మనవాళ్లు కట్టేవి మురికివాడలన్నారు -అసెండాస్‌వన్నీ వాణిజ్య నిర్మాణాలే కాదా?

asb-logo Sembcorp-Industries-Logo-e1448608416823
అసెండాస్‌ సింగ్‌బ్రిడ్జికి అమరావతి నిర్మాణం అప్పగింతపై ఏ దశలోనూ ఎలాటి అనుమానాలు లేవు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ మేరకు ఎన్నడో నిర్ణయానికి వచ్చి క్యాబినెట్‌లోనూ ఆమోదం తీసుకున్నారు. అప్పగింతలే తరువాయి. ఈ సందర్భంగా రెండు మూడు అతి ముఖ్యమైన విషయాలు స్ఫష్టంగా చెప్పుకోవలసి వుంది.
మొదటిది- ఈ సంస్థ లేదా కన్సార్టియం సింగపూర్‌ ప్రభుత్వ సంస్థగా చెప్పడం పాక్షికసత్యం. తమ దేశ వాణిజ్యాభివృద్ధి కోసం ఆ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జెటిసి ఆధ్వర్యంలోని సంస్థ మాత్రమే. ప్రభుత్వానికి ప్రత్యక్షంగా దీంతో ఎలాటి సంబంధం వుండదు. పైగా ఈ సంస్థలో దాదాపు సగం ప్రైవేటు భాగస్వామికి చెందుతుంది గనక వారిదే కీలక నిర్ణయాధికారమవుతుంది. మనం ఎమ్మార్‌ ఎంజిఎప్‌ వంటి వాటిలో చూసిన అనుభవమే పునరావృతమవుతుంది.
ఈ కన్సార్టియంతో కలసి అమరావతి డెవలప్‌మెంట్‌ కంపెనీ నిర్మాణం చేపట్టిన తర్వాత భూమి మనదైనప్పటికీ పెట్టుబడి వారు తీసుకొస్తారనే పేరిట 58:42 శాతం వాటాలు వుంటాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వ సంస్థ కంటే అసెండాస్‌కు నాలుగు శాతం ఎక్కువ వాటా వుంటుంది గనక వారి మాటకే అధిక ప్రాధాన్యత అనివార్యం.
అసెండాస్‌ ఇప్పటి వరకూ హైదరాబాదుతో సహా కట్టినవన్నీ ఐటిపార్కులు, వాణిజ్య సముదాయాలే. వారి అధికారిక బ్రోచర్‌ చూసినా అదే గొప్పగా చెప్పుకోవడం కనిపిస్తుంది. స్తలానికి వాణిజ్య విలువ పెంచడం తప్ప రాజకీయాధికార కేంద్రాలు ప్రజావాసాలకు సంబంధించిన ఒక్క ఉదాహరణ కూడా అందులో లేదు. అమరావతి ప్రజా రాజధానిగా వుండాలని, అందులోనూ ప్రజా జీవనం తొణకిసలాడేలా వుండాలి తప్ప కేవలం పాలనా కేంద్రంగా వుండరాదని చంద్రబాబు నాయుడు పదే పదే చెప్పారు.కాని అసెండాస్‌ పూర్వాపరాలు అందుకు ఏ మాత్రం అనుగుణంగా లేవు. మరి ప్రజా రాజధాని ప్రకటనకూ వాణిజ్య రాజధాని నిర్మాణానికి పొంతన ఎలా కుదురుతుంది? ఇటీవల విజయవాడలో రాజధాని నమూనాలు ప్రదర్శించినప్పుడే అక్కడ ప్రజా వసరాలకు సంబందించిన ఒక్కటంటే ఒక్క నమూనా కూడా లేదని విమర్శ వచ్చింది.కొన్ని ప్రధాన నమూనాలు పొగగొట్టాల మాదరి వుండటం కూడా చాలా మంది వ్యాఖ్యానించారు. అసెండాస్‌ గతాన్ని బట్టి చూసినప్పుడు అచ్చమైన వాణిజ్య తరహా నిర్మాణాలు చేసి లాభం పెంచుకోవడం తప్ప సామాజిక కోణం ప్రధానంగా వుండేట్టు కనిపించదు. మరిదీనిపై ముఖ్యమంత్రి ఏమంటారో చూడాలి
నాలుగు సంస్థలు కన్సార్టియంగా ఏర్పడిన తర్వాత అసెండాస్‌సింగ్‌బ్రిడ్జి సెంబ్‌కార్ప్‌ సముదాయం ఆసియాలో పెద్దదిగా ఆవిర్భవించిన మాట నిజమే. కావచ్చు. వారు పలుచోట్ల ఐటిపార్కులు బిజెనెస్‌ కాంప్లెక్స్‌లు గొప్పగా కట్టివుండొచ్చు. హైదరాబాదులో కూడా వారి పార్కు వుంది. కాని అంతమాత్రాన ముఖ్యమంత్రి మన దేశీయ సంస్థలను తీసిపారేయడం మనం కట్టినవి మురికివాడల్లా వుంటాయని చెప్పడం న్యాయమా? లేక వారికి వాణిజ్య లాభాల నిర్మాణాలన్నీ అప్పగించి అస్మదీయులకు చిన్నచితక ప్రజా నిర్మాణాలు అప్పగిస్తారా? అర్థం కావడం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *