న్యూస్ మినిట్ కథనం అవాస్తవం
పత్రికలు, ఛానళ్లలో మన ప్రసంగాలు, అభిప్రాయాలు తప్పుగా రావడం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు నిజంగానే పొరపాట్లు జరుగుతుంటాయి అనేది జర్నలిస్టుగా నాకు బాగా తెలిసిన విషయమే. అయితే ఉద్దేశ్యపూర్వకంగా కూడా అప్పుడప్పుడు పొరపాటు కథనాలు వస్తుంటాయి. తమ వాదనను బలపర్చుకోడానికి లేదా అవతలి వారిని ఖండించటానికి ఇలా చేస్తుంటారు. ఈ జాడ్యం సోషల్ మీడియాలో వెబ్‌సైట్లకు కూడా పాకడం దురదృష్టకరం. సాక్షి ఛానల్ ప్రసారాలు నిలిపివేయడంపై నా వ్యాఖ్యలను న్యూస్ మినిట్ అనే వెబ్‌సైట్ ఇలాగే అవాస్తవాలతో కలగాపులగం చేసింది. రాజకీయ భేదాభిప్రాయాలు ఏమైనా ఒక పత్రికను లేదా ఛానల్‌ను అడ్డుకోవడం సరికాదని నేను గట్టిగా భావిస్తున్నాను. ఛానళ్లలో ఈ విషయం స్పష్టంగా ప్రకటించడమే గాక నా వెబ్‌సైట్‌లోనూ రాశానని తెలకపల్లిరవి. కామ్ పాఠకులకు తెలుసు. న్యూస్ మినిట్ కథనంలో మొదటి పేర ఈ మేరకు సరిగానే ఇచ్చారు. కానీ తర్వాత భాగంలో నాకు అపాదించబడిన అంశాలేవీ నేను చెప్పినవి కావు. సాక్షి నిలిపివేత పత్రికా స్వాతంత్రానికి సంబంధించిన సమస్య కాదని నేను అన్నట్లు అందులో ఉన్నది పూర్తి అవాస్తవం. తెలంగాణలో ఎబిన్, టివి9 ఛానళ్లను నిరోధించినప్పుడు నేను గట్టిగా ఖండించాను. ఇదే కోవలో సాక్షి అనధికార నిషేధాన్ని కూడా వ్యతిరేకించాను. అయితే జగన్‌పై కేసులు కక్షసాధింపులు మాత్రమేనన్న వైఎస్‌ఆర్ పార్టీ వాదనతో కూడా నేను ఎప్పుడు ఏకీభవించలేదు. వాటి నిజానిజాలు న్యాయస్థానాల్లో తేలవలిసిందే. సాక్షి ఆస్తులు అటాచ్‌మెంట్లో ఉన్నంత మాత్రాన ప్రభుత్వం స్వాధీనం చేసుకోడానికి చట్టం అనుమతించదని స్పష్టంగా వాదించాను. దీని ఆధారంగా జగన్‌కు రాజకీయ భవిష్యత్తు లేదని నేను విశ్లేషించినట్లు న్యూస్ మినిట్ పేర్కొనడం నాకు మరింత ఆశ్చర్యం కలిగించింది. ఎవరి భవిష్యత్తునైనా ప్రజలే నిర్ణయిస్తారు తప్ప జోస్యాలు చెప్పడం అలవాటు లేదు. జగన్‌పైన కేసులున్న మాట నిజం. ఆయన ప్రతిపక్ష నాయకుడన్నది కూడా నిజం. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ‘ఆ రెండు పత్రికలు’ అంటూ హేళనగా మాట్లాడడం, మార్గదర్శిపై దాడులు వంటివి కూడా జరిగాయి. అప్పట్లోనే వాటిపై విమర్శ కూడా చేశాను. అయితే అంతమాత్రాన సాక్షి ప్రసారాలను అడ్డుకోవడం స్వాధీనం చేసుకుంటామని రాజకీయ బెదిరింపులు చేయడం సమర్థించరానివి.
దీనిపై న్యూస్ మినిట్ ప్రతినిధికి వాస్తవ సమాచారం పంపి మూడు రోజులు గడిచినప్పటికీ సవరించుకోనందువల్ల ఇక్కడ ఇవ్వాల్సి వచ్చింది. వెబ్‌సైట్లతో ఇలాంటి కొద్దిపాటి చేదు అనుభవాలు గతంలోనూ ఉన్నా దీని తీవ్రత రీత్యా చెప్పాల్సి వచ్చింది. పత్రికల్లా వాటిని అందరూ అప్పటికప్పుడు చూడరుగనుక మరింత బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది.
