టి సర్కార్ భారాల హౌరు, ప్రైవేటు జోరు
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు తమది భిన్నమైన ప్రభుత్వమని చెప్పుకుంటున్నా ఆయన అనుసరిస్తున్న ఆర్థిక నమూనా గతంలో కాంగ్రెస్ తెలుగుదేశంలు అనుసరించిన దానికి భిన్నంగా వున్నట్టు కనిపించదు. ే భూ సేకరణ నుంచి ప్రజలపై వడ్డింపుల వరకూ అన్నీ షరామామూలుగా పున: ప్రారంభమవుతున్నాయి. విద్యుచ్చక్తి ఉద్యమంలో బషీర్‌బాగ్ కాల్పుల ఘటనకు నిరసనగా తెలుగుదేశం నుంచి రాజీనామా చేసి టిఆర్‌ఎస్ ప్రారంబించిన అధినేత ఇప్పుడు అదే విద్యుత్ ఛార్జీల పెంపుదలకు పచ్చజెండా వూపడం అలాటి ఒక చారిత్రిక వైపరీత్యమే. ఒకటి రెండు ప్రభుత్వ విద్యుత్ ప్లాంట్లను ప్రారంభిస్తున్నప్పటికీ మొత్తంపైన కెసిఆర్ దృష్టి మాత్రం ప్రభుత్వరంగంపై లేదు. విద్యుత్ బోర్డును ముక్కలు చేసి ప్రైవేటీకరించిన చంద్రబాబు తనవల్లనే విద్యుత్ సామర్థ్యం పెరిగిందని చెప్పుకుంటారు. ఆయన విధానాలకు నిరసనగా ఉద్యమానికి నాయకత్వంలో పాలు పంచుకుని ఆ వూపులో అధికారం చేపట్టిన వైఎస్ రాజశేఖరరెడ్డి వెంటనే చార్జీలు పెంచకపోయినా ఉచిత విద్యుత్ భారం, ఎన్నికల సమయంలో నిరంతర సరఫరా కోసం కొన్న భారం ప్రజలపైనే మోపడానికి సిద్ధమైనారు. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోనూ ఈ దాడి కొనసాగింది. ఇక ఇప్పుడు రెండేళ్ల తర్వాత నూతన రాష్ట్ర సారథి అదే బాటపట్టారు. ఆర్టీసీ ఛార్జీలు కరెంటు రేట్లు ఒకేసారి పెంచడం ద్వారా గోడదెబ్బ చెంపదెబ్బ విధానం అమలు చేస్తున్నారు. ఆర్టీసీ మూసివేస్తానని బెదిరించిన ఆయన మాటలపై గతంలోనే తెలకపల్లి రవి.కామ్‌లో చెప్పుకున్నాం. తర్వాత కొంచెం సర్దుకున్నా మౌలికంగా ఆ విధానాలను మార్చుకున్నది లేదు. పైగా ఛార్జీల పెంపుదలను తీసుకొస్తున్నారు. ఈ సమయంలోనే తనయుడు మునిసిపల్ మంత్రి కెటిఆర్ కూడా ఆస్తిపన్ను పెంచకతప్పదనే సంకేతాలు ఇస్తున్నారు. రోడ్డను ప్రైవేటు పరం చేస్తామంటున్నారు. ప్రాజెక్టు కాంట్రాక్టులలోనూ పదికోట్ల వరకూ వున్నవి తప్ప మిగిలినవన్నీ పాత సంస్థలకే వెళ్తున్నాయి.భూ సేకరణ విషయంలోనూ ప్రభుత్వం ప్రజల నిరసన ఎదుర్కొంటున్నది. వారి బాధను అర్థం చేసుకునే బదులు పోటీ ఉద్యమం ఆరోపణల పర్వం కొనసాగించారు. 2013 భూ సేకరణ చట్టం పక్కన పెట్టి 123 కింద తీసుకోవాలని శాయశక్తులా ఒత్తిడి చేశారు.కొండ కిష్టాపూర్ వంటిచోట్ల ఉద్యమాలు ఆగకపోవడంతో ఇప్పుడు మంత్రి హరీష్ రావు 2013 చట్టం ప్రకారం కూడా తీసుకోవడానికి సిద్దమంటున్నారు. అయితే దాన్ని సరిగా అమలు చేయాలంటే ముందు ఎనిమిదేళ్లుగా మార్చని మార్కెట్ రేటును నిర్ణయించి అందుకు నాలుగు రెట్టు ఇవ్వాలి. అంతేతప్ప ఇప్పుడున్న లెక్కన చేస్తే మళ్లీ అన్యాయమే మిగులుతుంది. విభజన జరిగినా విధానాలు మారలేదు గనకే ఇవన్నీఇలా సాగిపోతున్నాయన్నది అసలు నిజం. వాటిపై ప్రజలు ఉద్యమించక తప్పదన్నదీ నిజం. జెఎసి చైర్మన్ కోదండరాం తెలంగాణ తెచ్చుకున్నది కాంట్రాక్లర్ల కోసం కాదని ఘాటుగా వ్యాఖ్యానించడంలో సారాంశం అదే!
