భూమి లేదు-కౌలు రాదు

31VJ_CAPITAL_REGIO_2179350g copy

 

అమరావతి ప్రాంతంలోని నేలపాడు గ్రామానికి సంబంధించి రైతులకు ఫ్లాట్ల నెంబర్ల కేటాయింపు తతంగం వాయిదా పడింది. మొదట నేలపాడులో తలపెట్టిన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి భద్రత పేరిట తుళ్లూరుకు తరలించారు. ఇప్పుడు వర్షం కారణంగా అది కూడా వాయిదా వేశారు. గత ఏడాది మేలోనే రైతులకు భూములు అప్పగిస్తామన్న ప్రభుత్వం ఇప్పటివరకు ఆ పని చేయలేదు. 2014 డిసెంబర్‌ నుంచి ప్రారంభమైన భూ సమీకరణ ప్రక్రియలో 33వేల ఎకరాలు సమీకరించారు. ఈ ఏడాది జనవరి, మార్చి ఇలా పొడగించుకుంటూ జూన్‌ వరకు నడిపారు. ఇప్పుడు వర్షం కారణమైంది. నిజానికి సిఆర్‌డిఎ అధికారులు ఇప్పుడు ఫ్లాట్ల నెంబర్లను మాత్రమే కేటాయిస్తామని తెలిపారు. లేఅవుట్‌ వేసి కేటాయింపులు చేసి ఇవ్వడం సాధ్యం కాకపోవడంతో విస్తీర్ణాల వారీగా ప్లాట్లను అధికారులు ఎంపిక చేశారు. వాటిలో ఎటువంటి ప్లాట్లు ఎన్ని కావాలనే విషయాన్ని రైతులే కోరుకోవాలి. ఇందుకోసం తప్పనిసరిగా (9.18) దరఖాస్తు సమర్పించాలి. వచ్చిన ఆ దరఖాస్తుల ఆధారంగా ఎవరెవరికి ఎన్నెన్ని ప్లాట్లు వస్తాయనే దానిపై అధికారులుఒక అభిప్రాయానికి వచ్చి వాటి ఆధారంగా నెంబర్లు వేశారు. ఉదాహరణకు ఒక రైతుకు వంద గజాల ప్లాట్లు కావాల్సి ఉంటే, వాటికి లాటరీ వేస్తారు. దానిలో ఏ నెంబరు వస్తే దాన్ని కేటాయిస్తారు. అదే రైతు 500 గజాల ప్లాట్లు కోరుకుని ఉంటే మరలా దానికి లాటరీ వేస్తారు. వచ్చిన నెంబరు కేటాయిస్తారు. ఈ ప్రక్రియలో అన్ని రకాల ప్లాట్ల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలనేది ఆలోచన. ఆ తర్వాత రైతులకొచ్చిన నెంబర్ల వారీగా వారికి ధ్రువీకరణ పత్రాలు సిద్ధం చేసి 15 రోజుల్లోపు ఇస్తామంటున్నారు. ఒక్కసారి నెంబరు కేటాయించితే భూమి ఇచ్చినట్లే గనక రైతుకు కౌలు చెల్లించాల్సిన అవసరం ఉండదని అధికారులు భావిస్తున్నారు. వాస్తవానికి భూసమీకరణ తర్వాత రెండో ఏడాది కౌలు ఇప్పటివరకూ చెల్లించిందిలేదు. దీనిపై రైతులు చాలా అసంతృప్తిగా ఉన్నారు. అయితే రైతులకు కౌలు చెల్లింపులు చేయగల ఆర్థిక వనరులు సిఆర్‌డిఎ దగ్గర లేవు. కనుక 9.18 దరఖాస్తుల ఆధారంగా వారి ప్లాట్లకు నెంబర్లు కేటాయించేస్తే, వారికి ఇక కౌలు చెల్లించాల్సిన అవసరముండదని ప్రభుత్వ వ్యూహంగా వుంది. అందుకే పూర్తిస్థాయిలో భూములు స్వాధీనం చేయకపోయినప్పటికీ హడావుడిగా ప్లాట్ల నెంబర్లు ఇచ్చేసి ఆర్థిక భారం దించుకోవాలని పంపిణీ తలపెట్టారు. ఇప్పుడు వాయిదా పడిన ఈ కార్యక్రమం మళ్లీ త్వరలోనే వుంటుందని కూడా వారంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *