కైరానా అసత్య ప్రచారంలో బిజెపి

_75c33bea-31d7-11e6-b762-306eb096a216
ఉత్తరప్రదేశ్‌లో ఎలాగైనా గెలిచి కేంద్రంలో మరోసారి అధికారంలోకి రావాలనుకున్న బిజెపి ఆదిలోనే అసత్యాలను ఆధారం చేసుకుందా? కైరానా పట్టణం నుంచి హిందూ కుటుంబాలు వలస వెళ్లిపోయాయని ఆ పార్టీ జాతీయ సమావేశం సాక్షిగా మొదలైన ప్రచారం చూస్తే అలాగే అనిపిస్తుంది. మొత్తం 346 హిందూ కుటుంబాలు ముస్లిం మాఫియా దాడుల కారణంగా భయంతో వెళ్లిపోయాయని స్థానిక బిజెపి ఎంపీ హుకుం సింగ్‌ ఒక ప్రకటన చేశారు. ఈయన మాజీ కేంద్రమంత్రి, ముజఫర్‌నగర్‌ మతకలహాల కేసులో నిందితుడు కూడా. ఈ ఎంపీ విడుదల చేసిన 346 కుటుంబాల జాబితాపై చర్యలు తీసుకోవల్సిందిగా జాతీయ మానవహక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్సీ) రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు కూడా పంపింది. ఇవన్నీ అసత్య ప్రచారాలని ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ కొట్టిపడేశారు. అంతేకాక ఈ జాబితాలోని పేర్లపై క్షేత్రస్థాయిలో పరిశోధించవల్సిందిగా జర్నలిస్టులను కోరారు.
ఆయన చెప్పినందుకు కాకున్న నిజానిజాలు తెలుసుకోవడానికి ప్రముఖ పత్రికలు జరిపిన పరిశీలన మొదటి దశలోనే బిజెపి ఆరోపణలన్నీ అసత్యాలని తేలిపోయింది. హిందూ, హిందూస్తాన్‌ టైమ్స్‌, టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాలతో సహా అన్ని పత్రికలు అసలు వివరాలు ప్రకటించాయి. ఉదాహరణకు హుకుం సింగ్‌ ఇచ్చిన జాబితాలో ప్రమోద్‌ జైన్‌ కుటుంబం మొత్తం వలస వెళ్లిపోయింది. కానీ ఆయన కైరానాలో ఉంటున్నాడు. సోను కూడా బలవంతాన పంపివేయబడినట్లు సింగ్‌ చెప్పింది అసత్యమే. అతను అక్కడే ఉంటున్నాడు. నిజానికి బిజెపి కార్యకర్తల్లోనూ కొంతమంది ఈ ప్రకటనను తప్పుపట్టారు. పనులు వెతుక్కుంటూ 5,10 సంవత్సరాల కిందట చాలా కుటుంబాలు వెళ్లిపోయాయి తప్ప భయంతో కాదని పోలీసులు చెబుతున్నారు. ఈ జాబితాలో 15 మంది లాయర్లు కూడా ఉండగా అందరు నిక్షేపంగా ప్రాక్టీస్‌ చేసుకుంటున్నారు.
ముఖీమ్‌ కాలా అనే ముస్లిం ముఠా నాయకుడు కొంత కాలం కిందట హిందూ వ్యాపారవేత్త సోదరుడిని హత్య చేశాడు. తర్వాత తనను గత ఏడాది అక్టోబర్‌లో అరెస్టు చేశారు. నిజానికి అతను ముగ్గురు హిందువులను, 11 మంది ముస్లింలను కూడా హత్య చేసిన కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు. కనుక అతని నేరాలకు, వలసలకు సంబంధం లేదు. ఇప్పటికీ 350 హిందూ కుటుంబాలు అక్కడి ముఖంకాలా అనే చోట నివాసం ఉంటున్నాయి. మొత్తం లక్ష జనాభ గల కైరానా పట్టణం నుంచి పనుల కోసం అదికూడా అధిక కూలీ రేటు లభించే చోట్లకు శ్రామికులు వలస వెళ్లారని మాత్రమే అసలు వాస్తవం.
ప్రజలను మత కోణంలో రెచ్చగొట్టడం కోసం అసత్యాలు వ్యాపింపజేయడం సంఘపరివార్‌కు వెన్నతో పెట్టిన విద్య. బిజెపి అగ్రనేత ఎల్‌కే.అద్వానీ కాశ్మీర్‌లో 100 మసీదులు కూల్చివేశారని చెప్పిన మాట నిజం కాదని పరిశోధనలో తేలింది. 1990 అయోధ్య మొదటి కరసేవలో చనిపోయినట్లుగా ప్రచారం చేసిన అనేక మంది సజీవులేనని ఫ్రంట్‌లైన్‌ పత్రిక ప్రత్యక్షంగా నిరూపించింది. ఇప్పుడు యూపీ ఎన్నికల కోసం ముజఫర్‌నగర్‌, దాద్రి సంఘటనలను తప్పుగా చూపడమే కాక కైరానా గురించి పూర్తి అవాస్తవాలు కూడా ప్రచారంలో పెట్టడం బాధ్యతారహితం. అందులోనూ ప్రధాని, పార్టీ జాతీయ అధ్యక్షుడు పాల్గొన్న సమావేశంతోనే ఇది మొదలు కావడం ఇంకా విడ్డూరం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *