బ్లాక్ మెయిల్ స్వామికి బ్యాకింగ్

సుబ్రహ్మణ్యస్వామి.. ఎంతో తెలివైన వ్యక్తిగా పేరున్నా ఎవరూ రాజకీయ పునరావాసం కల్పించేందుకు సిద్దం కాలేదు. కారణం ఆయన వివాదాస్పదుడే గాక అనుమానాస్పదుడు కూడా. తను ఎవరిని విమర్శించినా ఆ వెనక ఎవరో వుండి ఆడిస్తుంటారనే భావంచాలా బలంగా వుంది. స్వతహాగా సంఫ్‌ు పరివార్‌కు దగ్గరైనా వారు కూడా భరించలేక వదిలేశారు. మాజీ ప్రధాని వాజ్‌పేయిపైన కూడా దాడి చేస్తుండేవారు. అలాటి వ్యక్తిని హఠాత్తుగా మోడీ నాయకత్వంలోకి వచ్చాక బిజెపిలో చేర్చుకోవడమే గాక రాజ్యసభకు కూడా తీసుకొచ్చారు. వచ్చిన రోజునుంచి ఎవరో వొకరిపై వ్యక్తిగత దాడులు చేస్తూనే వున్నారు. సోనియా రాహుల్ గాంధీలపై చేసినప్పుడు బిజెపికి బాగానే వుండింది.కాని తర్వాత ఆయన ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీపై గురిపెట్టారు. మోడీ ప్రధాని అన్నప్పుడు ఒకింత పోటీగా వినిపించిన పేర్లలో సుష్మా స్వరాజ్, అరుణ్‌జైట్లీ ముఖ్యులు. స్వామి హార్వర్డ్ యూనివర్సిటీ ఎకనామిక్స్ ప్రొఫెసర్. ఆ ముద్రతో మొదట రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురామరాజన్‌పై పడ్డారు. వారి దేశభక్తినే శంకించేలా మాట్లాడారు. జైట్లీ నామకార్థంగా సమర్థించడం తప్ప మరెవరూ రాజన్‌ను బలపర్చలేదు. ఎట్టకేలకు ఆయన ఐచ్చికంగానే తన పదవీ కాలం పొడగింపు కోరడం లేదని ప్రకటించారు. తర్వాత ప్రధాని సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యంపై పడ్డారు. తను కూడా విదేశీయుడన్నట్టు మాట్లాడారు. ఈసారి అరుణ్‌జైట్లీ విదేశాల్లో వుండి గట్టిగానే జవాబిచ్చారు. తర్వాత ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్‌పై పడ్డారు. వీరంతా గొప్పవాళ్లవునా కాదా అన్నది ఇక్కడ సమస్య కాదు. ఈ విధంగా ఎవరిపై పడితే వారిపైన తలాతోక లేని దాడులు చేస్తుంటే వ్యవస్తలు ఏమైపోతాయి అని. వీరిని సమర్థించినందుకు ఆరుణ్‌జైట్లీని మరింత తీవ్రంగా దుయ్యబట్టారు స్వామి. అంటే ఆయనకు నేరుగా ప్రధాని కార్యాలయం ఆశీస్సులే వున్నాయని తేలిపోయింది. క్రమశిక్షణ లేకుండా మాట్లాడొద్దని మంత్రి ప్రకాశ్ జవదేవకర్ అంటే నేను క్రమశిక్షణ తప్పి మాట్టాడితే రక్తపాతాలు తప్పవని బెదిరించారు స్వామి. ఇవన్నీ కూడా చాలా వివాదాస్పదమే గాక వికృత వ్యవహారాలు కూడా. స్వామి ఎంపి అంటే మోడీ మౌత్ పీస్ గనకనే ఇదంతా చెల్లుబాటవుతున్నట్టు కనిపిస్తుంది.మోడీకి ఇష్టంలేని వారిపైన స్వామి దాడి చేయడం వ్యూహాత్మకంగానే నడుస్తున్నదని పరిశీలకులు భావిస్తున్నారు. రక్తపాతం వచ్చేంత విషయాలు ఆయన దగ్గర ఏమున్నాయి? ఉంటే ఎందుకు దాస్తున్నారు?