ఏకపక్ష పోకడలూ, హానికర వ్యూహాలు!
అనేక సమస్యల మధ్య రెండేళ్లు పూర్తిచేసుకున్న విభజితాంధ్ర ప్రదేశ్‌లో రాజకీయ సామాజిక విభజనలనే ప్రధానంగా చూస్తున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. అన్ని రాజకీయ పక్షాలనూ సామాజిక తరగతులనూ కలుపుకొని ప్రజానుకూల పరిష్కారాలు కనుగొనవలసిన సందర్భమిది. కాని తెలుగుదేశం ప్రభుత్వం స్వీయ రాజకీయ కోణం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైటెక్ గ్లోబల్ విధానాలచుట్టూ పరిభ్రమించడం వల్ల అనిశ్చితి అస్పష్గత తాండవిస్తున్నాయి. టిడిపి బిజెపి వైసీపీల మధ్య మూడు ముక్కలాటగా మారిన రాజకీయ క్రీడలో రాష్ట్రానికి సంబంధించిన విస్త్ణ్రత అంశాలు వెనక్కు పోతున్నాయి.ప్రజల నిజమైన సమస్యలపై కదలిక తీసుకొస్తున్న కమ్యూనిస్టులు కార్మిక ప్రజా సంఘాలపై అసహనం అప్రజాస్వామిక దాడి పెరుగుతున్నాయి. సమస్యలపై మాట్లాడుతూనే వివాదాలకు అవకాశమిస్తున్న వైసీపీ వైఖరి, దాని అధినేత జగన్ ధోరణి భాషణలు పాలకపక్షానికి అందివచ్చిన అస్త్రాలవుతున్నాయి. ఇటీవల చెప్పులు చీపుర్ల పేరిట వారం రోజుల పాటు సాగిన పోటాపోటీ ప్రహసనం విషయాలను దారితప్పించే ఎత్తుగడలకు మంచి ఉదాహరణ.మరోవైపున రాష్ట్రానికి రాజ్యాంగబద్దంగా హామీనిచ్చిన ప్రత్కేక హౌదాను,వూరించిన ప్యాకేజీని కూడా నిరాకరించిన కేంద్ర బిజెపి రెండేళ్ల యాత్ర పేరిట మరోసారి తామే ఉద్ధరిస్తున్నట్టు వూదరగొడుతున్నది. టిడిపి బిజెపి దాగుడుమూతలలో ఎపి ప్రయోజనాలు అవసరాలు నలిగిపోతున్నాయి.
అమరావతి.. అస్పష్టత..
ఈ రాజకీయ విన్యాసాలు చాలనట్టు ఈ వారం మరింత ఆందోళనకరమైన పరిణామాలు సంభవించాయి. అమరావతిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణంపై సంపూర్ణచిత్రం రాకుండానే ఉద్యోగుల తరలింపుపై హడావుడి వల్ల లేనిపోని వివాదం తలెత్తింది. వారి సహేతుక సందేహాలను తీర్చి సానుకూల వాతావరణం ఏర్పర్చేబదులు ప్రభుత్వం వచ్చి తీరాల్సిందేనని హుకుం చేసింది. అరకొర కార్యాలయాలు, అద్దె మోత నివాసాలతో ఎలాగనే సంకోచానికి తోడు పిల్లల స్థానికతకు సంబంధించిన సమస్య కూడా వారిని భయపెట్టింది.హైదరాబాదునుంచి తరలిపోయే ఆఖరిదశలో ఉద్యోగులు ధర్నాలు చేయవలసిన స్థితి ఏర్పడింది. ఆఖరుకు అమరావతి వెళ్లి చంద్రబాబుకే మొరపెట్టుకుంటే ఆయన ఆదేశాన్ని పునరుద్ఘాటించడమే గాక ఒకింత ఆగ్రహావేశాలు కూడా వ్యక్తం చేశారు. బిజెపి నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి దగ్గరకు వెళ్లి సమస్య చెప్పుకోవడం, తమ ఆందోళనలు ముఖ్యమంత్రి ముందు వెళ్లబోసుకోవడం అపరాధమేమీ కాదు. దానికి అంతగా మండిపడాల్సిన పనీ లేదు. కాని తన నిర్ణయాలకు ఎవరో అడ్డు పడుతున్నారన్న అభద్రత, అపోహ ఆయనను వెన్నాడుతున్నాయి. అడ్డంకులు తొలగించుకోకుండా నిర్ణయాలు చేస్తున్నది తానేనని చంద్రబాబు ముందు గ్రహించడం అవసరం. అంతిమ నిర్ణయం తీసుకోగల అధికారం ఆ బాధ్యత తనపై వున్నప్పుడు అన్ని కోణాలూ సావధానంగా ఆలకించాలి తప్ప అసహనంతో ఉపయోగమేమిటి? ఉద్యోగులపై ఆగ్రహమెందుకు? ఇప్పుడు స్థానికతకు సంబందించి రాష్ట్రపతి ఉత్తర్వు వచ్చినందుకు ఘన విజయం సాధించినట్టు చెబుతున్నారు గాని ఈ సమస్యను ఇంతకాలం పేరబెట్టవలసిన అవసరం వుందా? ఇప్పటికైనా అన్ని ప్రశ్లలకు సమాధానం లభించిందా? వివిధ చోట్ల దూరాభారాలలో ఏర్పాటు చేయాలనుకుంటున్న కార్యాలయ నివాస భవనాల సమస్య, మిగిలే వుంది. అసలు జి+4 కడతామని ప్రకటించి తర్వాత వెనక్కు తగ్గడంలో ప్రభుత్వ అసహాయత, సంధిగ్ధం కనిపిస్తొన్నాయి. ఒక్క భవనం కట్టడానికే ఇంతగా ముడిబిగించిన దేశ విదేశ కార్పొరేట్ సంస్థలు రేపు మొత్తం రాజధానిని కట్టాలంటే మరెంత ఇబ్బంది పెడతాయి? వాటి నిరాకరణ కారణంగా ఆలోచన మార్చుకున్న ప్రభుత్వం ఎల్ అండ్ టి కన్నా ఎంతో పెద్దవైన సంస్థల ముందు మరెంతగా తలవంచుతుంది? అప్పుడు భూములిచ్చిన రైతుల పరిస్థితి ఏమవుతుంది? సచివాలయ నిర్మాణంలో ఒక ప్రధాన సమస్య హద్కో ఇస్తానన్న రుణం ఇవ్వకపోవడం. దాని తిరస్కరణకు కారణం నిర్మాణం జరుగుతున్న భూమి సర్కారుది కాకపోవడం..రేపు ఆధునిక అమరావతి నిర్మాణంలో అడుగడుగునా ఇదే సమస్య అనివార్యంగా వెన్నాడుతుంది. ఆ భూమి రైతులదీ కాదు, ప్రభుత్వానిదీ కాదు. దానిపై నిర్ణయంలో వారికి భాగం వుండదు. కేంద్రం మరింత సహకరించే అవకాశం లేదని తేల్చిపారేసింది. కనుక విదేశీ సంస్థలపై ఆధారపడకతప్పదని రాష్ట్ర ప్రభుత్వం రేపు అధికారికంగానే ప్రతిపాదిస్తుంది. అప్పుడు ఏలిన వారి బినామీలే లేదా ఆశ్రిత కంపెనీలు విదేశీ సంస్థల తరపున(పేరిట) ఇక్కడ నిర్మాణాలు చేస్తాయి.వైఎస్ హయాంలో విశాకపట్టణంలో సింగపూర్ సిటీ పరిస్థితి ఏమిటో ఒక మాజీ మంత్రి ఇటీవల నాకు గుర్తు చేశారు. సింగపూర్‌కు చెందిన ఏవో ప్రైవేటు సంస్థలు ముందుకు వస్తే ఆ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది గనక దాన్నే అధికారిక భాగస్వామ్యంగా చూపించి వైఎస్ ప్రభుత్వం 300 ఎకరాలు మంజూరు చేసింది. ఇప్పుడు నూతన రాజధాని యావత్తూ అలాటి ఫార్ములాలే అమలవుతాయన్న మాట. కాకపోతే అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో వుండి దాన్ని వ్యతిరేకించారు, ఇప్పుడు ముందుండి నడిపిస్తున్నారు. బాక్సయిట్ తవ్వకం కథే ఇక్కడా. రైతులకు పరిహార పునరావాసాలూ స్థానికులకు ఉపాధి అవకాశాలు లేకుండా కేవలం విదేశీ సంస్థల రోడ్‌మ్యాప్ ప్రకారం అమరావతిలో నెట్టుకుపోవడం సాధ్యమయ్యేది కాదు.
సమస్యల వలయం..
కొత్త రాష్ట్రంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రి రాజధానిపైనే కేంద్రీకరించారు. దానికోసమే తిరిగారు. విదేశీ భ్రమణం చేశారు. అక్కడే ఇంతటి అయోమయం వుందంటే ఇతర రంగాల గురించి చెప్పేదేముంటుంది? అ నుంచి మొదలు పెట్టడం వల్ల అభివృద్ది రేటు పదిశాతం పైన వున్నట్టు కనిపించవచ్చు. పన్ను వసూళ్లు కూడా 2015-16లో 16 శాతంపెరిగి వుండొచ్చు. కాని ప్రభుత్వ వాగ్దానాల అమలు మాత్రం అరకొరగానే వుంది. ో కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు నెలల తరబడి జీతాలు ఇవ్వడంలేదు. దీనిపై సిపిఎం కార్యదర్శి మధు వివరంగా లేఖ రాశారు కూడా. రైతు రుణ మాఫీకి ఇప్పటికి 7వేల కోట్ల పైచిలుకు మాత్రమే విడుదల చేశారు. 8 లక్షలు దాటిన అధికారిక నిరుద్యోగులు అందుకు అనేక రెట్టు అనధికార లెక్కలు వున్నా నియామకాలు లేవు. రకరకాల పరిశ్రమలు మూతపడిన ఫలితంగా 40 వేలమందికి పైగా కార్మికులూ, రోడ్డున పడిన పరిస్థితి.ఇక కరువు సహాయంలో వైఫల్యంపై సుప్రీం కోర్టు అక్షింతలు వేయాల్సి వచ్చింది. ఆస్పత్రులలో అఘాయిత్యాలు పెద్ద సంచలనానికే కారణమైనాయి. ప్రైవేటు విద్యావ్యాపారులు రాష్ట్ర రాజకీయాలనే శాసిస్తుంటే ప్రభుత్వ విద్యా వైద్య రంగాలు కొడిగట్టిపోతున్నాయి. 24గంటల విద్యుత్ సరఫరా పేరిట భారీ భారాలు పొంచి వున్నాయి.ఆర్టీసీ నిర్వహణ మెరుగుపర్చే బదులు బస్టాండ్లను కూడా వినోద వాణిజ్య కేంద్రాలుగా మార్చేస్తున్నారు.కేంద్ర విధానం కూడా మారింది గనక రేపు దాని ఉనికికే ఎసరుపెట్టినా ఆశ్చర్యం లేదు. ఇంకా మహిళలు, విద్యార్థులు, అణగారిన తరగతుల సమస్యలపై కూడా విదిలింపులు తప్ప సమగ్ర చర్యలు లేవు.
కులాల కుంపట్లు
సామాజిక న్యాయ భావన, విద్యా ఉద్యోగ అవకాశాల పెంపుదల బదులు కులాల వారీ లెక్కలతో రాజకీయ వ్యూహాలు అమలు చేయడం వల్ల పరిస్థితి మరింత జఠిలమవుతున్నది. ఇప్పటికే రకరకాల కార్పొరేషన్లు , కులమత వారీ వాగ్ధానాలు కురుస్తున్నాయి. కాపుల సమస్యపై రకరకాల పిల్లిమొగ్గలు పరిస్థితిని వివాద గ్రస్తం చేశాయి. ముద్రగడ పద్మనాభం తొలి నిరాహార దీక్ష, విధ్వంసకాండ తర్వాత సంప్రదింపులు విరమణ చూశాం. మహానాడులోనూ దీనిపై విమర్శలు మంత్రుల దాడులూ ప్రభుత్వ వ్యూహాన్ని సూచించాయి.హఠాత్తుగా అరెస్టులు, మళ్లీ ఆయన దీక్ష, పోలీసుల ప్రవేశం, బందులు, ఆందోళనలు ఉద్రిక్తత పెంచాయి. అప్పటికి ఇప్పటికి మధ్యనున్న వ్యవధిలో ప్రభుత్వం ఉపశమన చర్యలు చేపట్టే బదులు రాజకీయ దాడులకే తెలుగుదేశం నాయకత్వం సిద్ధపడింది. గతంలోని భీకర అనుభవాలు విస్మరించి సరికొత్త ఘర్షణలకు ఆజ్యం పోసింది. ఈక్రమంలో రకరకాల రాజకీయ, సామాజిక శక్తులు యుక్తులు పనిచేస్తున్నాయి. (ఇది రాస్తున్నప్పటికి) ఇంకా అవి ఒక కొలిక్కి వచ్చిన దాఖలాలు లేవు.
సాక్షి నిలిపివేత
సంయమనంతో అందరిని కలుపుకొని విభజితరాష్ట్ర అవసరాలను సాధించుకోవడానికి బదులు టిడిపి × వైసిపి మధ్యలో బిజెపిల మధ్య నడుస్తున్న రాజకీయ విన్యాసం అంతుపట్టని వ్యవహారంగా మారిపోతున్నది. ముఖ్యమంత్రిపై ప్రతిపక్షనేత జగన్ అనుచిత భాష ఉపయోగించారంటూ కొన్నాళ్లు రభస నడిచింది. ఆయన కూడా కొద్దిపాటి సర్దుబాటుకు బదులు అదే తరహాలో మాట్లాడి చర్చ దారితప్పడానికి దోహదం చేశారు. ఈ ‘చెప్పు’ గొడవ సద్దుమనుగక ముందే తుని అరెస్టులు మొదలైనాయి. సరిగ్గా అప్పుడే సాక్షి పత్రిక, ఛానల్‌ను స్వాధీనం చేసుకుంటామని సీనియర్ మంత్రి యనమల రామకృష్ణుడు గట్టిగా ప్రకటించారు. జగన్‌పై కేసులు త్వరితంగా విచారణ జరిపి కోర్టుల తీర్పు వెలువడటం అవసరమే. ప్రభుత్వం అందుకు అదనంగా ఆధారాలు సమర్పించినా మంచిదే. కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాత్కాలిక కట్టడి (అటాచ్మెంట్)లో ఉన్న ఆస్తులు ప్రభుత్వానికి చెందుతాయన్నట్టు చెప్పడం చట్టబద్ధం కాదు. 2015 ప్రత్యేక కోర్టుల చట్టం ఇంకా అమల్లోకి రావాలి. ఆ కోర్టులు తీర్పు చెప్పాలి. దానికి ముందు ఉన్నత న్యాయస్థానాల్లో తమ తీర్పు వెలువరించి ఆస్తుల భవిష్యత్తును నిర్దేశించాలి. ఇదంతా పక్కనబెట్టి తమకు వ్యతిరేకంగా ఉంటున్నాయి గనుక తీసేసుకోవడం సాధ్యం కాదు. అయితే అనధికారికంగా ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో సాక్షి ప్రసారాలను నిలిపివేయించడం మాత్రం జరిగిపోతున్నది. తెలంగాణ ప్రభుత్వం రెండు ఛానళ్లను ఇలాగే చేసినప్పుడు విమర్శించిన తెలుగుదేశం ప్రభుత్వం అదే అప్రజాస్వామిక ధోరణికి పాల్పడడం అవాంఛనీయం. రాజకీయాలను, పరిపాలనను, చట్ట బద్ధతను, మీడియాను కలగాపులగం చేసి అన్నింటా తమ మాటే నెగ్గాలనుకోవడం అనుమతించరానిది.
(ప్రజాశక్తి 12,2016)


