కావాలనే వివాదాల కొనసాగింపు!

ఎపి తెలంగాణ విభజన జరిగి రెండేళ్లు గడిచినా వివాదాలు కొనసాగుతూనే వున్నాయి. నదీజలాల వంటి క్లిష్టమైన దీర్ఘకాలిక అంశాలే గాక కొంత సులభంగా పంచుకోగలిగిన తేల్చుకోగలిగినవి కూడా పరిష్కారం కావడం లేదు. ఖచ్చితంగా చెప్పాలంటే కూచుని తేల్చుకోవడం లేదు. ఉదాహరణకుఎపి తెలంగాణ విభజన ఉమ్మడి సంస్థల సమస్యలు కూడా కొనసాగుతున్నాయి. సుప్రీం కోర్టు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా ఫలితం లేదు. ఇటీవలనే ఇరురాష్ట్రాలతో సమావేశమైన కేంద్రం ఉభయుల వాదనలను ప్రస్తావించి వారే ఒక అభిప్రాయానికి రావాలంటూ చేతులెత్తేసింది. ఇలా మూడు పక్షాలూ చేయడానికి కారణమేమిటి? తెలంగాణ సర్కారుకు సంబంధించిన వారి సమాధానం ఆసక్తిగా వుంది. పదోషెడ్యూలులోని సంస్థలపై ఏదో ఒక పరిష్కారం చేసుకోవడం పెద్ద సమస్య కాదు. ఎక్కువ భాగం తేలిగ్గా తేల్చుకోవచ్చు. ఎపి ప్రభుత్వం కూడా వాటిని ఎలాగో పంచుకుని ఎంతో కొంత తీసుకుని వెళ్లిపోదామనుకుంటున్నది. మాకూ అదే భావం వుంది. అయితే-
ఇంతకంటే పెద్ద సమస్యల పరిష్కారానికి ఇవి ఒక కవచంగా వుంటున్నాయి. ఉదాహరణకు నదీజలాల వంటి సమస్యల్లో ఎగువన వున్నాము గనక సమస్య లేదు గాని ఎపి సర్కారు హైకోర్టు సంగతి తేల్చడం లేదు. మేము అన్నీ సజావుగా ముగించేస్తే వారు అస్సలు మాట వినరు. ప్రధాన సమస్యలు తేలేవరకూ ఎన్ని వివాదాలు కొనసాగుతుంటే అంత మంచిది. పులిచింతల నిర్వాసితులకు పరిహారంపై కూడా ఒత్తిడి పెంచుతాము. పెద్ద సమస్యలు తేలితే పదో షెడ్యూలు సంస్థలు పదినిముషాల్లో పంచేసుకోవచ్చు అని ఒక నాయకుడు వివరించారు.
ఎపి ప్రభుత్వం కూడా ఇలాగే ఆలోచిస్తున్నది. పైగా ఎక్కువ సంఖ్యలో సమస్యలు వుండడం కూడా సానుభూతి వుంటుందనేది వారి ఆలోచన. పైగా పదో షెడ్యూలులో నిజంగా పనికి వచ్చేవి పదిపదిహేను కన్నా లేవని కీలకమైన పదవిలో వున్న ఒక నిపుణుడు వ్యాఖ్యానించారు. వాటి గురించి వూరికే వెంటపడటం వృథా. కొన్ని మూత వేసేవే.పైగాప్రభుత్వ సంస్థలంటే మాకెలాగూ పెద్ద ప్రాధాన్యత లేదు. వాటిలో ఏ కాస్త నిధులో వస్తాయని శాశ్వతంగా నిర్వహణ భారం నెత్తికెత్తుకోలేము. ఏదో ఒక విధంగా వివాదం నడుస్తుంటే మాకు ఓపికవచ్చినప్పుడే పరిష్కారం చేసుకుంటాము. కదా అని ఆయన వివరణ. ఇక కేంద్రం అంటే బిజెపి తన ఇరు రాష్ట్రాల మధ్య తగాదాలు వుంటేనే తన ఉనికి వుంటుందని అసలైన అధికారం మా చేతుల్లో వుందని చెప్పుకోవచ్చని ఆలోచిస్తున్నది. కనుకనే వెంటవెంటనే చర్చలు జరిపి పరిష్కారాలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు.
ఇలా ఎవరి కారణాల వల్ల వారు చిన్న పెద్ద వివాదాలు కొనసాగించడం వాతావరణాన్ని పాడు చేస్తున్నది. అనవసరమైన వేడి పెంచుతున్నది. అంతలోనే స్నేహగీతాలు ఆలపించడం శత్రువుల్లా ఆరోపణలు చేసుకోవడం ఒక ప్రహసనంలా మారింది. ఇప్పటికైనా నిర్దిష్ట కాలపరిమితి పెట్టుకుని అన్ని విషయాల్లో అవగాహనకు రాకపోతే ప్రజలు విసుగెత్తిపోతారు. అదేదో వ్యూహం అనిపాలకపక్షాలు అనుకోవచ్చు గాని అసలు సంగతి తెలుసుకోలేనంత అమాయకత్వంలో ప్రజలుండరు. కాకపోతే అటూ ఇటూ కూడా రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడేవారు, ఇంకా ప్రాంతీయ ఉద్రేకాలు తగ్గని వారు మాత్రమే ఈ వివాదాలను కోరుకుంటారు తప్ప అక్కడా ఇక్కడా సామాన్య ప్రజలు ఇష్టపడటం లేదు.