రాజన్ పంపివేతలో సంకేతాలు

రిజర్వుబ్యాంకు గవర్నర్ రఘురామ రాజన్ మరోసారి దఫా పదవిలో కొనసాగబోనని చెప్పడం మోడీ ప్రభుత్వానికి మరీ ముఖ్యంగా ఆ అండతో ఆయనపై దాడి చేసిన వారికి చెంపపెట్టులాటిదే. నూటికి నూరుపాళ్లు తమకు లోబడని వారిని సహించే ప్రసక్తిలేదని ఈ చర్యతో సంఘ పరివార్ స్పష్టం చేసిందన్నమాట. అయితే ఆయన కూడా ఎలాగో రాజీకి ప్రయత్నించే బదులు ఐచ్చికంగా ముందే అనాసక్తి ప్రకటించి ఆత్మగౌరవం చాటుకున్నారు. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఆయన పనివిధానాన్ని పొగిడినా ప్రధాని మోడీ ఇలాటి విషయాలు ఇంటర్వ్యూలలో చర్చించబోమని దాటవేసినా అందులో లాంఛనాలు కనిపించనంతగా చిత్తశుద్ధి కనిపించలేదు. అంతర్గత వైరుధ్యాల కారణంగా అరున్‌జైట్లీ కొద్దిగా మొగ్గుచూపాడరనుకున్నా రాజన్ ఆనాసక్తి చూపగానే మరొకరి ఎంపికపై మాట్లాడ్డంతో విషయం తేలిపోయింది. రాజన్ ఐఎంఎఫ్‌లో పనిచేసిన వ్యక్తి తప్ప ప్రగతిశీల విధానాల ప్రతినిధి ఏమీ కాదు. కాకపోతే 2013లో మరీ అధ్వాన్నంగా మారిన ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టడానికి కొన్ని చర్యలు తీసుకున్నారు. అవి ఈ వ్యవస్థను కాపాడేందుకే పనికివస్తాయి అయితే అసలు సంగతి ఆయనకు తెలుసు గనక అతిశయోక్తులు సహించలేకపోయారు.అభివృద్ధి అంటే మనదే అని గొప్పలుపోతుంటే ఇదంతా ఆముడపు చెట్టు చందమని అంధుల రాజ్యం పోలికతో చెప్పారు. అది కాస్తా ఆ సమయంలో మోడీ ప్రభ/త్వ ప్రచార బెలూన్‌కు సూదిబెజ్జంలా మారింది! వడ్డీ రేట్ల తగ్గింపుతో సహా పలు విషయాల్లో ఆయన కొంత స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం బిజెపి వాదనలు పాటించకపోవడం ఏలినవారికి బొత్తిగా నచ్చలేదు. అందుకే విప్పింగ్ బారు సుబ్రహ్మణ్య స్వామిని రంగంలోకి దింపారు. రెండు దశాబ్దాలుగా ఖాళీగా వున్న స్వామికి మోడీ రాజ్యసభ నామినేషన్ వూరికెనే ఇవ్వలేదని గుర్తుంచుకోవాలి.ఆర్థికమంత్రి అరుణ్‌జైట్టీని ఇరకాటంలో పెట్టడానికి స్వామి ఉపయోగపడతాడనే ఆలోచనా వుంది.ఏమైతేనేం ఆయన దాడినుంచి వారే విడగొట్టుకోవలసి వచ్చింది.అయితే అదే సమయంలో అంతర్గతంగా రాజన్‌కు ఎలాటి సంకేతాలు పంపారో తెలియదు. ఆయన వుండాలని పారిశ్రామిక వేత్తలు కూడా కోరారు. అయినా సరే తదుపరి ఎవరిని నియమించాలని పరిశీలించేందుకు ఒక సెర్చి కమిటీని వేయడం ద్వారా తమ అభిప్రాయం బయిటపెట్టుకున్నారు. ఆర్‌బిఐ గవర్నర్‌ను ప్రజాభిప్రాయం బట్టి నియమించడం జరగదని స్వామి నోరుపారేసుకుంటే వారించిన వారు లేరు. ఇవన్నీ గమనించిన తర్వాతనే రాజన్ మరోదఫా కొనసాగదల్చలేదని తనకు తనే ప్రకటించడం మంచిదని భావించారు. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి ఎలాటి విచార ప్రకటనగాని ఉపశమన చర్య గానిలేకపోగా స్వామి మాత్రం పుండు మీడ కారం చల్లే వ్యాఖ్యలు చేస్తూనే వున్నారు. కనుకనే ఇది పొమ్మనలేక పొగపెట్టరని చెప్పవనసరం లేదు. వివిధ వ్యవస్థలపై సంఘ పరివార్ చేస్తున్న దాడిలో ఇది చాలా తీవ్రమైంది.