కుట్ర… ఎవరిపై ఎవరు? ఎవరికోసం ఎవరు?

KTR-copying-from-KCR
తెలుగుదేశాన్ని దాదాపు ముగించి కాంగ్రెస్‌పై పడిన తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ హఠాత్తుగా తీసుకొచ్చిన కుట్ర సిద్ధాంతం వెనక ఫిరాయింపులను సమర్థించుకోవాలనే తాపత్రయం వుంది. దీనికైతే ఎలాటి ఆధారాలు చూపనవసరం లేదు. వివరాలు వుండనవసరం లేదు. మెజార్టి వున్న తమను అందులో మూడో వంతు సంఖ్య కూడా లేని పార్టీలు, కేంద్రంలోని మరోపార్టీ కలసి ఎలా కుట్ర చేస్తాయన్నది పెద్ద ప్రశ్న. దానిగురించి చిన్నపార్టీ అయిన మజ్లిస్‌ నాయకుడు డిసిగేటెడ్‌ చీప్‌ మినిస్టర్‌కు చెప్పవలసినంత అగత్యం ఏమిటి? ఆయన కాపాడతానని భరోసా ఇవ్వడమేమిటి? దానిపైనే ఆధారపడటమేమిటి? అంత పెద్ద విషయం తెలిశాక రాష్ట్రాన్ని అధికారాన్ని కూడా సాధించిన ఉద్యమ నేత ఎందుకు మౌనంగా వుండిపోయారు? ఉద్యమ శ్రేణులకు పిలుపునిచ్చి ఎందుకు రంగంలోకి తేలేదు? తన పార్టీ ఎంఎల్‌ఎలను ఎందుకు విశ్వాసంలోకి తీసుకోలేదు?ఫిరాయింపుల ప్రవాహం దానికి విరుగుడు అనుకున్నారా? అనుకున్నా ఏడాది తర్వాత ఉధృతం చేశారా? ఈ మూడు పార్టీలకూ వ్యతిరేకులైన ఇతరుల సహాయం ఎందుకు కోరలేదు? ఇప్పటికైనా ఆ కుట్ర వివరాలు బయిటపెట్టవలసిన బాధ్యత లేదా? బహిరంగంగానే చేసిన ప్రకటనలూ వ్యాఖ్యలూ కుట్రలవుతాయా? కుట్రను వమ్ము చేయాలంటూ ఎవరెవరినో తెచ్చి పార్టీని నింపేయడం అంతకుముందు అగ్ర శ్రేణిల్లో వున్నవారిని దెబ్బతీసే కుట్ర అనుకోకూడదా? ఇంతకూ కుట్ర ముగిసిందా? కొనసాగుతున్నదా? ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడు కుట్ర అనడంలోనూ ఏదైనా కుట్ర వుందా? ఢిల్లీలోనూ జరిగిందంటున్న కుట్రలో సోనియా గాంధీకి నరేంద్ర మోడీకి కూడా పాత్ర వుందా? మొత్తంపైన ఇన్ని ఫిరాయింపుల తర్వాత ఇప్పటికైనా ప్రజలకు ఏదో ఒక సంజాయిషీ ఇవ్వకతప్పని పరిస్థితి రావడం సంతోషమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *