ముద్రగడ దీక్ష-శ్రుతిమించిన ఆంక్షలు- కులరాజకీయాలు

Mudragada
ముద్రగడ పద్మనాభం దీక్ష విషయంలో ప్రభుత్వం పోలీసులు శ్రుతిమించి వ్యవహరించడం పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తున్నది. పురుగుమందుతో తలుపులు బిగించుకున్నారు గనక అరెస్టు చేశామనడాన్ని అర్థం చేసుకోవచ్చు. కాని ఆస్పత్రిని అభేద్య దుర్గంగా మార్చేసి మీడియాను, రాజకీయ నేతలనూ ఆఖరుకు సామాన్య ప్రజలను సహితం అతిగా ఆంక్షలకు గురిచేయడం అనుచితమని అందరూ భావిస్తున్నారు. దీనివల్ల లోపల ఏం జరుగుతుందనే సందేహాలు కూడా పెరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఆందోళనకరమైన విడియో క్లిప్లింగులు కూడా ప్రచారంలో వున్నాయి. ఏది ఏవైనా కాపుల మద్దతు పోగొట్టుకోకుండా చూడాలన్న చంద్రబాబు ప్రభుత్వం మొదట్లో ఆచితూచి వ్యవహరించినా ఈ దఫా మాత్రం అత్యంత కఠినంగా ముగింపు పలకాలని నిర్ణయించుకున్నట్టు కనిపిస్తుంది. ఈ క్రమంలో సామాజిక నేపథ్యాన్ని రెండు కులాల సంకుల సమరాన్ని కూడా గమనంలో వుంచుకోవాలి. ప్రజాస్వామ్య పద్ధతులను కూడా గౌరవించాలే తప్ప ఏకపక్షంగా అనుకున్నట్టు చేసుకుపోతామనడం అసహనాన్ని అశాంతిని పెంచుతుంది. ముద్రగడ వార్తలు అతిగా చూపిస్తున్నారనే నెపం మీదనే సాక్షి ఛానల్‌ప్రసారలు నిలిపివేశారని భావిస్తున్నారు. ఎన్‌టివికి సంబంధించి కూడా కొంతవరకూ ఆ అభిప్రాయం వ్యక్తమవుతున్నది. రాజమండ్రిలో ఆయనను వుంచిన ఆస్పత్రిదగ్గర మామూలు రోగులు సందర్భకులు కూడా నానా అగచాట్టు పడవలసి వస్తున్నది. ప్రభుత్వం ఇప్పటికైనా , సానుకూలంగా వ్యవహరించి ఆయన దీక్ష విరమింపచేయడం తక్షణం జరగాల్సిన పని.అరెస్టులకు సంబంధించి కూడా గోప్యత లేకుండా కనీస వివరాలు వెల్లడిస్తే నిజానిజాలు తెలుస్తాయి. ముద్రగడకు గతంలో ఇచ్చిన హామీల అమలు, అవరోదాలు వంటి అంశాలపై వివరాలు కూడా తెలియజేస్తే ప్రజలు ఒక అంచనాకు రాగలుగుతారు. ఈ దశలో ఆయనపై వ్యక్తిగత దాడులు విరమించాలి.
మరోవైపున చిరంజీవి,దాసరి, పళ్లంరాజు, బొత్స, అంబటి రాంబాబు,రామచంద్రయ్య తదితరులందరూ hqdefaultఒక్కతాటిమీదకు రావడం ఇటీవలి కాలంలో చూడని పరిణామం. అంటే ఇటు వైపున కూడా కుల సమీకరణ తీవ్రంగానే వుంది. గ్లామర్‌ ముద్రను కూడా దాటి తన సామాజిక బృందం తరపున ముందుకు వచ్చేందుకు మెగాస్టార్‌ సిద్ధమైపోవడంలో చాలా సంకేతాలున్నాయి. కాంగ్రెస్‌ వైసీపీ నేతలు ఒకచోట కనిపించడం కూడా ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారి.ఇది ముందు ముందు రాజకీయ సామాజిక సమీకరణాలను ప్రభావితం చేసే అంశం.ఇప్పటివరకూ మాట్లాడని పవన్‌ కళ్యాన్‌ రేపు ఏ వైఖరి తీసుకుంటారు, చంద్రబాబు తరపున మాట్లాడుతున్న ఆ వర్గం నేతలు మంత్రులు రేపు ఎలా వ్యవహరిస్తారు ఇవన్నీ ముందుముందు తెలుస్తాయి. ఈ సమయంలో చాలామంది రంగా హత్యను ప్రస్తావించారు. ఏది ఏమైనా ఆ రోజులు తిరిగిరాకుండా అటు ప్రభుత్వం ఇటు ఆందోళన కారులు కూడా అన్ని విధాల కృషి చేయాలి. ప్రభుత్వం తాను ఇచ్చిన హామీని అమలుచేయడం, ఆందోళన కారులు కూడా పట్టువిడుపులతో వ్యవహరించడం ముందు జరగాలి. రాజకీయ అజెండాలతో సామాజిక వైరాలతో పరిస్థితిని దిగజారనివ్వడం సరికాదు. అన్నిటికన్నా ముఖ్యం ముడ్రగడను కాపాడ్డం. తర్వాత ప్రశాంతతను పునరుద్ధరించడం. ఈ క్రమంలో కుదిరే అవగాహనను త్వరితంగా నికరంగా అమలు చేయడం జరగాలి. ఈ లోగా పోలీసులు కూడా సంయమనం పాటించేట్టు పాలకులు నియంత్రించాలి. వ్యక్తిగత దూషణలు, దాడులూ దౌర్జన్యాలు జరక్కుండా అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.ఈ పరిణామాలు ఎలాటి సమీకరణకు దారి తీస్తాయి ఎవరికి కలిగే లాభనష్టాలు ఎలా వుంటాయి అన్నది ఇప్పుడు ప్రదానం కాకూడదు. అందుకు చాలా వ్యవధి వుంది. ఇతర రాష్ట్రాల్లో కూడా రిజర్వేషన్‌పై ఉద్యమాల అనుభవాలను కూడా ఇరుపక్షాలు ఆకళింపు చేసుకుని అడుగు వేయాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *