కెసిఆర్ కుట్ర సిద్ధాంతం..
కుట్ర సిద్ధాంతాలలో ఒక సౌలభ్యం వుంటుంది. అది రహస్యంగా జరుగుతుంది. రహస్యం గనక అందరికీ తెలియదు. తెలియదు గనక జరిగిందని చెబితే నమ్మే వీలుంటుంది. ఆధారాలు చూపించాల్సిన అవసరం వుండదు. తర్కంతో పనే వుండదు. కుట్ర ముద్ర వేశాక అవతలివారిని ఏం చేసినా చెల్లుతుంది. మనంచేసేదంతా రైటైపోతుంది.ఇందిరాగాంధీ అత్యవవసర పరిస్థితి విధించినప్పుడు కూడా కుట్ర సిద్ధాంతమే చెప్పారు.దాదాపు మూడు దశాబ్దాల తర్వాత కేంద్రంలో స్వంత ఆధిక్యతతో ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రధాని నరేంద్ర మోడీ తనను కూల్చే కుట్ర జరగుతుందంటారు. తెలంగాణ సాధన సమరానికి సారథిగా టిఆర్‌ఎస్ ప్రభుత్వ సారథ్యం చేపట్టిన కెసిఆర్ గారు తమపై మొదట్లోనే కుట్ర జరిగిందంటారు. తన హయాంలో అభివృద్ధి జరుగకుండా అడ్డుకోవడానికి ప్రతిపక్షం కుట్ర చేస్తున్నదని నవ్యాంధ్ర ప్రదేశ్ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపిస్తారు. ఇది గాక రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పరస్పరం కుట్ర ఆరోపణలు చేసుకుంటారు. మళ్లీ ఆ అధినాయకులే ఆలింగనాలు చేసుకుంటారు. ఆహ్వానాలు ఇచ్చుకుంటారు. కేంద్ర రాష్ట్రాలు ప్రశంసలు కురిపించుకుంటాయి.పాత కాలపు రేడియోల్లాగా స్వరం పెంచుతూ తగ్గిస్తూ కొన్ని సార్లు మ్యూట్ చేస్తూ కథ నడిపిస్తుంటారు.మనం ప్రజలం. దేవుళ్లం. కనుక విగ్రహాల్లాగా ఇదంతా చూస్తుండాలి. చూపించాల్సిందేమిటో కూడా వారే నిర్ణయిస్తారు .నిషేదిస్తారు. అక్కడా కుట్ర సిద్ధాంతాలు వచ్చేస్తాయి.సిద్ధాంతాలనే కుట్రలుగా చూపించే వైపరీత్యాలూ సంభవిస్తాయి.
ఈ కుట్రపురాణంలో తాజా అధ్యాయానికి మళ్లీ వస్తే- తెలంగాణలో తమ పార్టీ 63 సీట్లు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలోగానే కుట్రలు జరిగాయని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. అది కూడా తనకు మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ద్వారా తెలిసందన్నారు. నిఘావిభాగం పేరు కూడా ప్రస్తావించినా వక్కాణింపు మాత్రం ఒవైసీపైనే. ఈ కుట్రనుంచి తనను ఆదుకోవడానికి ఒవైసీ హామీ ఇచ్చారట. (టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడగానే కెటిఆర్ తొలుదొల్తగా అక్బరుద్దీన్ ఒవైసీని కలుసుకోవడంతో సరిపోలే సమాచారమే ఇది) కాంగ్రెస్ తెలుగుదేశం కలసి చేసిన ఈ కుట్రకు ఢిల్లీ స్థాయిలోనూ సాగిందట.
ఇదంతా నిజమే అయితే ఉద్యమ నాయకుడుగా అధికార పీఠం వరకూ విజయయాత్ర చేస్తున్న కెసిఆర్ తన వెనక వున్న శాసనసభ్యులతోనూ ఉద్యమ సంస్థలతోనూ పంచుకోవలసింది. కుట్ర వమ్ము చేయాలని పిలుపునివ్వాల్సింది. కాంగ్రెస్ తెలుగుదేశం బిజెపి కలసి కుట్ర చేయడం సంభవమే అయితే- కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో నూతన ప్రభుత్వాన్ని ఆదిలోనే రాకుండాచేసేంత అవివేకపు అపరిపక్వపు దుస్సాహసమే చేసి వుంటే ప్రజాస్వామిక వాదులందనూ కుట్రకు వ్యతిరేకంగా కెసిఆర్‌ను బలపర్చివుండేవారు. కాని జరిగింది వేరు. కనీసం తన పార్టీ ఎంఎల్‌ఎలకు కూడా ఈ సమాచారం చెప్పారో లేదో తెలియదు గాని ఇందకు విరుగుడుగా ఫిరాయింపులకు పిలుపునివ్వాలని నిర్ణయించుకున్నారు. ఉద్యమ కెరటాలపై తేలివచ్చిన సభ్యులలో ఒక్కరైనా తనను వీడిపోరనే నమ్మకం ఆయనకు మొదటే లేదనుకోవాలా? సాధించుకున్న తెలంగాణలో గెలిపించుకున్న తొలి ప్రభుత్వాన్ని కాపాడుకోలేనంత నిస్సహాయులుగా ప్రజలు కనిపించారా? అసదుద్దీన్ ఒవైసీ మాటలతో అభద్రత ఆవరించిన తర్వాత ్త అశేష ప్రజానీకం తన వెనక వున్నారనే భరోసా ఏమైపోయినట్టు? అడక్కతప్పని ప్రశ్నలు.
అవతలివారి కుట్రలకు సమాధానం మన కుట్రలనుకుని సాక్షాత్తూ మీపైనే శాపనార్తాలు పెట్టిన వారిని కూడా తెచ్చి పెట్టుకోవడం మొదలుపెట్టారా? కుట్రకు కుట్రే సమాధానం అనొచ్చు గాని అవతలి కుట్ర కన్నా ప్రస్ఫుటంగా ఈ ఫిరాయింపు క్రీడలోనే కుట్రల ఛాయలు మీ వారికే కనిపించాయే! ఇంత సామూహికంగా అవతలి పార్టీల వారిని తీసుకురావడం అంతర్గత బలాబలాల మార్పునకేనని వారే అనుకోవలసిస స్థితి కల్పించారు కదా. ఓడిపోయిన వారిని ఫిరాయించిన వారిని తెచ్చి మంత్రులుగా ప్రతిష్టించి వరుస క్రమం మార్చేశారే.మీరనుకున్న వారిని అందలమెక్కించి అతికీలకమనుకున్నవారిని అందరిలో ఒకరుగా చేసేశారే! 2014 మేలో కుట్ర జరిగిందనుకుంటే 2016 జూన్ వరకూ నిర్విరామంగా వలస పక్షలును వరసకట్టి తీసుకొస్తున్నారే- ఇదంతా బంగారు తెలంగాణ నినాదానికి వన్నె తెచ్చిందా? లేక రాజకీయ మకిలి అంటిందా? కొత్త రాష్ట్రంలో పాత సంసృతి కొనసాగనిచ్చి నూతన రాజకీయం గురించి ఎంత చెబితే ఏం ఫలితం? మీరు చేస్తే ఒకటి మేము చేస్తే ఒకటా అని సవాలు చేయడం ద్వారా మనమంతా ఒకటేనని ఒప్పేసుకుంటున్నారా? తెలుగు రాష్ట్రాల పాలకుల ఫార్ములా ప్రకారం అభివృద్ది జరగాలంటే అధికార పక్షంలోనే వుండాలనేట్టయితే కేంద్రంలోనూ అందరూ బిజెపిలో చేరిపోవాలా?
ఎన్టీఆర్ ఘన విజయం సాధించిన ఏడాదిలోనే నాదెండ్ల భాస్కరరావు ద్వారా కేంద్ర కాంగ్రెస్ కూలగొడితే తెలుగు ప్రజలు ప్రతిపక్షాలన్నీ ఉవ్వెత్తున ఎగిసి పున: ప్రతిష్టించిన సంప్రదాయం మనకుంది. అదే ఎన్టీఆర్‌ను కొన్ని ప్రత్యేక పరిస్థితులలో అంతర్గత తిరుగుబాటుతో పడగొట్టినప్పుడు ఆ బృందంలోనూ మీరున్నారు. ఇందులో మొదటి దాన్ని గురించి మీరు చెబుతున్నా రెండవ దాన్ని గురించి ఆందోళన ఫలితేం ఈ ఫిరాయింపుల హౌమం అనుకోవాలా? ఈ ఆగమనాల వెనక అనధికార ఒప్పందాలు రాజ్యాంగ ఉల్లంఘనలు మాత్రం ప్రజలిచ్చిన తీర్పునకు విఘాతం కాదా? వాటిని విశ్వాస రాహిత్యం కింద పరిగణించకూడదా? రాజీనామా చేస్తామనేవారిని కూడా వారించి కండువా లేకుండానే పార్టీలో చేర్చుకోవడానికి అంగీకరించడం వెనక ఏ చట్టం భయం పనిచేస్తున్నది?
ఏతావాతా మారింది సరిహద్దులే గాని పాలక పక్షాల బుద్దులు కాదని రోజురోజుకు మరింతగా రుజువవుతున్నది. వ్యవస్థల నిర్వహణా వ్యాపారవర్గాల సంరక్షణ వందిమాగధుల విస్తరణ అన్నీ సలక్షణంగా సాగిపోతున్నాయి. కాగా ఇంత తేలిగ్గా కండువాలు కప్పుకుని పార్టీలు మారిపోతున్న తీరు చూస్తూ ఎప్పుడో కొసరాజు రాసిన (పాలకవర్గ)పార్టీలన్నీ ఒక్కటేనయా అన్న పాట గుర్తుకు వస్తుంది. అందుకే టీడీపీ టిఆర్‌ఎస్ వైసీపీ కాంగ్రెస్ వంటి తేడాలు లేకుండా ఎక్కడైనా ఇమిడిపోగలుగుతున్నారు. మొదటిసారి సిపిఐ ప్రస్తుత శాసనసభ్యులు కూడా ఒకరు ఫిరాయింపుల జాబితాలో చేరడం ఒక్కటే అసాధారణం. ఆయనను తను పిలవలేదని కూడా ముఖ్యమంత్రి ప్రకటించారు. . ఏమైతేనేం ఈ ఫిరాయింపుల క్రీడ భరించలేని స్థాయిలో వుందన్న మనికితం ఎక్కడో పట్టుకోబట్టే అధినేత ఒక విదమైన సంజాయిషీలాగే కుట్ర సిద్ధాంతం ప్రకటించారు. ఇప్పటికైనా దాని వివరాలు వెల్లడిస్తే ప్రజలు అవగాహన పెంచుకుంటారు. కుట్ర దారులు బహిర్గతమవుతారు. దాంతోపాటు ఇద్దరు ముఖ్యమంత్రులు పోటాపోటీగా ఆరోపణలు చేసుకున్న ఓటుకు నోటు ఫోన్ ట్యాపింగ్ ఉదంతాలు కూడా పూర్తిగా వెల్లడి చేస్తే కొంతలో కొంత స్పష్టత వస్తుంది. మీరు స్నేహం అంటే స్నేహం, ద్వేషం అంటే ద్వేషం, కుట్ర అంటే కుట్ర అంటూ పల్లవి మార్చేస్తుంటే అడకత్తెరలో పోకచెక్కలా అమాయక అనుయాయులు నలిగిపోతారు. పార్టీల కుటిల రాజకీయాలనూ రాష్ట్రాల చారిత్రిక భవితవ్యాన్ని కలగాపులగం చేయవద్దని కోరుకుంటారు.
ముఖ్యమంత్రి శైలిలో ముగింపు నివ్వాలంటే – అన్ని రకాల కుత్సితాలు కుట్రలు నశించుగాక. సర్వత్రా సత్యము ధర్మము జయించుగాక. సకల దేశ సామాన్య ప్రజల కలలు ఫలించుగాక. ఆధిపత్య రాజకీయాలు హరించుగాక.
గమనం, ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజీ, 17.06.2016
