బ్రెగ్జిట్‌తో బెంబేలు

యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగాలని బ్రిటిష్ ప్రజలు రెఫరెండంలో 52-48 శాతం ఓట్ల తేడాతో ఇచ్చిన తీర్పు ఆ దేశాన్ని,యూరప్ ఖండాన్ని మాత్రమే గాక యావత్ ప్రపంచాన్ని ప్రకంపనలకు గురి చేసింది. నిన్నటి మహా సామ్రాజ్యవాద దేశంగానే గాక యూరప్‌కు ముఖద్వారంగా పేరొందిన బ్రిటన్ అక్కడి పారిశ్రామిక వాణిజ్యలావాదేవీలలో కీలక పాత్ర వహిస్తుంది. భారత దేశం కూడా దీని ప్రభావానికి ఎంతగా గురి అవుతన్నదంటే ఈ ఫలితం తెలియగానే సెన్సెక్స్ వెయ్యిపాయింట్లకు పైగా పడిపోయింది. 10వేల కోట్ల డాలర్ల విలువైన మన ఐటి ఎగుమతులలో మూడో వంతు బ్రిటన్‌కే వెళతాయి. అక్కడ 800 భారతీయ కంపెనీలలో లక్షా పదివేలమందికి పైగా మన దేశస్తులు పనిచేస్తున్నారు. టాటాలకైతే అక్కడ జాగ్వార్‌విమానాల నుంచి సాఫ్ట్‌వేర్ కంపెనీల వరకూ వున్నాయి. బ్రిటన్ ఎగ్టిట్ అన్న పదాలు బ్రిగ్జిట్‌గా పేరొందాయి. నిజానికి ప్రస్తుత కన్సర్వేటివ్ ప్రధాని జేమ్స్ కామరూన్ స్వయంగా 2013లో ఈ రెఫరెండంకు పిలుపునిచ్చారు. అప్పట్లో కొన్ని రాజకీయ విజయాల తర్వాత ఆయన దీన్ని కూడా గెలవచ్చని అంచనా వేసుకున్నారు గాని తర్వాత పరిస్థితి మారిపోయింది. దీంట్లో ఓడిపోతే నిష్క్రమిస్తానని ముందే ప్రకటించిన ప్రధాని ఇప్పుడు ఆ మేరకు నిర్ణయం తెలియజేశారు. అక్టోబర్‌లో దేశానికి కొత్త ప్రధాని వస్తారు. ఈ లోగా బ్రిగ్జిట్‌ను సమర్థించిన రాజకీయ నేతలు హర్షామోదాలు తెలియజేస్తున్నారు.
ఈ పలితంపై యూరప్‌లోనూ మిశ్రమ స్పందన వున్నా వాస్తవానికి దిగ్భ్రాంతి ఎక్కువగా వుంది. ప్ర
పంచంలో అయిదవ పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగివున్న బ్రిటన్‌లో ఉత్పత్తి అయ్యే స్కాచ్ విస్కీలో మూడోవంతు యూరప్‌కే వెళుతుంది. 27 దేశాలున్న ఇయు ఉత్పత్తిలో బ్రిటన్ 18శాతం కలిగివుంటుంది. కనుక ఇది ఉభయత్రా నష్టదాయకమైన పరిణామమే అవుతుందని ఆందోళన చెందుతున్నారు. బ్రెగ్జిట్ వల్ల బ్రిటన్ లో ఉత్పత్తి 5.6 శాతం, ఉపాధి కల్పన 6 శాతం దెబ్బతింటాయని ఐఎంఎఫ్ అంచనా వేసింది.జపాన్‌కు చెందిన నిప్పాన్ కంపెనీ కూడా దీనిపై ప్రకటన చేసింది. ఇక టాటాల వాణిజ్యంలో 13 శాతం బ్రిటన్‌తో ముడిపడి వుంది. ఈ సందర్బంగా ఆ సంస్థ ఒక ప్రకటన చేస్తూ మార్కెట్ల అందుబాటు, నిపుణుల లభ్యత ముందు ముందు కీలక సమస్యలుగా వుంటాయని వివరించింది. ఇయు అద్యక్షుడు బ్రిటన్ నిష్క్రమణ పెద్ద సమస్య కాదన్నట్టు పైకి మాట్లాడ్డమే గాక త్వరగా ఈ ఇది పూర్తికావాలని సూచించారు. అయితే కనీసం పదేళ్ల పాటు ఈ సంప్రదింపుల క్రమం కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ కాలంలో వ్యాపార వ్యవహారాలపైన రాజ్యాంగ అంశాలపైన అనిశ్చితి నెలకొంటుంది. అందువల్లనే భారత్‌కు సంబంధించిన చాలా అంశాలు ఈ ప్రభావానికి గురవుతాయన్న సందేహాలున్నాయి.ఇప్పటికే స్టెర్లింగ్ 30 ఏళ్లలో ఎన్నడూ లేని స్ధాయికి పడిపోయింది.
గతంలో 2008లో అమెరికాలో ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు మన ద్రవ్య సంస్థలు పటిష్టంగా వుండటం వల్ల ఆ ప్రభావం నుంచి బయిటపడ్డాము. ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని రంగాల్లోకి తలుపులు తెరిచే విధానం చేపట్టింది. ఇప్పటికే మన బ్యాంకులు ఎన్‌పిఎల కారణంగా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయి వున్నాయి. దేశంలో నిరుద్యోగం పెరుగుతున్నది. ఈ స్థితిలో బ్రిగ్జిట్ ప్రతికూల ప్రభావం చూపించడం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, ఆర్‌బిఐ గవర్నర్ రఘురాం రాజన్ భరోసా కల్పించేలా మాట్లాడుతున్నా సెన్సెక్స్ పతనంతోనే ఒక్కసారిగా నాలుగు లక్షల కోట్ల రూపాయలు హఱీ అన్నాయని లెక్కలు చెబుతున్నారు. అమెరికా మాత్రం బ్రిటన్‌తో తమ సంబంధాలు యథాతథంగా కొనసాగుతాయని ప్రకటించింది. మరోవైపున దీన్ని ఉదాహరణగా తీసుకుని అనేక యూరప్ దేశాల్లో రెఫరెండం డిమాండ్లు వస్తున్నాయి. కనుక మరోసారి ప్రపంచం ఆర్థిక ఒడుదుడుకులకు గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువ.