నేతాజీపై రోజుకో కథ అవమానకరం

1968 లో నేతాజీ బతికేవున్నారు.. ఇది తాజాగా చాలాపత్రికల్లో కనిపించిన శీర్షిక. ఎడతెగని సీరియల్‌లా నరేంద్ర మోడీ ప్రభుత్వం విడుదల చేస్తున్న నేతాజీ ఫైళ్లలో ఈ సంచలన సమాచారం వున్నట్టు ప్రచారం జరుగుతున్నది. అయితే ఇందుకు ఆధారం ఏమిటి అంటే నరేంద్ర నాథ్ సిక్దర్ అనే పాత్రికేయుడు 2000 సంవత్సరంలో సమర్పించిన ఒక అఫిడవిట్ మాత్రమే. అందులో వున్నదేమంటే సిక్దర్ తనకు మరెవరో చెప్పినట్టు చెబుతున్న సమాచారం. ఇంతకూ ఈ చెప్పిందిఎప్పుడంటే వాజ్‌పేయి ప్రభుత్వం వున్నప్పుడే! నెహ్రూ విషయం కాంగ్రెస్ ప్రభుత్వాల మాట వదిలేద్దాం. హఠాత్తుగా నేతాజీపై ఇంత అభిమానం చూపిస్తున్న బిజెపి వారు అధికారంలో వుండి ఎందుకు ఆ అఫిడవిట్‌ను బయిటపెట్టలేదు? దాని ఆధారంగా రష్యా ప్రభుత్వంపై ఎందుకు ఒత్తిడి తీసుకురాలేదు?అప్పటికి అక్కడ కమ్యూనిస్టు ప్రభుత్వం పడిపోయి దాదాపు దశాబ్ది గడిచింది గనక తేలిగ్గా విషయాలు తెలుసుకుని వుండొచ్చుకదా!
ఇంతకూ నరేంద్ర సిక్దర్ 1966 – 68మధ్య సోవియట్‌లో పనిచేశారు. అప్పుడు ఆయన నిఖిల్‌చటోపాధ్యాయ అనే మిత్రుణ్ని కలుసుకున్నారు. ఈ నిఖిల్ వీరేంద్ర నాథ్ చటోపాధ్యాయ అనే బెంగాలీ విప్లవ కారుని కుమారుడు. ఈయన సైబీరియాలో నేతాజీని కలుసుకున్నట్టు తనకు చెప్పారన్నది సిక్డర్ అఫిడవిట్. బయిటకు వస్తే నెహ్రూ ప్రభుత్వం తనను యుద్ధ నేరస్తుడిగా ప్రకటించినట్టయితే స్టాలిన్ హతం చేయొచ్చని ఆయన భయపడ్డారని నిఖిల్ చెప్పారట. నాటిసోవియట్ నాయకత్వం చర్చించుకుని ఏం చేయాలని లండన్‌లో హైకమిషనర్‌గా వున్న కృష్ణమీనన్‌ను సలహా అడిగిందట. ఆయన అన్ని విధాల నెహ్రూకు అనుకూలంగానే మాట్లాడుతూనే విషయం నేతాజీ వున్న బయిటకు రానివ్వద్దనిచెప్పారట. స్టాలిన్‌కు నెహ్రూ ప్రభుత్వంతో అంత పెద్ద సంబంధాలు లేవన్నది మొదటి విషయం. రెండవది కృష్ణమీనన్ నెహ్రూ అనుకూలుడైతే ఆ సమాచారం చేరవేసి చర్య తీసుకునట్టు చేస్తాడు గాని బయిట పెట్టవద్దని ఎందుకు చెబుతారు? మూడవది స్టాలిన్ 1952లోనే మరణించారు. తర్వాత వచ్చిన కృశ్చెవ్ ఆయనపై తీవ్ర దాడి సాగించారు. అలాటప్పుడు అంతకు ముందు తీసుకున్న నిర్ణయానికే ఎందుకు కట్టుబడివుంటారు? చివరిది అన్నీ అంత రహస్యంగా వుంటే నిఖిల్ వెళ్లి నేతాజీని కలుసుకోవడం ఎలా సాధ్యమైంది? అతన్ని సిక్డర్ కలుసుకుని ఎలా తెలుసుకున్నాడు? ఆ సమాచారం మరో ముప్పయ్యేళ్లు ఎందుకు దాచి పెట్టారు? ఆయన ఒక్కడు మరెవరో తనకు చెప్పారని చెప్పినదానికన్నా నేతాజీసహచరుల మాటలకు ఎక్కువ విలువ వుండదా?
కథకు కాళ్లు లేవు ముంతకు చెవులు లేవు అన్నట్టు నేతాజీని అడ్డం పెట్టుకుని గందరగోళం సృష్టించే ప్రయత్నం తప్ప ఇందులో ఎక్కడా ఇంతవరకూ ఫ్రథమ శ్రేణి అధారం చూపిన దాఖలా లేదు. నేతాజీ స్థాపించిన ఐఎన్‌ఎ బందీల తరపున కోర్టులో ప్రత్యేకంగా వాదించి నెహ్రూ తన గౌరవం చూపించుకున్నారు. అలాటి వ్యక్తి ఆయనను యుద్ధఖైదీగా ప్రకటించుతారని చెప్పడం కన్నా దారుణం మరొకటి వుండదు. అన్నిటినీ మించి ముఖర్జీ కమిషన్‌ను వేసిందే బిజెపి అయినప్పుడు ఈ వివరాలను ఎందుకు ఉపయోగించుకోలేదు? పదిహేనేళ్ల దాకా ఎందుకు ఆగారు? అంటే మోడీ వాజ్‌పేయి సర్కారుపైన కూడా ఆరోపణలు చేయదల్చుకున్నారా?
గుమ్‌నామ్ బాబానే మారువేషంలో వున్న నేతాజీ అన్న ప్రచారం ఇంతవరకూ జరిగింది.దాన్ని బలపర్చే పత్రం ఒక్కటైనా ఈ విడుదలైన వాటిలో వుందా?ఈ మధ్యనే కర్ణాటకలో మరో బాబాను నేతాజీ అంటూ హడావుడి చేశారు. ఇదంతా నేతాజీని గౌరవించడమా లేక అవమానించడమా? మరణించిన వ్యక్తి పేరిట రకరకాల కథలు పత్రికల క్లిప్పింగులు వదంతులు అప్పుడప్పుడూ వదులుతూ ఆయన వారసత్వాన్ని తమ ఖాతాలో వేసుకోవాలనుకోవడం హేయం. నిజంగాప్రభుత్వానికే ఏదైనా అంచనా వుంటే ప్రకటించి తగు చర్యలు తీసుకోవచ్చు.