంలోతనతో నేనూ వున్నాను. కాని ఇప్పటి పరిస్థితి వేరు. వ్యక్తిగతంగా నేనుగా మాట్లాడుతూనే వున్నాను.మీడియా మొత్తం మాట్లాడుతున్నారు. కొంతకాలం విదేశాలకువెళ్లారు. జరిగిందేమిటో నెల తర్వాత అది కూడా పరోక్ష పద్ధతిలో గాని ఆయన చెప్పలేదు. తన భవిష్యత్‌ ఆలోచనలపై వూహాగానాలను ఖండించలేదు. అలా ఒక సంపాదకుడు మధ్యంతర వెతుకులాటలో వున్నప్పుడు ఇతరులు పిలిచి ఇబ్బంది పెట్టడం ఎలా కుదరుతుంది? సిద్ధార్థవరద రాజన్‌లాగా అయితే అదో తీరు. లేదు విద్యుత్‌ ఉద్యమ సమయంలో మిత్రులు జి.శ్రీరామమూర్తిని కేవలం రాతల కారణంగా తొలగింపచేసిన తీరు కాదిది. రెండు బలమైన పాలకవర్గాల మధ్య వైరం ఫలితం. తర్వాత కొనసాగింపు కూడా దానికి అనుగుణంగానే వుంది. మిత్రుడు కొమ్మినేని తను నిష్పక్షపాతంగా వుంటానని భావిస్తారు గనక పరిణతి కలవారు గనక ఈ అనౌచిత్యాన్ని స్నేహపూర్వకంగా పేర్కొంటున్నాను. బహిరంగంగా వ్యాఖ్యానం చేశారు గనక నేనూ రాయాల్సి వచ్చింది. మొత్తం చూళ్లేదు గనక అన్ని అంశాలపైసమగ్ర చర్చ చేయబోవడం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *