మోడీపోలనకు అమెరికా అవహేళన

ind,ch,us

నా ఫేస్‌బుక్‌,వెబ్‌సైట్‌ చూసే మిత్రులు నా వ్యాఖ్యలు ఎప్పటికప్పుడు గమనిస్తుంటారని అనుకోవడంలో పొరబాటు లేదు. ఒక దశలో కొన్ని వ్యాఖ్యలకు గాను నాపై తీవ్రంగా దాడి చేసిన మిత్రుల కోసం తర్వాత అవి నిజమైన తీరును చెబుతుంటాను. అలాటి ఒక ఉదాహరణే ఇప్పుడు ఇవ్వబోతున్నాను. ఇటీవల ఫ్రధాని మోడీ అమెరికా పర్యటన సందర్భంలో పార్లమెంటు మోగిపోయిందని పెద్ద ప్రచారం చేశారు. ఇదంతా మామూలేనని గతంలో మన్మోహన్‌సింగ్‌ను కూడా ఇలాగే ఆకాశానికెత్తి తర్వాత అమాంతం కిందపడేశారని నేను చాలాసార్లు రాశాను. మోడీ పర్యటన సమయంలో గొప్ప విజయంగా చెప్పుకున్న ఎన్‌ఎష్‌జి సభ్యత్వం ఎలాగూ రాలేదు. ఇక ఇప్పుడు నేరుగా అమెరికా అధికార వ్యవస్థలే ఆయనను అవహేళన చేయడం ప్రారంభమైంది. మోడీ ప్రభుత్వానికి మాటలెక్కువ చేతలు తక్కువ అని అమెరికా విదేశాంగ శాఖ అధికారిక నివేదికలో అంచనా వేసింది. వ్యాపార నిర్వహణ సులభతరం చేయడం, విదేశీ పెట్టుబడులను అవకాశాలు పెంచడం వంటివి చాలా చెబుతున్నా జరుగుతున్నది స్వల్పమని కొట్టిపారేసింది. అసలు ఈ విధానాలతో ఇండియా 7.5శాతం వృద్ధి రేటు సాధించడం అనుమానమేనని కూడా వ్యాఖ్యానించింది. ఇక అమెరికా సెనేట్‌ కమిటీకి చైర్మన్‌గా వున్న రిపబ్లికన్‌ ఎంపి బాబ్‌ కార్నర్‌ కూడా మోడీకి మాటలెక్కువ ఫలితాలు తక్కువ అని విమర్శించారు. ఇదే సమయంలో అమెరికా మీడియాలోనూ ఇలాటి మాటలే వినిపిస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే మన్మోహన్‌సింగ్‌ విషాద వదనం గురించి రాసినవి గుర్తుకు వస్తాయి. వందశాతం ఎఫ్‌డిఐలను అన్ని రంగాల్లోనూ అనుమతించిన తర్వాత కూడా ఇలా అంటున్నారంటే మరింత ఒత్తిడి చేసి ఇంకా లొంగదీసుకోవడమే వ్యూహం అని పసిపిల్లలు కూడా చెప్పగలరు. అయితే అలాటి దేశం మెచ్చుకోళ్లకు మురిసిపోయి మన నేతలు ప్రభుత్వాలు స్వదేశంలో టముకు వేసుకోవడం మన దుర్భాగ్యం. వారు పొగిడినా తెగిడినా తమ ప్రయోజనాల కోసం తప్ప మనకోసం కాదని తెలుసుకుంటే మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *