అంతేనా దర్శకేంద్రా?

కె.రాఘవేంద్రరావు అంటే ఒక తరంలో తెలుగు సినిమాకు మూల స్తంభాలుగా నిలిచిన నలుగురు దర్శకులలోనూ ముఖ్యులు.తన తండ్రిగారైన కెఎస్ ప్రకాశరావు బహుశా తెలుగులో అత్యంత మేధావులైన రెండవ తరం దర్శకులలో అగ్రగణ్యులు. ఎల్వి ప్రసాద్‌ను అందరూ పితామహుడంటారు గాని ఆయన వెనక కూడా వున్నది ప్రకాశారావే. మొదటి చిత్రం జ్యోతి తర్వాత ఆయన దాదాపు వాణిజ్య బాణీనే పట్టుకున్నా విజయాలు చాలా సాధించారు. ఎన్టీఆర్‌కు పునర్వైభవం తీసుకొచ్చారు. రాఘవేంద్రరావు చిత్రాలన్నీ ఒక ఫార్ములా ప్రకారం నడిచేవి గాని ప్రేక్షకులను ఆకర్షించడలోనూ సన్నివేశాన్ని రక్తి కట్టించడంలోనూ దిట్టగానే చెప్పాలి. అయితే కథానాయికలను అమిత శృంగారంగా చూపించే ఆయన పోకడలపై చాలా వ్యాఖ్యలు విమర్శలూ వున్నాయి. మనిషి పెద్దవారైన తర్వాత వాటినే జోకులుగా చలామణి చేస్తున్నారు. ఒకె. కామి కాని వాడు మోక్షగామి కాడు అన్నట్టు మలిదశలో ఆయన అన్నమయ్య రామదాసు సాయిబాబా పాండురంగడు వంటి భక్తి రస చిత్రాలూ తీస్తూ టిటిడి బోర్డుసభ్యులు కూడాఅయ్యారు. ఇదంతా బాగానే వుంది గాని సినిమా అంటే హీరోయిన్ మాత్రమేనని వాళ్లను చూడ్డానికే తాను వెళుతుంటానని తనకు తానుగా చెప్పుకోవడం విచిత్రం. నిజానికి ఆయన తీసిని వాటిలో హీరోయిజం పాలు ఎక్కువగానే వుంటుంది. ఆ సంగతి అలా వుంచిన ఎన్టీఆర్ ఏఎన్నార్ కృష్ణ శోభన్‌బాబు, చిరంజీవి తదితరులతో చిత్రాలు తీసి కనకవర్షం కురిపించుకున్న రాఘవేంద్రరావు వారందరికీ ఎలాటి ప్రాధాన్యత లేదంటున్నారా? హీరోల కోసం ప్రేక్షకులు రారా? తమాషా కోసమైనా సరే ఇంత అసంబద్దంగా మాట్లాడ్డం ద్వారా ఆయన తనకు అవకాశమిచ్చిన అగ్రనటులను చిన్నబుచ్చినట్టు కాలేదా?