రాహుల్‌తోనే రాజకీయ చికిత్సా!?
బుద్ధుడి కుమారుడు రాహులుడు. తను సర్వం త్యజించి వెళ్లాలనుకుంటున్నప్పుడు ఈ కుమారుడు పుట్టడంతో రాహువులా అడ్డుపడతాడనే భావన వెంటాడగా సిద్దార్థుడు చమత్కారంగా రాహులుడు పుట్టాడా అని అడిగినట్టు కథ. ఇప్పుడు కాంగ్రెస్ విషయంలో ఈ కథ తలకిందులుగా నడుస్తుంది. రాహుల్‌గాంధీ వైఫల్యం వల్లనే కాంగ్రెస్ ఈ స్థితికి వచ్చిందని చాలామంది విమర్శిస్తుంటే ఆయనే పరిష్కార ప్రదాత అని మరికొంతమంది ప్రచారం చేస్తున్నారు. మొత్తంపైన కాంగ్రెస్ దురవస్థకు ఆయన కారకుడా లేక విరుగుడా అనే దానిపై పూర్తి భిన్నమైన రెండు అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గెలిచినా ఓడినా నెహ్రూ కుటుంబాన్నే పట్టుకు వేళ్లాడే చాలా మంది నాయకులు అందులోనూ వందిమాగధ నిపుణులు రాహుల్‌కు త్వరగా పగ్గాలు ఇచ్చేయాలని వత్తిడి చేస్తున్నారు. దేశంలో అతి పురాతన పార్టీగా టముకు వేసుకునే ఆ పార్టీ ఇంత బలహీన స్థితికి చేరుకోవడానికి కారణమేమిటన్నది సమీక్షించుకోవడానికి సవరించుకోవడానికి మాత్రం సిద్దపడటం లేదు. ఎందుకంటే లోక్‌సభలో ప్రతిపక్ష హౌదా కూడా పొందలేకపోగా రాష్ట్రాలన్నిటిలోనూ దాదాపు తుడిచిపెట్టుకుపోయిన దశ గతంలో ఎన్నడూ లేదు.
బిజెపి పాచిక
కాంగ్రెస్ వాదుల ఈ ప్రహసనాలు బిజెపి రాజకీయ దాడికి అందివచ్చిన అవకాశాలుగా వుంటున్నాయి.నిజానికి కాంగ్రెస్‌పై దాడి చేయడం ద్వారా తమను గొప్ప చేసుకోవడం బిజెపి నాయకత్వ వ్యూహంగా వుంది. 2102 నుంచే రాహుల్‌గాంధీ కన్నా నరేంద్ర మోడీ మెరుగనే రీతిలో వారు ప్రచారం ప్రారంభించారు. ఎన్నికల ప్రచారంలోనూ మోడీ షెహన్‌షా అంటూ రాహుల్‌పైనే గురి పెట్టి ఓటర్లను ఆకట్టుకున్నారు.ఇప్పుడు కూడా తమ మతతత్వ
రాజకీయాలపైన ప్రజా వ్యతిరేక చర్యలపైన ఏ విమర్శ వచ్చినా కాంగ్రెస్ హయాంలో జరిగిన వాటిని గుర్తు చేయడం ఒక ఎత్తుగడగా సాగుతున్నది.వీటికి గట్టి సమాధానం ఇచ్చే స్థితిలో కాంగ్రెస్ లేదన్నది నిజం. అప్రజాస్వామికమైన కాంగ్రెస్ గుత్తాధిపత్యం దశలవారీగా బీటలు వారి 1990ల తర్వాత అది అన్ని పార్టీలలో ఒకటిగా మారింది. కారణం కూడా కాంగ్రెస్ స్వయం కృతాలే.మతతత్వ శక్తుల పెరుగుదలకు దోహదంచేసింది కూడా కాంగ్రెస్ పార్టీయేనన్నది చారిత్రిక సత్యం. సరళీకరణకు మత మార్కెట్‌తత్వాలు బొమ్మ బొరుసు అనుకుంటే ఈ రెంటికీ బీజాలు పడింది 1991-1996 పివి నరసింహారావు పాలన కాలంలో. అటు మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ప్రవేశపెట్టిన విధానాలు ఇటు అయోధ్యలో బాబరీ విధ్వంసానికి అవకాశమిచ్చిన రాజకీయాలు ఇందుకు నిదర్శనాలు. వీటి పర్యవసానంగా విదేశాంగ విధానంలోనూ తామే గొప్పగాచెప్పే అలీన విధానాన్ని విడనాడి అమెరికాకు చేరువ కావడం మొదలైంది. ఇదంతా కాంగ్రెస్ ప్రజాపునాదిని తొలిచేస్తూ వచ్చింది.
దుర్భర మన్మోహనం
అయితే వాజ్‌పేయి నాయకత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వ హయాంలో గుజరాత్ మారణహౌమం, సంఘ పరివార్ శక్తుల విజృంభణ, అమెరికాకు దాసోహమనడం వంటివన్నీ కలసి బిజెపి ఓటమికి దారితీశాయి. ఆ క్రమంలో వామపక్షాలు కూడా కీలక పాత్ర పోషించాయి. వాటి ఒత్తిడి కారణంగానే గ్రామీణ ఉపాధి హామీ వంటి మంచి పథకాలు వచ్చాయి. కాని విదేశాంగ విధానంలోనూ ఆర్థికరంగంలోనూ కాంగ్రెస్ ధోరణులు మరింత దారుణంగా తయారైనాయి. అలు అలీన విధానాన్ని ఇటు అణుశక్తిరంగాన్ని కూడా అమెరికాకు తాకట్టు పెట్టేవిధంగా అణుఒప్పందం కుదుర్చుకున్నారు. అంతకు ముందు ఆర్థిక మంత్రిగా వుండి తాను మొదలుపెట్టిన విధానాలను మన్మోహన్ పరాకాష్టకు తీసుకువెళ్లారు. అణుఒప్పందం సమస్యపై రాజీనామాకు కూడా సిద్దమన్నారు. వామపక్షాలు వ్యతిరేకిస్తే ఇతర పార్టీల సభ్యులను కొనుగోలు చేసి అధికారం కాపాడుకున్నారు. ఇదంతా ఒక జుగుప్సాకర అధ్యాయం. అయితే తమకోసం అంతగా సేవచేసే ఆ సర్కారును దేశ విదేశీ కార్పొరేట్ శక్తులు మరోసారి అధికారానికి తెచ్చుకోవాలనుకున్నాయి. ఇప్పుడు మోడీకి అమెరికా బ్రహ్మరథం గురించి మురిసిపోయేవారు పాత పత్రికలు తిరగేస్తే అప్పుడు ఆయననూ ఇలాగే మునగచెట్టెక్కించిన సంగతి తెలుస్తుంది. వామపక్షాల పాత్ర లేకపోవడం, అచ్చంగా సంపన్న వర్గాల సామ్రాజ్యవాదుల ఆశీస్సులతో గెలవడం మన్మోహన్ సింగ్ ప్రభుత్వ ప్రతిష్టనే గాక పట్టును కూడా క్షీణింపచేసింది. అప్పటికే పార్టీలో రాహుల్‌గాంధీ చక్రం తిప్పుతున్నారు. ఆయన సలహాల మేరకే తాను మంచి పనులు చేశానని ప్రధాని బహిరంగంగా చెప్పుకుంటున్న స్థితి.2జి, కామన్వెల్త్,అంతరిక్ష్,ఇలా వరస కుంభకోణాల వెల్లడవుతుంటే మిశ్రమ ప్రభుత్వ ధర్మం అంటూ ప్రధాని సమర్థించుకోలేక సతమతమైన స్థితి. వాటిపై తక్కువగా రాయండని మీడియాను బతిమాలిన దశ. రాష్ట్రాలలోలనూ అనేక అసహ్యకరమైన అవినీతి వ్యవహారాలు. అంతర్గత కలహాలు. అన్నిచోట్లా ఓటములు పాలవుతున్న దుస్థితి అప్పుడే ఎదురైంది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ఈ దారుణ పరిస్థితికి సాక్షిగా నిలిచింది.వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం జగన్ తిరుగుబాటు, తెలంగాణ ఉద్యమం రెంటిలోనూ కాంగ్రెస్ అవకాశవాద విన్యాసాలు దుర్భరంగా తయారైనాయి. దేశమంతటా ఓడిపోయినా తెలంగాణలోనైనా మంచి ఫలితాలు వస్తాయనుకున్నది కూడా బెడిసికొట్టిందంటే ఇదే కారణం. ఇప్పుడు ఆ గెలిచిన ఎంఎల్‌ఎలు కూడా నిష్క్రమిస్తున్న పరిస్థితి.
చెంపలేసుకోరు.. తప్పు దిద్దుకోరు..
ఇవన్నీ జరిగినప్పుడు రాహుల్‌గాందీ లేనట్టు ఇప్పుడు ఆయనకు అద్యక్ష పీఠం అప్పగిస్తే అద్భుతాలు జరిగిపోతాయన్నట్టు కాంగ్రెస్ నాయకులు మాట్లాడ్డం మెరమెచ్చులకోసం తప్ప నిజమైన నమ్మకంతో కాదు.తమ అవినీతి అవకాశవాద విధానాలపై సమీక్ష చేసుకోకుండా అవి పునరావృతం కానివ్వబోమనే నమ్మకం ప్రజల్లో కలిగించకుండా కాంగ్రెస్ కోలుకోవాలనుకోవడం అత్యాశ. ఆచరణ సాధ్యం కాని పని. కాంగ్రెస్ స్వభావంలో ఏదో గొప్ప మార్పు వస్తుందని ఎవరూ ఆశించరు. కానీ కనీసం గతంలో తమ నేతలు నెహ్రూ ఇందిరాగాంధీల హయాంలో వున్న స్వావలంబన, అలీన విధానం వంటివాటినైనా పునరుద్ధరించకపోతే కాంగ్రెస్ ఎలా ఆదరణ పొందగలుగుతుంది? అవినీతి ఆరోపణలను ఖండించడం దాటవేయడం తప్ప ఆత్మవిమర్శ లేకపోతే ఎలా కుదురుతుంది?తాజాగా ఆగష్టా వెస్ట్‌ల్యాండ్ ఇతర రక్షణ కొనుగోళ్లకు సంబంధించి రాబర్ట్ వద్రా పేరు రాగానే సోనియా గాంధీ సహా మొత్తం రంగంలోకి దిగి సమర్థించడం ఎలా చెల్లుబాటవుతుంది? వాటిని బిజెపి రాజకీయ కక్ష సాధింపుకోనం వాడుకోవడం ఒకటైతే గజం మిథ్య పలాయనం మిథ్య అని కాంగ్రెస్ అన్నీ కొట్టిపారేయడం మాత్రం సరైందవుతుందా? ఇన్ని దుష్పరిణామాలకు అనర్థాలకు బీజాలు వేసిన తమ పాత్ర గురించి ఒక్కసారైనా ఆ పార్టీ చెంపేలేసుకున్న సందర్భం వుందా?
రాహుల్‌గాంధీ కాదు ప్రియాంక గాంధీ రావాలనీ కాదంటే సోనియానే మరింత కాలం కొనసాగాలని ఆ ముగ్గురి మధ్యనే గిరిటీలు కొట్టడం భావ దారిద్య్రాన్ని రాచరిక ప్రవృత్తిని సూచిస్తుంది.. బిజెపి భిన్నం అని చెప్పుకుంటున్నా అక్కడ ఆరెస్సెస్ రాజ్యాంగేతర పెత్తనం నిరంతరం నడుస్తుంటుంది. ఈ రెంటినీ ఖండించే ప్రాంతీయ పార్టీల్లోనూ కాంగ్రెస్‌ను మించిపోయేలా కుటుంబాల తంతు నడుస్తున్నది. ఈ కారణంగానే ఎవరు గెలిచినా ఓడినా వినాశకర విధానాలు నిరాఘాటంగా కొనసాగుతున్నాయి. కార్పొరేట్లను కాంట్రాక్టర్లను నెత్తిన పెట్టుకోవడం, మూఢ నమ్మకాలకు పెద్దపీట వేయడం, తాత్కాలిక తాయిలాలతో మురిపించడం ఒక రాజకీయ ప్రక్రియగా మారిపోయింది. వీటికి మూలవిరాట్టు లాటి కాంగ్రెస్ కూడా ఇప్పుడు ఈ కొత్త శక్తుల ముందు నిలవలేక ప్రతిచోటా పరాభవం మూటకట్టుకుంటున్నది. కనుక వ్యక్తుల భజనతో లేదా మార్పుతో ఏదో మారిపోతుందనుకోవడం భ్రమ మాత్రమే. మారాల్సింది విధానాలే గాని విగ్రహాలు కాదు. కాయకల్ప చికిత్సలతో చిట్కాలతో కాంగ్రెస్ కోలుకోవడం జరిగేపని కాదు అని మాత్రం మొదటగా చెప్పవలసి వుంది.జరగాల్సింది సంపూర్ణ ప్రక్షాళన, ఇతర పాలక పార్టీలకూ అదే మందు. కాకపోతే సమయం చూసి ప్రజలే ఆ చికిత్స చేస్తారు.
నవతెలంగాణ,జూన్16,2016