యోగ – మత రాజకీయ విన్యాసం

కోట్లాదిమంది పూజించే రాముణ్నే రాజకీయ చిహ్నంగా మార్చుకున్న ఒక రాజకీయ పార్టీకి దేన్నయినా ఆ విధంగా ఉపయోగించుకునే నేర్పు వుండకుండా పోతుందా? ఇప్పుడు దేశంలోనే గాక ప్రపంచమంతటా మోడీ ప్రభుత్వం సాగిస్తున్న యోగార్బాటంలో ఒకవంక మతభావనలు మరోవంక రాజకీయ ప్రచారాలు కలగలసి దర్శనమిస్తున్నాయి. వీటిని ఏమన్నా అంటే భారతీయతను అవమానించడమన్నట్టు దాడి చేస్తారు. సీతారాం ఏచూరి యోగసనాలు కొన్ని గాడిద కదలికలను పోలివుంటాయన్నారంటూ బిజెపి కలం సేవకుడు స్వపన్‌దాస్‌గుప్తా ట్విట్లర్ వార్ ప్రారంభించారు.వాస్తవానికి యోగలో కప్ప,కోతి,కుక్క,పాము,తేలు,నెమలి,తాబేలు,ఒంటె,కాకి,గుర్రం తదితర జంతువుల కదలికలను పోలిన ఆసనాలుంటాయి. గాడిడ ఆసనం అనడంపైన మాత్రం ఎందుకు అంతగా దాడి చేయాలో అర్థం కాదు. శవాసనం కూడా వుంటుంది. సభను సందర్భాన్ని బట్టి నవ్వించడానికి అనివుంటే అంతగా దాడి చేయనవసరం లేదు.
ఏచూరి వ్యాఖ్యలను వ్యతిరేకంగా చిత్రిస్తున్న వీరే కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ఆధ్వర్వంలో జరుగుతున్న యోగ కార్యక్రమాన్ని బిజెపికి పోటీగా చేస్తున్నారని ఎగతాళి చేస్తున్నారు. దాంతో నిమిత్త ం లేకుండా విడిగా తాము ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ సంసృత శ్లోకాలను పాడటంపై విద్యామంత్రి శ్రీమతి కెకెశైలజ విముఖత వ్యక్తం చేస్తే దానికీ రాజకీయాలు ఆపాదించే ప్రయత్నం చేశారు. ఎల్‌డిఎప్ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే యోగ మత ప్రసక్తిలేనిది కాగా మోడీ సర్కారు తతంగం హిందూమత చాయల్లో కొనసాగుతున్నది. దీనంతటికీ ప్రేరణగా వున్న రామ్‌దేవ్‌బాబా ఒక ముస్లిం యోగ చేసినంత మాత్రాన హిందువుగా మారబోడని వ్యాఖ్యానించడం రెండు వైపులా పదునువున్న కత్తిలాటింది.పదేపదే మోడీ కూడా మతానికి దీనికి సంబంధం లేదంటున్నారు గాని అక్కడ పాడే శ్లోకాలు, పూజలు ఓం ఉచ్చారణలూ అన్నీ ఒక మతానికి సంబంధించినవే. నిజానికి ధాన్యం అన్న పదాన్ని ఏకాగ్రత అనే అర్థంలో గాక అతీంద్రియ ధ్యానం అన్నట్టుగానే ఆచార్యులు భాష్యం చెబుతుంటారు.చాలాచోట్ల హిందూదేవతల చిత్రాలు పెట్టి పూజలు చేశాకనే ప్రారంభిస్తారు. సూర్య నమస్కారం వంటిపేర్లన్నీ మతంతో ముడిపడినవే కదా. రామ్‌దేవ్‌బాబా, రవి శంకర్‌ల రాజకీయ ప్రాపకం కూడా బిజెపియేనని అందరికీ తెలుసు.
యోగ వల్ల ప్రయోజనాలు దాంట్లో వ్యాయామ కళ ఎవరూ కాదనరు. అన్ని దేశాల్లోనూ వాటివాటి చరిత్రను బట్టి ప్రాచీన వైద్యం వ్యాయామం విజ్ఞానం పెంపొందాయి. చైనావారి కరాటేపై బ్రూస్‌లీ ఎంటర్ ద డ్రాగన్ పెద్ద విజయం సాధించింది గనక ప్రపంచమంతా కరాటే నేర్చుకోవడం మొదలుపెట్టారు. మల్లయుద్దం వంటివి భారత దేశంలోనూ వున్నాయి.ఇప్పుడు పాశ్చాత్య దేశాల నుంచి రకరకాల పేర్లతో దిగుమతయ్యే నాట్యాలలో జానపదాల ఛాయలుంటాయి. యోగాను కూడా అలాగే శాస్త్రీయ దృష్టితో చూస్తే ఫర్వాలేదుగాని దాన్ని మతకోణంలోకి ఆధ్యాత్మికతలోకి మరల్చడం వల్లనే సమస్యలు వస్తాయి. కమ్యూనిస్టులు యోగాకు వ్యతిరేకం అనేవారు సుందరయ్య ఆత్మకథ చదవడం అవసరం. ఆయన యోగ నేర్చుకోవడమే గాక నేర్పేవారు కూడా. అదే సమయంలో అక్కడ ఆరెస్సెస్ వారు పెట్టిన శిక్షణా తరగతులు నడిపేవారికి ఈయన నేర్పేది భిన్నంగా వుండేది. గ్రామాలలో యువజనసంఘాలు తాలింఖానాలు వ్యాయాయశాలలు గ్రంథాలయాలు పెట్టి సంఘ సంస్కరణ విశాల భావాలు నేర్పించాయి. అందుకు భిన్నంగా బిజెపి ఆరెస్సెస్‌లు ప్రభుత్వ ధనంతో పరోక్షంగా స్వంత ప్రచారం చేసుకుంటున్నాయి.దేశంలోనే గాక మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో బిజెపి ఓవర్సీస్ ఫ్రెండ్స్ తలపెట్టిన కార్యక్రమానికి విదేశాంగ శాఖ మద్దతు వున్నట్టు చెప్పుకోవడంపై ఇదే ఏచూరి విమర్శ చేస్తే సుష్మా స్వరాజ్ పొరబాటని ఒప్పుకుని ఆ ప్రచార సామగ్రి తీసేయించారు. అయినా అమెరికాలో ఆరెస్సెస్ అనుబంధ సంస్థతో కలసి ప్రభుత్వం యోగా నిర్వహిస్తున్నది.
చివరగా చెప్పాలంటే యోగ మంచిదే కాని దానికి రాజకీయం,
మతం రంగు పులమకుండా వుండాలి. వ్యక్తుల శారీరిక స్థితిని బట్టి చేయాలి తప్ప సామూహిక విన్యాసాలు ప్రచారానికి మాత్రమే పనికివస్తాయి. మాస్‌డ్రిల్ వంటివిచాలా పరిమితంగానే వుండాలి. యోగాచార్యులైనా ఫిజియోథెరపిస్టులైనా వ్యక్తిని బట్టి సమస్యలను లేదా సమర్థతను బట్టి నేర్పిస్తారు. గురు ముఖంగానే జరగాలని కూడా వారే చెబుతుంటారు. మన ప్రముఖ నాయకులు నటీనటులు చాలా మంది యోగా చేస్తూనే వున్నారు.ఇప్పుడు దాన్ని కూడా మోడీ ఖాతాలో వేసే విన్యాసాలు చూస్తుంటే నిజంగానే ఒకింత చికాగ్గా వుంటుంది. ధ్యానం రాజకీయంపై పెట్టి యోగను ప్రచారానికి వాడుకోవడం ప్రహసనమే మరి.