సాఫ్ట్‌వేర్‌ మళ్లీ హార్డ్‌?

 

5555

 

 

 

పేరుపొందిన కంపెనీలతో చర్చలు ప్రారంభోత్సవాలు,సెల్ఫీలు ఇదంతా ఒక పెద్ద ప్రచార ప్రహసనంలాగా మారిపోయిన పరిస్థితి. గతంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు తెలంగాణ ఐటీ మంత్రి కెటిఆర్‌ ఈ విద్యలో ఆరితేరారు. అయితే అసలు వాస్తవం ఏమంటే దేశంలోనూ, ప్రపంచంలోనూ కూడా సాఫ్ట్‌వేర్‌ కంపెనీల ఉద్యోగాలు అనిశ్చితిలో పడ్డాయి. ప్రసిద్ధమైన ప్లిఫ్‌కార్ట్‌, ఎల్‌ అండ్‌ టి, ఇన్ఫోసిస్‌ వంటివి క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ చేసుకున్న వేలాది మందికి టికానా లేకుండా పోయింది. 16 ఐఐటీ కళాశాలల్లో తమ క్యాంపస్‌లలో రిక్రూట్‌మెంట్‌లు చేయడానికి వీల్లేదని 6 స్టార్టప్‌లను నిషేధించాయి. వ్యాపార పునర్‌వ్యవస్థీకరణ కారణంగా అనుకున్నట్లు రిక్రూట్‌ చేసుకోలేకపోతున్నామని కంపెనీలు ఇస్తున్న వివరణ వాస్తవాల తీవ్రతను కప్పిపుచ్చుతున్నవి. నెలలు తరబడి నియామకాల కోసం ఎదురుచూసిన అభ్యర్థులు ఈ పరిణామంతో తీవ్ర ఆశాభంగం చెందుతున్నారు. అసలు ప్రపంచ వ్యాప్తంగానే ఈ కంపెనీలలో నియామకాల కన్నా కాంట్రాక్ట్‌ పద్దతి మెరుగని నిర్ణయానికి రావడంతో గతంలో వలే నిశ్చింతగా ఉండే పరిస్థితి మారి పోతున్నట్లు చెబుతున్నారు. అమెరికాలో ట్రంప్‌ లాంటి వారి దూకుడు మరింత ఆందోళన పెంచుతున్నది.
15వేల కోట్ల డాలర్ల విలువైన మన అవుట్‌ సోర్సింగ్‌ రంగానికి నాయకత్వం వహిస్తున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టిసిఎస్‌), ఇన్ఫోసిస్‌ లిమిటెడ్‌, విప్రో లిమిటెడ్‌లు 2011తో పోల్చితే ఇప్పుడు ఉద్యోగులను తక్కువగానే తీసుకుంటున్నాయి. అయినా సరే నియామకాలు పెంచటం కంటే కాంట్రాక్ట్‌ రూట్‌ సేఫ్‌గా భావిస్తున్నాయి. గత ఆరేళ్ల కాలంలో చూస్తే విప్రోలో పుల్‌టైం ఉద్యోగుల కన్నా కాంట్రాక్ట్‌ ఉద్యోగులు అధికంగా ఉంటున్నారు. టిసిఎస్‌, ఇన్ఫోసిస్‌లను చూసినా కాంట్రాక్ట్‌ కార్మికుల వాటా ఎక్కువగా ఉంటున్నది. ఆదాయాలు సరిగ్గా లేకపోవడం వల్లే ఇలా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మొదట్లో రిక్రూట్‌ చేసుకున్నాక అనుకున్న ఆర్డర్లు రాకపోతే బెంచ్‌లో ఉండే ఉద్యోగులకు అధిక మొత్తాలు ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పటికే 15శాతం పైగా ఉద్యోగులు ఖాళీగా ఉంటున్నారు. మార్చి31 న ఇండియన్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌కు ఇచ్చిన సమాచారంలో విప్రో తన దగ్గర లక్షా 72వేల 912 మంది పనిచేస్తున్నట్లు తెలిపింది. అదే సంస్థ అమెరికా సెక్యూరిటీస్‌ ఎక్సెంజ్‌ కమిషన్‌కు ఇచ్చిన నివేదికలో తన దగ్గర లక్షా 50 వేల మంది ఉద్యోగులు ఉన్నట్లు పేర్కొంది. 20 వేల మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులు గనుక తగ్గించి చూపామని వివరణ ఇచ్చింది. 2010లో ఈ సంఖ్య 70 మాత్రమే! కొత్త తరహా నైపుణ్యాల కోసం తాము కాంట్రాక్ట్‌ ఉద్యోగులపై ఆధారపడుతున్నామని కంపెనీలు సమర్ధించుకుంటున్నాయి కానీ, వాస్తవానికి ఈ రంగంలో ఉద్యోగాల సంఖ్య భద్రత కూడా తగ్గుతున్నాయని, స్తంభించి పోతున్నాయని ఈ వివరాలు స్పష్టం చేస్తున్నాయి. కనుక హైప్‌ కూడా తగ్గించడం మంచిది. లేకపోతే ఆశపడిన యువతకు నిరాశ మిగులుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *