వేయినాల్కల విద్వేష రాగం

మాటతప్పిన మనుషులు మామూలుగా మొహం చాటేస్తుంటారు. తప్పు చేసిన వారు తప్పుకుని తిరుగుతుంటారు.బొక్కబోర్లపడి బోనులో దొరికిన వాళ్లు బిక్కమొహం వేస్తుంటారు. కాని ఇవన్నీ వర్తించే కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాత్రం ఎక్కడలేని ఓపిక తెచ్చుకుని ఎదురుదాడికి ఎగబడుతున్నారు.శిఖండిని ముందుపెట్టుకుని యుద్ధం చేసినట్టు కాంగ్రెస్‌ను ముందుపెట్టి కమ్యూనిస్టులపై విషం కక్కుతున్నారు. మోడీభజనలో మునిగితేలుతూ ప్రజాసంస్థలపై విరుచుకుపడుతున్నారు. .గతంలో మోడీ దేవుడిచ్చిన కానుక అన్న వెంకయ్య ఇప్పుడు అసలు దేవుడే అంటూ సవరణ తెచ్చారు. . తమాషా ఏమంటే- ఇలా వెంకయ్య మోడీ భజన చేస్తుంటే కొన్ని అగ్రశ్రేణి మీడియా సంస్థలు వెంకయ్య ప్రచారంలో పరవశిస్తున్నాయి. ఈ అద్భుత కలయికలో ఆకాశమంత అసత్యాలను అనంత సత్యాలుగా ప్రజల ముందు ప్రచారం చేసేస్తున్నారు. గతంలో వాజ్‌పేయి హయాంలో పీల్‌గుడ్ అన్నదాన్ని మించి పోయి ఇప్పుడు అచ్చంగా స్వర్ణయుగం నడుస్తున్నట్టు చెబుతున్నారు.ఈ మధ్య ఈనాడులో వెంకయ్య నాయుడు రాసిన వ్యాసం ఇందుకో ఉదాహరణమాత్రమే.
ఇటీవల నాలుగోసారి రాజ్యసభకు నామినేట్ అయిన వెంకయ్య నాయుడుకు సన్మానాలు జరిగిన సందర్భంలో చాలా సూక్తులు వినిపించారు. తాను ప్రత్యక్ష ఎన్నికల్లో తనను ఓడించేందుకు ఇందిరాగాంధీ ఎన్టీఆర్ వచ్చినా గెలిచానని దేశం కోసమే ఇతర రాష్ట్రాల నుంచి రాజ్యసభకు వెళ్లానని ప్రకటించారు. ఇంతకన్నా అతిశయోక్తులు వుండవేమో. నోరుగల నాయకుడు వుంటే మంచిదని నెల్లూరు జిల్లాలో భూస్వామ్య శక్తులు పార్టీతేడాలను పక్కనపెట్టి వెంకయ్యను గెలిపించిన తీరు రాజకీయ పరిజ్ఞానం వున్నవారందరికీ తెలుసు. అందులోనూ కమ్యూనిస్టు వ్యతిరేకత ప్రధానంగా పనిచేసింది. పైగా 1978లో జనసంఘంగా గాక జనతా పార్టీ ముద్రతో ఆయన అసెంబ్లీకి వెళ్లారు. 1983లోనూ ఇతరుల లోపాయిసహకారం ఆయనకు లభించింది.
తనపాత్రపైనా అతిశయాలు
ఎన్టీఆర్‌కు వెన్నుపోటు ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమం తానే వెనకవుండి నడిపించినట్టు చెప్పుకోవడం మరింత స్వోత్కర్ష.యువనేతగా ఈయన కూడా వుండొచ్చుగాని అప్పటికి బిజెపికి పెద్దగా రాష్ట్ర ప్రభుత్వాలు లేవు. నిజానికి అప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రి రామకృష్ణహెగ్డే, బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతిబాసులతో సహా చాలా మంది జాతీయ నాయకులు అండగా నిలిచారు. సుందరయ్య బసవపున్నయ్య,రాజేశ్వరరావు,వాజ్‌పేయి, బహుగుణ వంటి అతిరథులంతా తరలివచ్చారు.చంద్రబాబు నాయుడు తెలుగుదేశంలో వ్యూహం నడిపించారు. ఇవన్నీ వాస్తవాలుకాగా మాటిమాటికీ తానే ప్రజాస్వామ్య పునరుద్దరణ సారథినైనట్టు చెప్పుకోవడం వెంకయ్యకు తగనిపని. ఆ తర్వాత ఏడాది తిరక్కుండానే ఎన్టీఆర్‌పై కత్తికట్టి తప్పుల దండకం ప్రకటించింది కూడా బిజెపినే. రథయాత్ర తర్వాత ఆయన బిజెపిని పూర్తిగా పక్కకు పెట్టేశారు. బిజెపి రహిత ఫ్రంట్లకు ఎన్టీఆర్‌చంద్రబా బు ఆధ్వర్యం వహించారు. తర్వాత చంద్రబాబు బిజెపితో జతకట్టి వెంకయ్యతో చెట్టపట్టాలు వేసుకున్నారు. అది వారిష్టం కాని దానికోసం చరిత్రనంతా తారుమారుగా చెప్తే చెల్లుబాటవదు. నిజానికి జాతీయ నాయకత్వలోకి ఎదిగింది వెంకయ్య నాయుడు ఒక్కరే కాదు.వారిపార్టీలోనూ వామపక్షాలలోనూ కాంగ్రెస్‌లోనూ ఆ జాబితాలో చెప్పుకోదగిన వారు ఇంకా వున్నారు. అయితే ఆ హౌదాలో వుండి ఏం ఒరగబెట్టారన్నది అసలు సమస్య. ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హౌదాపై అంతులేని ఆర్భాటం చేసి అందరికన్నా ముందే చేతులెత్తేసిన పెద్ద మనుషులు ఏదో ఒరగబెట్టామని గొప్పలు పలకడం బొత్తిగా చెల్లుబాటు కాదు. చంద్రబాబు వెంకయ్యల పరస్పర పొగడ్దలు ఆ పార్టీల్లో వారే భరించలేకపోతున్నారన్నది అసలు నిజం.
పదాలు కాదు… చైతన్య నాదాలు
వెంకయ్య కమ్యూనిస్టులపై రాజకీయ శాపనార్థాలు పెట్టడం కొత్తేమీ కాదు. కాకపోతే వారినీ కాంగ్రెస్‌నూ కలిపి నిందించడంలోనే రాజకీయ కుత్సితం వుంది. రాష్ట్ర విభజనలో కాంగ్రెస్‌తో చేతులు కలిపింది వారే. ఎన్నికల్లో గెలిచాక కాంగ్రెస్ యుపిఎ విధానాలను మరింత జోరుగా కొనసాగిస్తున్నదీ వారే. దానికి తమ మార్కు మతతత్వం జోడించి దేశాన్ని అసహనం అగ్నిగుండంలో నెట్టిందీ వారే. వీటన్నిటిని నికరంగా ప్రశ్నిస్తున్నందుకే కమ్యూనిస్టులపై ఇంతటి దురాగ్రహం. కమ్యూనిస్టులు దేశానికి చేసిందేమీ లేదట. వారు తెచ్చిన మంచి మార్పులు అస్సలు లేవట. మోడీ ప్రసంగాలలో చరిత్ర ప్రస్తావనలు తప్పుగా చేయడం తెలుసు గాని సుందరయ్య జన్మస్థలమైన నెల్లూరు జిల్లాలో పుట్టిన ఈ నాయకుడికి దేశంలో కమ్యూనిస్టులు సాధించిన విప్లవాత్మకమైన మార్పులు ప్రజా హక్కులు చట్టాలు తెలియకపోవడం దారుణం. భూస్వామ్య ఆధిపత్యాలపైన ధనస్వాముల దోపిళ్లపైనా తరతరాల పీడనలపైన సాంఘిక వివక్షలపైన పోరాడింది కమ్యూనిస్టులే తప్ప కమలం పార్టీ కాదని ఏ రాజకీయ విద్యార్థినడిగినా చెబుతారు. దేశానికి మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఇచ్చింది ముప్పైనాలుగేళ్లు అప్రతిహతంగా పాలించింది కమ్యూనిస్టులే. మతవాదులు, సామ్రాజ్యవాదులు పెట్టుబడిదారులు,బూర్జువాలు, నయా ఉదారవాదం వంటి పదాలను కమ్యూనిస్టులు ముందుకు తెచ్చారని (బాక్సు కట్టి మరీ) కోప్పడుతున్నారు. తనకు తెలియకుండానే వారు చూపించిన గొప్ప ప్రభావాన్ని అంగీకరిస్తున్నారన్నమాట. కమ్యూనిస్టులే లేకపోతే వినాశకర విధానాలను అందమైన పదాలతో చలామణి చేసి వుండొచ్చని ఒప్పుకుంటున్నారన్నమాట.శ్మశానాల వంటి నిఘంటువులు దాటి అని శ్రీశ్రీ అన్నట్టు కాలానుగుణమైన చైనత్యవంతమైన పదాలను సృష్టించడం ఆ దారిలో కదం తొక్కించి కదనానికి కదిలించడం కమ్యూనిస్టులు మాత్రమే చేస్తారు గనకనే ఇలాటి వారికి ఇంత ద్వేషం. ఒకప్పుడు గాంధేయ సోషలిజం తమ లక్ష్యంగా ప్రకటించుకున్న పార్టీ మాజీ అద్యక్షుడు కమ్యూనిస్టుల పదంపైన పథంపైన దాడి చేయడం బజెపి బూటకత్వాన్ని వెల్లడించే ఉదాహరణ
ఉక్రోషంతో కువిమర్శలు
ఇక కాంగ్రెస్‌తో సహకారం విషయానికి పివినరసింహారావు హయాంలో ఆయన విధానాలకు వీరు, వీరి విధ్వంసానికి ఆయన ఎలా సహకరించుకున్నారో ఇప్పుడు దేశమంతటాచర్చ జరుగుతున్నది. సభలోనూచాలాసార్లు ఆ ప్రభుత్వాన్ని కాపాడారు. ఆ విధానాలనే ఇంకా తీవ్రంగా అమలు చేస్తున్నారు.సభలో పదేపదే ఇది గత ప్రభుత్వ విధానమేనని ప్రకటిస్తున్నారు. తానే ముఖ్యమంత్రిగా వుండి వ్యతిరేకించిన జిఎస్‌టిని కూడా మోడీనే ఆమోదింపజేస్తున్నారు. ఇందుకోసం కాంగ్రెస్ నేతలతో మంతనాలు జరిపి ఫలహారాలు జరిపారు. కమ్యూనిస్టులను ఓడించడం కోసం బెంగాల్‌లో తృణమూల్‌కూ కేరళలో కాంగ్రెస్‌కు సహకరించారు. పినరాయి విజయన్ ప్రభుత్వం ఏర్పడిన ద్వారా ఘర్షణలతో ఉద్రిక్తత పెంసృష్టిస్తున్నారు.అలాటి వారు కాంగ్రెస్‌తో కలిశారని కమ్యూనిస్టులపై నిందలు వేయడం హాస్యాస్పదం. బెంగాల్‌లో అనుసరించిన ఎత్తుగడలు సరికాదని సిపిఎం కేంద్రకమిటీయే ప్రకటించింది. కాని అక్కడ దారుణమైన పరిస్థితినీ ప్రస్తావించింది. ఎమర్జన్సీని బలపర్చిన సిపిఐ ఆత్మ విమర్శ చేసుకుంది. మరి ఇందిరాగాంధీకి మద్దతునిస్తామని లేఖలు రాసిన ఆరెస్సెస్ అధినేత దేవరస్ ఆయన వారసులు గాని ఏం ఆత్మ విమర్శ చేసుకున్నారు? దేశంలో ఎమర్జన్సీ నాటి పరిస్థితులు పునరావృతమవుతున్నాయని అగ్రనేత అద్వానీనే హెచ్చరించే పరిస్థితి ఎందుకు వచ్చిందో ఒకప్పటి ఆయన ప్రియిశిష్యులుీ వివరిస్తారా? ఇలాటి కారణాల వల్లనే దేశంలో రచయితలు కళాకారులతో సహా అవార్దులు వెనక్కు ఇచ్చి ఆగ్రహం ప్రకటిస్తే వారిపైనా ి కక్ష కట్టారు. కాంగ్రెస్‌కు రాజ్యాధికారం ఇచ్చి విద్యా సాంసృతిక రంగాలను తాము తీసుకునేట్టు కమ్యూనిస్టులు క్విడ్ ప్రోకో చేసుకున్నారని ఆరోపించడం కుసంస్కారం తప్ప మరొకటి కాదు. ఎందరో విజ్ఞానఖనులూ, నిస్వార్థ ప్రజాపక్ష మేధావులు కమ్యూనిస్టు భావాలను గౌరవించవచ్చు. వారిని గౌరవనీయ స్థానాల్లో నియమించడం క్బిడ్ ప్రోకో గా కనిపించడం భావదారిద్య్రమే. ఇప్పుడు బిజెపి నియమించిన చాలామంది బాహాటంగా మోడీపట్ల సంఫ్‌ు పట్ల విధేయత చాటుకుని వికృత వివాదాలు సృష్టించి న్యాయస్థానాల్లోనే అక్షింతలు వేయించుకుంటున్నారు. కన్నయ్యకుమార్ వంటి విద్యార్థినేతనే సహించలేక ఆయనను కమ్యూనిస్టులు హీరోను చేశారని ఆరోపించిన వెంకయ్యనాయుడు హెచ్‌సియులో రోహిత్ విషాదాంతం తదితర విషయాల్లోనూ విచారం కన్నా విమర్శలే చేస్తారు. ఆ అక్కడ అన్ని ఆరోపణలకూ మూల విరాట్టుగా వున్న విసి అప్పారావు ఆయన ప్రత్యక్ష పరోక్ష ఆశీస్సులతోనే అధికారం వెలగబెడుతున్నారనేది బహిరంగ రహస్యం.
ప్రజలే ప్రేరణ..
రాజకీయాలలో ఇతర పార్టీలు రైవల్స్ తప్ప ఎనిమిస్ కాదని హితబ్‌ోధ చేసే వెంకయ్య కమ్యూనిస్టులను మాత్రం ఆగర్భశత్రువులుగా ఆడిపోసుకుంటారని చెప్పడానికి ఇది చాలు. ఆశయాలకు కట్టుబడి అశేష జనంతో పనిచేస్తున్నంత కాలం అధికారం వున్నా లేకపోయినా ప్రజల ఆదరణ లభిస్తూనే వుంటుంది. ఆ ప్రజాశక్తిలో కమ్యూనిస్టులకు ఎప్పటికీ లోటులేదు గనకే గెలిచినా ఓడినా ఎక్కడికక్కడ ప్రజల మధ్యనే వుండి పనిచేస్తుంటారు. హక్కులకోసం పోరాటాలు చేస్తుంటారు. అటు మతతత్వం ఇటు కార్పొరేట్ మార్కెట్ల సేవలో తరించే పాలకపక్షనేతలకు ఇది బోధపడకపోవచ్చు. మోడీ పాలనను వెంకయ్య నాయుడు వంటివారు ఎంతగా పొగిడినా ఆర్థికసూచికలన్నీ అధోగతిలో పయనిస్తున్నాయి. ఆర్థిక సంస్థలు కుప్పకూలుతున్నాయి. రిజర్వు బ్యాంకు గవర్నర్ ఆందోళన వెలిబుచ్చుతున్నారు. ఇవన్నీ విస్మరించి ప్రపంచ బ్యాంకు అద్యక్షుడి ప్రశంసలకు విదేశీ నేతల పొగడ్దలకు మురిసిపోతే చేటు తప్పదు. ఎందుకంటే వారు గతంలోనూ మన్మోహన్‌తో సహా అందరినీ మునగచెట్టిక్కించి తర్వాత ఎలా ముంచేశారో చూశాం. నిన్నగాక మొన్న ఎన్‌ఎస్‌జిలో సభ్యత్వం ఇప్పిస్తారని ఆశపడి అమెరికాకు ఆసాంతం లొంగిపోయిన భంగపాటు తప్పలేదన్న నిజం మనముందుంది. అమెరికా చుట్టూ ప్రదిక్షణలు చేసి దాని ఉపగ్రహంగా మారి ఫలితం రానందుకు చైనాను తిట్టడంలోనూ ఇలాటి కుతర్కమే కనిపిస్తుంది.దేశాభివృద్ధిలోనూ విదేశాంగ విధానంలోనూ ఇలా వరుస వైఫల్యాలు వివాదాలు మూటకడుతున్న నేపథ్యంలో వెంకయ్య వంటివారు పరనింద మాని ఆత్మావలోకనం చేసుకోవడం శ్రేయస్కరం. లేకపోతే బీహార్ ఢిల్లీ ఫలితాలు పునరావృతమవుతాయి. (ప్రజాశక్తి, జులై3,2016)