లోటస్ పాండ్‌తో సహా 749 కోట్ల ఆస్తుల కట్టడి

మనీ లాండరింగ్ ఆరోపణలపై వైఎస్సార్‌పార్టీ అధినేత జగన్మోహన రెడ్డికి చెందిన 749 కోట్ల విలువైన స్థిర చరాస్తులు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అటాచ్‌మెంట్(జప్తు కాదు, కట్టడి, లేదా తాత్కాలికస్వాధీనం) ప్రకటించడం రాజకీయంగా దెబ్బే. సామూహిక ఫిరాయింపులతో ఇప్పటికే వైసీపీ కొంత డీలా పడింది. కార్యాచరణ వ్యూహం కోసం పెనుగులాడుతున్నది. అక్రమాస్తుల కేసు వెనక్కు పోయిందని జగన్ అనుయాయులు భావిస్తున్న తరుణంలో బుధవారం హఠాత్తుగా ఇడి ఈ ఎటాచ్‌మెంట్ ప్రకటించింది.అంతేగాక ఆయన తన తండ్రి ఫ్రభుత్వాధికారాన్ని అడ్డుపెట్టుకుని క్విడ్‌ప్రోకో పద్ధతిలో పెట్టుబడుల రూపంగా నిధులు రాబట్టారని ఇడి హైదరాబాద్ ప్రాంత జాయింట్ డైరెక్టర్ ఎస్‌ఎ ఉమాశంకర్ గౌడ్ వివరించారు. ఇడి ఈ సందర్భంగా జారీ చేసిన ప్రకటనలో జగన్‌పై వున్న ఆరోపణలు ఆయన భార్య భారతీ రెడ్డి ఆద్వర్యంలో నడుస్తున్న భారతీ సిమెంట్‌కు అక్రమంగా గనుల కేటాయింపు వంటి అంశాలను కూడా ప్రస్తావించారు. ఈ తాజా అటాచ్‌మెంట్‌లో బంజరాహిల్స్‌లో ఆయన నివాసముండే లోటస్ పాండ్, సాక్షి భవనంతో సహా ఇంకా చాలా స్థిరాస్తులు చరాస్తులు కూడా వున్నాయి. గతంలో ఇది దాదాపు వెయ్యికోట్ల విలువైన ఆస్తులను కట్టడి చేసింది.ఇప్పుడు కూడా భారీగానే స్వాధీనం చేసుకుంది. నిజానికి జగన్‌పై వచ్చిన ఆరోపణల్లో మనీ లాండరింగ్ కేసులే తీవ్రమైనవని ఆయన లాయర్లు కూడా చెబుతూ వస్తున్నారు. అవి ఆయనను వెంటాడుతూనే వున్నాయని ఈ తాజా స్వాధీనాలు చెబుతున్నాయి. కేంద్ర బిజెపి కారణంగా కేసులు కొంచెం నెమ్మదిగా నడుస్తున్నాయని భావిస్తున్న తరుణంలో పులిమీద పుట్రలా ఈ నిర్ణయం వెలువడింది. బహుశా ఈ సందర్భంలో ఏదో విధంగా తమ వారి ఆత్మ విశ్వాసం నిలబెట్టే ప్రకటన లేదా వ్యాఖ్యలతో ఆ పార్టీ నేతలు ముందుకు రావచ్చు. ఇడి రంగ ప్రవేశం చేసిన తర్వాత ఆర్థిక నేరాలు అంత సులభంగా మటుమాయం కావన్నది అనుభవం. కేంద్రం కూడా కేసుల దర్యాప్తునకే ఆదేశాలు ఇవ్వకపోతే ఇలా జరగదని నిపుణులు అంటున్నారు. ఇది
బిజెపి రాజకీయ వ్యూహంలో భాగం కావచ్చు కూడా. తెలుగుదేశంపై రాజకీయ విమర్శలూ ప్రధాన ప్రతిపక్షంపై దాడులతో తమ అవకాశాలు పెంచుకోవడం అవసరమని మోడీ నాయకత్వం భావిస్తున్నదా? ఏది ఏమైనా ఇప్పటికి అయిదేళ్లు పూర్తిచేసుకున్న జగన్ కేసులు ఇకనైనా చకచకా కదులుతాయా? మెడమీద కత్తిలా ఆ కేసులున్నంత కాలం తమ నేత కొంత నియంత్రణలో వుండక తప్పదనే మాట వైసీపీ నేతలు అంటుంటారు. ఈ తాకిడితో మరికొంత మంది నిష్క్రమణ వేగం పుంజుకోవచ్చు.