ఆర్టీసీకి ప్రభుత్వాల ఎసరు?
సమ్మెలు చేస్తే ఆర్టీసీని మూసేస్తాం అని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు బెదిరించడం దిగ్బ్రాంతి కలిగిస్తుంది. నష్టాల్లో నడుస్తున్న ఆర్టీసీని గట్టెక్కించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. నష్టాల్లో ఉన్నా కార్మికులకు 44 శాతం ఫిట్‌మెంట్‌తో జీతాలు పెంచామని ఆయన చెప్పారు. నష్టాలతో ఆర్టీసీని నడపడం కంటే మూసేయడమే మంచిదనే అభిప్రాయం వ్యక్తమైందంటున్నారు. కాని కార్మికుల సంఘాలు చెబుతున్న వాస్తవాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. సంస్థ నష్టాలకు కారణం ప్రభుత్వ యాజమాన్య విధానాలేననేది వారు అంటున్నారు.
ఆర్టీసీ బస్సుల సంఖ్య తగ్గిపోయి, అద్దె బస్‌లు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. 2014లో 1100గా వున్న అద్దె బస్సులు నేడు 2238కు పెరిగాయి. ఫలితంగా 2500 మంది డ్రైవర్లు మిగులు తేలారు. ఆర్టీసీ విస్తరణ ఆగిపోయింది. 44శాతం ఫిట్‌మెంట్ ఇచ్చాం. కాబట్టి రూ.650 కోట్లు నష్టం వచ్చిందని, ఆ భారాన్ని పనిభారం రూపంలో కార్మికులపై వేస్తున్నారు. ఆదాయం తక్కువ వుందని ఎక్స్‌ప్రెస్ సర్వీసులను రద్దు చేస్తున్నారు. చట్టాలను తుంగలో తొక్కి పని పరిస్థితులను మార్చి వేస్తున్నారు. సర్వం ప్రయివేటు, కాంట్రాక్టుల మయం చేస్తున్నారు. మస్టర్స్ కుదింపు, పని గంటల పెంపు, ఆదాయం పేర, ఆయిల్ పొదుపు పేరున వేధింపులు ఎక్కువయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో కలిసికట్టుగా జూన్ 23న ఒక్కరోజు సమ్మె చేయాలని నోటీసులు ఇచ్చాయి. దీనిపై చర్చించి పరిష్కరించే బదులు రాజకీయాలు ఆపాదించడం అనుచితం.
నిజానికి ఈ సమస్య తెలంగాణ రాష్ట్రానికి పరిమితం కాదు. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే కనిపిస్తుంది. అసలు దేశవ్యాప్తంగా ఆర్టీసీలను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం 2016-17 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో పేర్కొన్న విధంగా పర్మిట్‌రాజ్ వ్యవస్థను రద్దు చేస్తూ నిర్ణయాలు తీసుకున్నది. మోటారు వాహన చట్టం 1988ని రద్దు చేసి ప్రజా రవాణాలో ప్రయివేటుకు భాగస్వామ్యం కల్పిస్తామని బడ్జెట్ ప్రసంగంలో ప్రభుత్వం పేర్కొన్న విషయం తెలిసిందే. ఆ మేరకు ఆర్టీసీల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తూ నిర్ణయాలు అమలును వేగవంతం చేసింది. దానిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలతో ఏ మాత్రం సంబంధం లేకుండా నేరుగా కేంద్రప్రభుత్వమే ఆర్టీసీలపై సర్వీస్ ట్యాక్స్ (సేవా పన్ను) పేరుతో పన్ను వసూళ్లకు శ్రీకారం చుట్టింది. ఇప్పుడు ప్రయివేటు బస్సులు మహరాజుల్లా తిరిగే కాలం వస్తోందన్న మాట.
