స్పీకర్ నిర్ణయంతో సుప్రీం జోక్యానికి మార్గం!

వైసీపీ నుంచి పాలకపక్ష తెలుగుదేశంలోకి ఫిరాయించిన 13 మంది శాసనసభ్యులను అనర్హులను చేయాలంటూ దాఖలైన పిటిషన్లు సక్రమంగా లేవని స్పీకర్ డాక్టర్ కోడెలశివ ప్రసాదరా వు తిరస్కరించినట్టు ప్రకటించారు. వాటిని ముందు నోటరీ చేయించలేదనీ, మరికొన్ని ఇతర నిబంధనలను కూడా పాటించలేదని ఆయన వాటిని తోసిపుచ్చడానికి కారణాలుగా చెప్పారు. తమాషా ఏమంటే మొదట పిటిషన్ వేసిన ఎంఎల్‌ఎ అమరనాథరెడ్డి కూడా తర్వాత పార్టీ మార్చేశారు. ఈ ఫిరాయింపుదార్లపై స్పీకర్ తగు చర్యలు తీసుకోవడంలేదంటూ వైసీపీ ఎంపి మేకపాటి రాజమోహనరెడ్డి సుప్రీం కోర్టుకు వెళ్లారు. ఈ కేసు జులై 8న విచారణకు రానున్నట్టు సమాచారం. విచారణకు సందర్భంలో స్పీకర్ ఇంతకాలం ఎందుకు చర్య తీసుకోలేదనే చర్చ ముందుకు వస్తుంది. ఫలానా గడువులోగా తీసుకోవాలని కోర్టు వ్యాఖ్యానించవచ్చు. లేదా రాజ్యాంగ సంబంధమైన అసాధారణ వ్యాఖ్యలు కూడా చేయొచ్చు. అందుకు అవకాశం లేకుండా చేసేందుకే కోడెల హడావుడిగా నిర్ణయం ప్రకటించారని వైసీపీ విమర్శించిన దాంట్లో వాస్తవం వుండొచ్చు. సాధారణంగా కోర్టులు స్పీకర్లకు ఆదేశాలివ్వవు. అయితే ఒకసారి స్పీకర్ నిర్ణయం ప్రకటిస్తే అది పదవ షెడ్యూలు స్పూర్తికి అనుగుణంగా వుందా లేదా అని పరిశీలించే అవకాశంవుంటుంది. కనక కోడెల చర్యలో రెండు కోణాలు లేదా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మొదటిది- ఒకవేళ వైసీపీ వారి పిటిషన్లు సక్రమంగా లేవనుకున్నా ఫిరాయింపులపై తానుగా స్పందించవలసిన బాధ్యత అనుభవజ్ఞుడైన స్పీకర్ కోడెలకు లేదా? ఒకవేళ పాలకపక్షం నుంచి ఎవరైనా ఫిరాయించి ప్రభుత్వ మనుగడకే ముప్పు ఇస్తే ఇలాగే చేసేవారా? రెండవది- ఇప్పుడు ఈ నిర్ణయం ప్రకటించినంత మాత్రాన సుప్రీం కోర్టు ఏ వ్యాఖ్యలు చేయదని భావిస్తున్నారా? అలా అనుకుంటే మాత్రం పొరబాటే.ఎందుకంటే రాజ్యాంగ మౌలిక స్పూర్తి సమస్య వస్తే కోర్టులు నిక్షేపంగా జోక్యం చేసుకుంటాయి.కనుక కోడెల చర్య కోర్టు జోక్యానికి తలుపులు తీసినట్టే!