విస్మరణ, సంస్మరణ!
అరసింహుడా నరసింహుడా పేరిట నేను రాసిన పోస్టుకు కొందరు అభ్యంతరాలు తెలిపారు. నన్ను మామూలుగా అభినందించేవారు కూడా ఈ వ్యాఖ్యలు జీర్ణం చేసుకోలేకపోతున్నట్టు అర్థమవుతున్నది. ఈ మొత్తంలో ఎక్కడా పిపిపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేసింది లేదు. ఆనాటి పరిణామాలు ఆయన పాత్ర గురించిన విశ్లేషణగానే రాశాను. అయితే ఫేస్‌బుక్ మిత్రుల విమర్శలను చూసినా నేను టూర్ వెళ్లినందున వెంటనే స్పందించలేదు. ఈ నేపథ్యంలో నా అభిప్రాయాలు పూర్తిగా అర్థం కావడానికి నేను మొన్న శుక్రవారం ఆంధ్రజ్యోతిలో రాసిన నా వ్యాసం ఇస్తున్నాను.
విస్మరణ, సంస్మరణ!
చరిత్ర విజేతల ఖడ్గంతో రాయబడుతుందంటారు. ఎవరు గెలిస్తే వారి వాదనలే అందులో కనిపిస్తాయని కవి హృదయం.. మొన్నటి ఎన్నికల్లో మోడీ నాయకత్వాన బిజెపి ఘన విజయం సాధించింది గనక ఇలాటి మధనం మరోసారి మొదలైంది. నెహ్రూ ఇందిరలను తగ్గించడం, సర్దార్ పటేల్, దీనదయాళ్ ఉపాధ్యాయ ఇత్యాదులను పైకి లేపడం ఈ ప్రక్రియ ముఖ్యోద్దేశం. ఆ మాటకొస్తే ఎన్నెన్నో గొప్ప మార్పులకు పోరాటాలకు ఆధ్వర్యం వహించింది కమ్యూనిస్టులే. జనసంఘం/బిజెపి చాలా ఆలస్యంగా ప్రభావశీలమై ప్రాబల్యం పెంచుకున్నాయి. అధికారంలో సంఘీయులు వున్నారు గనక వారికి అనుగుణంగానే భాష్యాలు వెలువడుతుంటాయి. ఈ పరంపరలోనే ఇప్పుడు మాజీ ప్రధాని పివినరసింరాహావుపై పునరంచనా మొదలైంది.నాయకులను పరిణామాలను కూడా పునరంచనా వేయడం నిరంతరం జరుగుతుండాల్సిందే. కాని అది వ్యక్తిగత రాగద్వేషాల మీదనో కుల మ త ప్రాంత నేపథ్యాలమీదనో అధారపడి జరిగితే అపాయం తప్పదు. పివి ప్రధానిగా సరళీకరణ విధానాలు మొదలై పాతికేళ్లు గడిచాయి. ఆ తర్వాత ఏడాదిలోనే బాబరీ మసీదు విధ్వంసంతో దేశ రాజకీయాలు మతైక సంబంధాలు పూర్తిగా మారిపోయాయి. ఆయన అధికారం చేపట్టినకొన్నాళ్లకే తొలి సోషలిస్టు రాజ్యమైన సోవియట్ యూనియన్ విచ్చిన్నమై పోయింది.కనుక ఈ పాతికేళ్ల కాలం దేశానికి ప్రపంచానికి కూడా చాలా సంచలనాత్మకమైంది.
వినరు
సీతాపతి రాసిన హాప్‌లయన్ అన్న పుస్తకం ఈచర్చకు సందర్భాన్ని సమకూర్చింది. దీన్నే తెలుగులో ఎమెస్కో వారు నరసింహుడు పేరిట అనువాదం విడుదల చేశారు. దీనికి ముందు 1991 ఆర్థిక సంస్కరణలపై మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేష్ రాసిన పుస్తకం కూడా పివి పాత్రను పరామర్శించింది. ఇప్పటివరకూ మామూలుగా చర్చలో వచ్చే ప్రస్తావనలూ చాలానే వున్నాయి.. తెలుగు బిడ్డ ఇంకా చెప్పాలంటే తెలంగాణముద్దుబిడ్డ, అపార రాజనీతిజ్ఞుడు, మహా విద్వాంసుడు పివిని సోనియా గాంధీ అవమానించారు. ఆయనమృతదేహాన్ని కూడా ఎఐసిసి కార్యాలయంలోకి రానివ్వకుండా ,అంత్యక్రియలు హైదరాబాదుకు మార్పించారు. . ఇదంతా ఖచ్చితంగా ఎలా జరిగింది, ఎవరు ఏమన్నారు సూక్ష్య వివరాలు పక్కనపెడితే ఈ విషయాలన్నీ బహిరంగంగానే జరిగాయి. అంత:పుర కుట్రలు చూసిన వారికి ఇవన్నీ బాధనిపించినా ఆశ్చర్యం కలిగించవు. బహుశా పివి కూడా చాలా విషయాల్లో అంతే నిర్మొహమాటంగానూ నిర్దాక్షిణ్యంగానూ ప్రవర్తించారని చెప్పడానికి ఉదాహరణలు వుంటాయి. (సినికల్ అని వినరు సీతాపతి వ్యాఖ్యానించారు) ఆయన మితభాషి స్థితప్రజ్ఞుడు గనక ఆర్ద్రత ఆశించలేమన్నట్టు అనుకూలురు చెబుతుంటారు. అప్పుడు ఇతరవాస్తవాలను కూడా ఒప్పుకోవలసి వుంటుంది .రాజీవ్ గాంధీ హత్యానంతరం సోనియా గాంధీనే తిరస్కరించిన తర్వాతనే కొంత పోటీ మధ్యన పివికి పదవి దక్కింది. ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీకీ అంతే విధేయుడుగా కొనసాగారు. 1984 అక్టోబర్ 31న ఇందిర హత్య తర్వాత సిక్కులపై కాంగ్రెస్ నాయకులు వూచకోత సాగిస్తుంటే హౌం మంత్రిగా పివి వాటిని అదుపు చేసేందుకు కఠినమైన చర్యలకు ఉత్తర్వులివ్వాల్సింది పోయి ఉపేక్ష వహించారు. ు. వినరు సీతాపతి కూడా ఈ ఘట్టాన్ని పివిజీవితంలో అత్యంత దారుణక్షణంగా పరిగణిస్తారు. కాని ఆయనే బాబరీ విధ్వంసానికి సంబంధించిన సన్నివేశంలో పివి నిష్క్రియా ప్రియత్వానికి అనేక కోణాలు వెతుకడం వింతగా వుంటుంది. గుజరాత్ మారణకాండను ఖండిస్తూనే అందుకు మోడీని బాధ్యుడుగా చేయడం సరికాదని వినరు రాసిన వాక్యాలు గుర్తు చేసుకుంటే గనక ఈ రెండు విషయాల్లోనూ ఆయన పాటిస్తున్న తేడాకు మూలాలు కొంత తెలుస్తాయి. పివి చేసిన మంచి ఇప్పటికి మన ముందుంది. అదే సమయంలో ఆయన హయాంలో జరిగిన ప్రతికూల పరిణామాలు ఇప్పటికీ మనకు నష్టం చేస్తూనే వున్నాయి అనిఈపుస్తకం విడుదల చేసిన ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ తేల్చిచెప్పారు. పివి తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలను సానుకూల పరిణామాలు కాగా పార్లమెంటు నిర్వహణలో అనైతిక పద్దతులు, మనుగడ కోసం ఫిరాయింపులను ప్రోత్సహించడం వెంటాడే పీడకల అని తీవ్రంగానే తీర్పు చెప్పారు. ఆ దశలో బయిటపడిన కుంభకోణాలు ఆఖరుకు మాజీ ప్రధానిని కూడా బోనెక్కించాయి. సాంకేతికంగా తర్వాత బయిటపడి వుండొచ్చు గాని జరగాల్సిన నష్టం జరిగింది ఇన్నిటి మధ్యనా హవాలా కేసు పివి కావాలని బనాయించారన్నట్టు వినరుసీతాపతి చెప్పడం విడ్డూరం. బిజెపి అగ్రనేతలే దొరికిపోయిన ఈ కేసును కోర్టు డైరీ సాక్ష్యం కాదన్న సాంకేతిక కారణంతో కొట్టివేసింది తప్ప నిజాలు లేవని కాదు.
. సరే ఆర్థిక సంస్కరణలను .వామపక్షెేతరులంతా పూర్తిగా పొగిడేస్తుంటారు. చివరి దశలో పివినే తన చర్యల ఫలితాలు పేదలకు అందలేదని విచారం వెలిబుచ్చతుండేవారు. ట్రికిల్‌డౌన్ ఎకానమీ ఎక్కడా వాస్తవం కాదన్నది అప్పటికే అమెరికా బ్రిటన్‌లలో తేలిపోయింది. అయినా సరే తన మనుగడకు కార్పొరేట్ మద్దతు కావాలి కాబట్టే మన్మోహన్ సింగ్‌ను తెచ్చి ఆర్థిక మంత్రిని చేశారు. తర్వాత కాలంలో మన్మోహన్ ప్రధాని కావడానికీ ఇదే కారణం. ఈ దశలో అవినీతి భాగోతాలు ఆర్థిక దిగజారుడు తెలిసిందే. అయినా కొందరు పివిలాగే మన్మోహన్ మహౌత్తముడంటారు, దేనికోసం వీరి మంచితనం? సోవియట్ విచ్చిన్నం తర్వాత అలీన అగ్రదేశంగా భారతదేశం ముందునిలిస్తే ప్రపంచ చిత్రపటం మరోలా వుండేది. మనం అమెరికాకు సాంతం లంగిపోవడం వల్ల కలిగిన భంగపాటు మొన్న ఎన్‌ఎస్‌జి సమావేశంలోనూ విదితమైంది.
మరోవైపున ఆర్థిక విధానాలను పొగిడేవారికి కూడా బాబరీ విషయంలో బిన్నాభిప్రాయాలున్నాయి. అనేక మతాలున్న ఈ దేశంలో బాబరీ విధ్వంసంతో మతసంబంధాలు దెబ్బతినడానికి కారణం పివి వైఖరేనన్నది కాదనలేని సత్యం.అప్పట్లో సిబిఐ డైరెక్టర్‌గా వున్న విజయరామారావు బాబరీ కూల్చివేతకు శిక్షణ పొందారన్న సమాచారం తమకు ఆలస్యంగా తెలిసిందని అంటుంటారు గాని . మీడియాకు తెలిసింది వారికి తెలియదా?నిజం ఏమంటే పివి లోలోపల ఆరెస్సెస్ వారితో మంతనాలు జరుపుతూ నమ్మకం పెట్టుకుని కూచున్నారు. అద్వానీతోనే రహస్యంగా చర్చించారు. మసీదు విద్వంసానికి కొద్ది రోజుల ముందు విజయవాడ ప్రెస్‌క్లబ్ అద్యక్షుడుగా విహెచ్‌పి అద్యక్షుడు అశోక్ సింఘాల్‌తో మీట్ ద ప్రెస్ నిర్వహించాను. అప్పుడు మీరు తలపెట్టిన కరసేవ మరో మత ప్రళయానికి దారితీసే ప్రమాదముందని చాలా మంది ఆందోళన చెందుతున్నారని నేను అన్నాను. దానికాయన ఏదో సమర్థనగా మాట్లాడ్డమే గాక సంప్రదింపులు జరుపుగుతున్నాయని సూచనగా చెప్పారు. పిివి మంచి హిందువు అని కితాబిచ్చారు. లేకపోతే ఎన్‌ఐసి సమావేశంలో ప్రతిపక్షాల తరపున హరికిషన్‌సింగ్ సూర్జిత్ ప్రతిపాదించిన తీర్మానం అయోధ్యలో శాంతిని కాపాడ్డానికి ప్రధానికి సర్వాధికారాలుఇచ్చిన తర్వాత కూడాకఠిన చర్యలు ఎందుకు తీసుకోలేదు? కళ్యాణ్‌సింగ్ ప్రభుత్వాన్ని తొలగించేందుకు రాజ్యాంగం అడ్డువచ్చిందనేది వాస్తవం కాదు.బాబరీ మసీదు విధ్వంసానికి అవకాశమివ్వడం రాజకీయ కారణాల తో జరిగిందే తప్ప రాజ్యాంగ కొలబద్దలతో సరిపోదని ఉపరాష్ట్రపతి ఆవిష్కరణసభలోనే చెప్పేశారు. .విధ్వంసాన్ని నివారించడానికి తామంతా ఎన్నో సూచనలు చేసినా పివి వినిపించుకోలేదని ఈ కార్యక్రమానికి అద్యక్షత వహించిన మణిశంకర్ అయ్యర్‌ఆయన చెప్పారు. జై రామ్ రమేష్ భావాలు కూడా అలాగే వున్నాయి. పివి వ్యక్తిగత వైద్యుడు డా.శ్రీనాథరెడ్డి, సీతాపతి, మణిశంకర్ మాటలే గాక ఆ రోజున ఆయన వ్యవహరించిన తీరు గురించి హౌంమంత్రిగా వున్న ఎస్‌బిచవాన్ వంటివారు రాసింది చూసినా ఉపేక్ష స్పష్టంగా అర్థమవుతుంది. దీనంతటికి కారణం పివి ‘సంటర్ రైట్’ కావడమేనని మితవాద పునరుద్దరణ లో భాగంగానే పివి పాత్రపై అధ్యయనం బిజెపి అమితాసక్తి ఆయన అంగీకరించారు.ప్రధాని కావడానికి ముందు తమిళనాడులో ఒక మఠాధిపత్యం తీసుకోవడానికి ఆయన సిద్ధమైనారట.అసలు చంద్రస్వామి వంటి తాంత్రికుడి మాటలు నమ్మడం పివి వైదుష్యానికి సరిపడని వైపరీత్యం. చెప్పాలంటే ఇలాటివి అనేకం వున్నాయి. ి తొలి దక్షిణాది తెలుగు ప్రధానిగా అనుభవజ్ఞుడుగా గౌరవించవచ్చు గాని ఆనాటి విధానాలను పరిణామాలను సమర్తించాల్సిన పనిలేదు. 1994లో కాంగ్రెస్‌ను ఘోరంగా తిరస్కరించడం ద్వారా తెలుగుప్రజలు ఆ విధంగానే తీర్పునిచ్చారు. ఇప్పుడైనా పునరంచనాలు శాస్త్రీయంగా చారిత్రి దృష్టితో జరగాలి తప్ప కేవలం సెంటిమెంట్లతో కాదు. వ్యక్తుల పట్ల గౌరవాలు వారి వ్యవస్థాగత వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు దారితీయడం సరికాదు. (గమనం, ఆంధ్రజ్యోతి ఎడిట్‌పేజి; జులై 1, 2016)