100% ఎఫ్‌డిఐ దేశభక్తి

దేశ రక్షణ అంటేనే విదేశాల నుంచి మనను మనం కాపాడుకోవడం. అటాటి రక్షణ రంగ ఉత్పత్తులలో నూటికి నూరు శాతం విదేశీ పెట్టుబడులను అనుమతించడం వూహించగలరా? ఆత్మరక్షణ ఆత్మగౌరవం రెండింటిని ఫణం పెట్టేలా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రక్షణ రంగంలో అత్యాధునిక పరిజ్ఞానం కలిగిన విదేశీ కంపెనీలకు మాత్రం 49 శాతంపైన కూడా వాటా ఇవ్వొచ్చని అది కూడా ప్రభుత్వ ఆమోదంతో జరగాలని ఇప్పటి వరకూ వున్న విధానం నిర్దేశిస్తున్నది. కాని తాజాగా ప్రభుత్వంచేసిన ప్రకటన ప్రకారం అలాటి ప్రత్యేకత లేని విదేశీ కంపెనీలు కూడా నూరుశాతం రక్షణ పెట్టుబడులతో సంస్థలు పెట్టుకోవచ్చు. విదేశాల్లో రక్షణ రంగం అంటే బడా కార్పొరేట్ల చేతిలో వుంటుంది. అమెరికా వరకూ చూస్తే మిలటరీ ఇండిస్టియల్ కాంప్లెక్స్ అక్కడ దేశ రాజకీయాలనే శాసిస్తూ ఇతర దేశాలను ఆడిస్తుంటుంది. మోడీ తాజా అమెరికా పర్యటన సందర్భంలో దీనికి సంబందించి ఇచ్చి వచ్చిన హామీ గురించి గతంలో తెలకపల్లి రవి.కామ్‌లో చెప్పుకున్నాం. ఇప్పుడు దాని ఆచరణ రూపం ప్రభుత్వ నిర్ణయం.
రక్షణతో పాటు పౌర విమానయానం, టెలిపోర్టులు, డిటిహెచ్, కేబుల్ నెట్‌వర్క్‌లు, మొబైల్ టివిలు తదితర రంగాలలో 100 శాతం ఎఫ్‌డిఐని అనుమతిస్తారు. ఆఖరుకు పశుపోషణ,ఆహార వుత్పత్తుల రంగంలో కూడా మనకు శక్తి లేనట్టు వంద శాతం విదేశీ పెట్టుబడులు రావచ్చు. ఫార్మా రంగంలోనూ గ్రీన్‌పీల్డ్ లో 100 శాతం, బ్రౌన్‌ఫీల్డ్‌లో 74 శాతం ఎఫ్‌డిఐలకు స్వాగతం పలికారు.
కొద్దిరోజుల కిందట ఆ పిల్ సిఇవో టిమ్ కుక్‌వచ్చింది రీ యూజ్డ్ ఫోన్ల రంగంలో పెట్టుబడులకు 30 శాతం స్థానిక వాటాదారు వుండాలనే షరతు తొలగింపచేయడానికి అని తెలకపల్లి రవి.కామ్‌లో స్పష్టంగా రాశాము. ఇప్పుడు అక్షరాలా అదే జరిగింది. అంతేగాక ఈ వివరాలు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి రమేష్ ఇప్పుడు మేము ఆపిల్‌ను వస్తారా అని అడుగుతాము అంటూ వ్యాఖ్యానించడం ఆసలు సంగతి తెలియజేస్తుంది. ఇప్పుడు విదేశీ పెట్టుబడులకు 100 శాతం అవకాశం ఇవ్వని రంగాలు ఏమంటే – లాటరీ, గ్యాంబ్లింగ్, అటామిక్ ఎనర్జీ మాత్రమే! అణుఒప్పందం ఎలాగూ వుంది గనక దానికింద తలుపులు తెరవడం ఇప్పటికే జరిగిపోయింది.
నిరంతరం స్వదేశీ జపంలో మునిగితేలే సంఘ పరివార్ ఆదేశిత సర్కార్ విదేశాలకు ఇంతగా ద్వారాలు తెరవడం, సకల రంగాల్లో నూటికి నూరుశాతం ఆ పెట్టుబడులకు ఎర్రతివాచి పరచి స్వాగతించడం దిగ్భ్రాంతి కలిగించవచ్చుగాని వారి నడక మొదటి నుంచి ఆ దిశలో వుందనేది వాస్తవం. ఇప్పుడు ఆర్‌ఎస్‌ఎస్‌కు అనుబంధంగా వున్న స్వదేశీ జాగరణ్ మంచ్ వంటివి కూడా విమర్శలు వినిపిస్తాయి గాని అదంతా పైపై రాజకీయమేనని అర్థం చేసుకోవాలి.
ఇలా దేశంలో వ్యాపార పారిశ్రామిక రంగాలన్నిటిలోనూ విదేశీ పెట్టుబడులు నిండిపోతే దేశీయంగా వుండే చిన్న పరిశ్రమలు చేతి వృత్తులు పాడి పంటలు ఏమైపోవాలి? మేకిన్ ఇండియా కాస్తా టేకిన్ ఇండియాగా మారిపోతుంటే యోగసనాలు వేసి ఉద్రిక్తత నుంచి బయిటపడాలా?ఈ కొత్త సంస్కరణల తర్వాత స్టాక్ మార్కెట్ పుంజుకుందని కథలు చూసి సంతోషించాలా?
వందేమాతరం. మేరా భారత్ మహాన్. ఎఫ్‌డిఐ దేశభక్తి వర్థిల్లాలి.