అంబేద్కర్ కార్యక్షేత్రం కూల్చివేత!

దేశమంతా బిఆర్ అంబేద్కర్ 125వ జయంతి వేడుకలు జరుగుతుంటే ముంబాయిలో మాత్రం ఆయన కార్యక్షేత్రమైన భవనాన్ని కూలగొట్టడం ఒక విపరీత పరిణామం. అందులోనూ ముందస్తు నోటీసు లేకుండా వారసులకు సన్నిహితులకు చెప్పకుండా ఏకఫక్షంగా భవనాన్ని ధ్వంసం చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.అంబేద్కర్ మనవళ్లు ప్రకాశ్ అంబేద్కర్, ఆనందరాజ్ అంబేద్కర్‌లు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మధ్య ముంబాయిలోని దాదర్‌లో చిత్ర సినిమా హాలు వెనక వుండే అంబేద్కర్ భవన్‌ను ఆ మహనీయుడు 1947లో నిర్మించారు.అక్కడ పీపుల్స్ ఇంప్రువ్‌మెంట్ ట్రస్ట్(పిఐటి)ని, బుద్ధ సమాజాన్ని స్థాపించారు.ఒక ప్రింటింగు ప్రెస్ కూడా నెలకొల్పారు. దీర్థకాలం పాటు అది ఆయన కార్యక్షేత్రంగా వుండేదట. ఇక్కడ నుంచే ఆయన తన నవయాన బౌద్ధాన్ని ప్రారంభించారు.ఇలాటి చరిత్ర గల ఈ భవనాన్ని శనివారం తెల్లవారుఝామున 300 మందితో కూడిన ఒక బృందం వచ్చి అమాంతం కూలగొట్టేసింది.భవనం బాగా శిథిలమైపోవడంతో పడగొట్టవలసి వచ్చిందని మరింత గొప్పగా 17 అంతస్తుల భవనం కడతామని పిఐటి ప్రస్తుత అద్యక్షుడుగా వున్న మధుకర్ కాంబ్లే చెబుతున్నారు.
అయితే ఈ భవనంలో అంబేద్కర్ సేకరించిన వస్తువులే గాక చేతి రాత ప్రతులు కూడా వున్నాయని ప్రకాశ్ అంటున్నారు. ఆనాడు ఆయన ఏర్పాటు చేసిన ప్రెస్ కూడా వుందట. అలాటి అపురూప వస్తువులున్న భవనాన్ని కూల్చివేయడం వంటి పనులు చేస్తారన్న అనుమానంతోనే తాను అధికారులకు ముందుగా హెచ్చరికలు చేశానని కలసి మాట్లాడానని ప్రకాశ్ చెబుతున్నారు. అయితే అలాటి ఆలోచనే లేదని వారు భరోసా ఇచ్చారట. ఇప్పుడు కూడా కూల్చివేత తమకు తెలియదనే అంటున్నారు. దీనికి సంబంధించి మాజీ ఐఎఎస్ అధికారి సమాచార శాఖ కమిషనర్ రత్నాకర్ గైక్వాడ్‌పై అంబేద్కర్ వారసులు కేసు నమోదు చేశారు. నిజంగానే ఇంత గొప్ప చరిత్ర గల భవనాన్ని పడగొట్టేముందు కాస్త సంయమనం ముందు జాగ్రత్త అవసరం కాదా?