ప్రజల కోసమా? టాటాల మేలుకా?

 

 

 

Vistara               అరగంట విమానయానానికి రూ.1250, గంట వరకు రూ. 2500 దాటరాదని కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయం చేసింది. ఇది సామాన్య ప్రజల స్వప్నాలు నిజం చేస్తుందని గొప్పగా చెప్పుకుంటున్నది. కొద్దిపాటి ఆర్థిక స్థోమత ఉన్నవారు కూడా ఎప్పుడైన విమానాల గురించి ఆలోచించేందుకు ఇది సహజపడవచ్చు కానీ, దేశంలో 80 శాతానికి పైగా ప్రజలు రైళ్లు, బస్సులే ఎక్కుతుంటారు. రాజకీయ నాయకులు, వాణిజ్యవేత్తలు, ఉన్నత స్థాయి వ్యక్తులే విమానాల్లో తిరుగుతారనే భావం సమాజంలో స్థిరపడిపోయింది. టికెట్టు ధర తక్కువగా ఉన్నా విమానాశ్రయానికి చేరుకోవడం ఇతర వడ్డింపులు వంటివి ఈ పేద దేశంలో పెనుభారాలుగానే చూస్తారు. దీంతోపాటే నూతన విమానయాన సంస్థలు సులభంగా అభివృద్ధి చెందేందుకు కొత్త విధానం మేలు చేస్తుందని మీడియాలో కథనాలు చెబుతున్నారు. నిజానికి నూతన విమాన విధానం ప్రజలకన్నా, కొత్త సంస్థలకన్నా టాటాలకు ఎక్కువ మేలు చేస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. విస్తారా, ఎయిర్‌ ఏసియా వంటి విమాన సంస్థల్లో టాటాలకు భారీగా వాటాలు ఉన్నాయి. అయితే ఇప్పటివరకు అమలులో ఉన్నా 5/20 నిబంధన వాటి వాణిజ్యానికి పగ్గాలు వేస్తున్నది. 20కి పైగా విమానాలు ఉన్న సంస్థ అయిదేళ్ల పాటు సేవలను అందించిన తరువాతే అంతర్జాతీయ రాకపోకలు చేపట్టాలని 5/20 నిబంధన నిర్దేశిస్తున్నది. విస్తారాకు మూడేళ్లు కూడా పూర్తి కాలేదు. అందుకే ఈ నిబంధన మార్చాలని టాటాలు చాలా ఒత్తిడి చేస్తూ వచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీకి, రతన్‌ టాటాకు ఉన్న సాన్నిహిత్యం అందరికి తెలిసిందే. మొదట్లో ఏయిర్‌లైన్స్‌ టాటాలే నడుపేవారు. ఇండియన్‌ ఏయిర్‌లైన్స్‌ తరువాత ఆ రంగాన్ని చేపట్టింది. సరళీకరణ యుగంలో ఎన్నో ప్రయివేటు సంస్థల రాకతో ఎయిర్‌ఇండియా మరుగున పడిపోయింది. 2007లో ఎయిర్‌ఇండియా, ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ విలీనం చేశారు. నష్టాల నుంచి బయటపడేందుకు 30వేల కోట్ల బెయిలవుట్‌ ప్రకటించి ఇప్పటికి 22వేలు సమకూర్చారు. అయినా అది అధ్వాన్నంగా ఉందని స్వయాన పౌరవిమానయాన మంత్రి అశోక్‌ గజపతి రాజు ఛీత్కరించారు. తాము అమ్మకానికి పెట్టిన దీన్ని ఎవ్వరు కొనేవారు ఎవ్వరు లేరని తీసిపడేశారు. వాస్తవానికి ఏప్రిల్‌ నెలలో చూస్తే దేశీయ రాకపోకల్లో 15శాతం పైగా ఎయిర్‌ ఇండియా నిర్వహించింది. ఇప్పుడు 130 విమానాలున్న సంస్థ మరో వంద సమకూర్చుకోవాలని భావిస్తున్నది. కాని ప్రభుత్వం మాత్రం దాని లోపాలను సరిదిద్ది ముందుకు నడిపే బదులు టాటాలకు మేలు చేసేందుకు పాకులాడుతున్నది. 5/20 నిబంధన తొలగించాక ఇండిగో, స్పైస్‌జెట్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌ వంటి ప్రయివేటు సంస్థలు కూడా నష్టపోతాయి. ఎందుకంటే ఎకాఎకిన విస్తారా విదేశాలకు విమానాలు తిప్పేందుకు ప్రయాణాలు ప్రారంభించనుంది. విదేశాల్లో తమకు చాలా కంపెనీల్లో వాటాలున్నాయి కనుక ఇది లాభదాయకమని వారు ఆనందపడుతున్నారు. మరోవైపున ఎయిర్‌ఇండియా వంటివి ప్రభుత్వాధినేతల సేవలతో నష్టదాయకమైన రూట్లతో దెబ్బతింటున్నాయి.క నుక ప్రజల కోసం నూతన విధానం అన్న ప్రచారం బూటకమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *