మోడీ రాజ్యంలో చీకటి రోజుకు శిక్షలు

Gulberg-violence-verdict

 

 

2002 గుజరాత్‌ హత్యాకాండ సమయంలో జరిగిన గుల్‌బర్గ్‌ సొసైటీ మారణహోమం పౌర సమాజ చరిత్రలోనే చీకటి రోజని ప్రత్యేక న్యాయస్థానం వ్యాఖ్యానించింది. మొత్తం 69 మంది ప్రాణాలు బలైన ఈ రాక్షసకాండకు బాధ్యులైన 24 మందికి శిక్షలు విధించింది. 11మంది నేరస్థులకు 14 ఏళ్లు యావజ్జీవ కారాగారం, 12 మందికి 7 ఏళ్లు, ఒక్కరికి 10 ఏళ్లు శిక్ష విధిస్తూ జస్టిస్‌ పిబి దేశారు ఉత్తర్వులు ఇచ్చారు. ఈ కేసులో నేర నిర్ధారణ జూన్‌2నే పూర్తి అయ్యింది. హత్యలతో సంబంధం లేకుండా అల్లర్లకు పాల్పడుతున్న మరో 36 మందిపై తర్వాత తీర్పు ప్రకటిస్తానని న్యాయమూర్తి పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ఎంపీ ఇషాన్‌్‌ జాఫ్రీీతో సహా 69 మంది ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటన మోడీ హయాంలో జరిగిన గుజరాత్‌ హత్యాకాండలో తీవ్రమైందిగా సంచలనం కలిగించింది. ఇలాంటి కేసులు మొత్తం 8 వరకు సుప్రీంకోర్టు గుర్తించి ప్రత్యేక విచారణ సంఘం (సిట్‌) ఏర్పాటు చేసింది. అయితే విధించిన శిక్షలు సంతృప్తికరంగా లేవని న్యాయపోరాటం సాగిస్తున్న జాఫ్రీీి సతీమణి జెకియా వ్యాఖ్యానించారు. మొత్తం అందరికి యావజ్జీవ శిక్షలు వేసి ఉండాల్సిందని ఆమె పేర్కొన్నారు. గుల్‌బర్గ్‌ సొసైటి ఘటనకు సంబంధించి ప్రత్యేక న్యాయస్థానం విచారణ గతేడాదే ముగిసినా సుప్రీంకోర్టు తీర్పు మేరకు తుది తీర్పును వాయిదా వేశారు.
సిబిఐ మాజీ అధినేత ఆర్‌కె రాఘవన్‌ అధ్యక్షతన 2008లో నియమించిన సిట్‌ తదుపరి ఏడాది నివేదిక సమర్పించింది. ముఖ్యమంత్రి మోడీ వ్యాఖ్యల వల్లనే హత్యాకాండ జరిగిందని చెప్పడానికి ఆధారాలు లేవని సిట్‌ చెప్పడం ఆయన బయటపడడానికి దోహదం చేసింది. గుల్‌బర్గ్‌ సొసైటి ఘటనలో ఎంపీ ఇషాన్‌ కాల్పులు జరపడం వల్లనే ప్రజలు రెచ్చిపోయారనే సిద్ధాంతాన్ని గుజరాత్‌ ప్రభుత్వం ముందుకు తెచ్చింది. చర్యకు ప్రతిచర్య అన్న న్యూటన్‌ సూత్రం ఇక్కడ పనిచేసిందని మోడీ అప్పట్లో జీటివి ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. అయితే తర్వాత ఏడేళ్లకు 2010లో సిట్‌ ముందు హాజరైనప్పుడు తాను గతంలో ఏమన్నది గుర్తు లేదని తప్పించుకున్నారు. గుల్‌బర్గ్‌ సొసైటి కేసులో మొత్తం 66 మందిపై ఫిర్యాదు నమోదు చేయగా 6గురు విచారణ కాలంలో మరణించారు. విహెచ్‌పి నాయకులు కూడా శిక్ష పడిన వారిలో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *