అంబేద్కర్‌కు ఎసరు

భారత రాజ్యాంగ రూపకల్పనలో డాక్టర్ బిఆర్. అంబేద్కర్ పాత్ర ఒక మిథ్య అని ఏబివిపి మాజీ కార్యదర్శి, ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఆఫ్ ఆర్ట్స్ (ఐఎన్‌సిఓఎ) నూతన అధ్యక్షుడు రామ్ బహుదూర్ రారు చేసిన వ్యాఖ్య బిజెపి సంఘ పరివార్ నిజస్వరూపాన్ని బయటపెట్టింది. రాజ్యాంగ నిర్మాతగానూ దళిత విముక్తి స్ఫూర్తిగానూ అందరు గౌరవించే అంబేద్కర్‌కే ఎసరు పెట్టడం చరిత్రను అవమానించడమే. దళిత వర్గాలపై దాడి చేయడమే. ఐఎన్‌సిఓఎ పూర్వపు అధ్యక్షుడు కాంగ్రెస్ అనుకూలంగా ఉన్నారనే సాకుతో తొలగించి రారుని నియమించడంలో మోడీ ప్రభుత్వ ఉద్దేశ్యం కూడా తేలిపోయింది. డాక్టర్ బిఎన్ రావ్ వివిధ దేశాల రాజ్యాంగాల నుంచి సంగ్రహించి ఇచ్చిన భాగాలనే భాషమార్చి అంబేద్కర్ చలామణి చేశారని రారు నోరుపారేసుకున్నారు. 1935 బ్రిటీష్ కాలం నాటి భారత ప్రభుత్వ చట్టాన్ని మక్కికి మక్కిగా అనుసరించినట్లు ఆరోపిస్తున్నారు. ఇవన్నీ ప్రజల ఇంగిత జ్ఞానాన్ని అవమానించే ధోరణులు.
బిఎన్ రావ్ విషయ పరిజ్ఞానం, వివరాల సేకరణ అందరికి తెలుసు. అయితే ఆయన రాజ్యాంగ పరిషత్తు సభ్యుడు కాదు. కేవలం అధికార హోదాలోనే ఆ పని చేశారు. వాటిని రాజ్యాంగ సభకు సమర్పించి భిన్నభిప్రాయలను తీసుకుని తుది రూపం ఇచ్చి రాజ్యాంగ ముసాయిదా కమిటీనే దానికి ఛైర్మన్ అంబేద్కర్. అపారమైన ఆయన పరిజ్ఞానం కారణంగానే కాంగ్రెస్ పరిషత్‌లో స్థానం కల్పించింది. ఆయన ఎన్నికై వచ్చిన నియోజకవర్గం పాకిస్తాన్‌కు వెళ్లిపోగా మరోకొత్త చోటునుంచి గెలిపించి తీసుకున్నారు. న్యాయశాఖ మంత్రిగా కూడా అంబేద్కర్ అనేక వివరాలను అందించేందుకు కష్టపడ్డారు. చాలా సందర్భాల్లో రాజ్యాంగ సభ వేడెక్కిపోయినప్పుడు సద్దుబాటు చేసి అందరికి నచ్చే ప్రాతిపదిక ఏర్పరిచారు. ఫెడరలిజం, సామాజికన్యాయం, రిజర్వేషన్లు, భాషా సమస్య, లౌకికతత్వం, ప్రాథమిక హక్కులు వంటి విషయాల్లో మన రాజ్యాంగం చాలా ఉదాత్తంగా ఉందంటే ఈ కసరత్తే కారణం. మరే దేశంలోనూ లేని ఆదేశిక సూత్రాలు కూడా మన రాజ్యాంగం పొందుపర్చింది. సామ్యవాద భావన లేకపోయిన సామాజిక సమానత సూత్రం అంతర్లీనంగా ఉంటుంది. రాజ్యాంగాన్ని కాలానుగుణంగా సవరించుకునే పద్దతులు కూడా మిగతా దేశాలకన్నా మిన్నగా రూపొందించారు. ఈ మొత్తం ప్రక్రియలో అంబేద్కర్ పాత్ర పరమసత్యం. ఎంతమాత్రం మిథ్య కాదు. కొంతకాలం కిందట మోడీ ప్రభుత్వమే నవంబర్26న రాజ్యాంగ ఆమోద దినోత్సవం అంటూ హంగామా చేసింది. నిజానికి ఆ తేదీనాటికి ఇంకా బ్రిటీష్ వారి నుంచి పూర్తి తెగదెంపులు జరగలేదని గుర్తుపెట్టుకోవాలి. అయినా అప్పుడు అంబేద్కర్ స్మరణ చేసిన బిజెపి నేతలు ఇప్పుడు ప్లేటు మార్చటం హాస్యాస్పదం. భారత రాజ్యాంగం అంబేద్కర్ పాత్ర విడదీయరానిది. వాటికి రారు వంటి మిడిమిడి మేథావుల ముద్ర అవసరం లేదు. కాకపోతే ఆ పార్టీలో కరుడుగట్టుకుపోయిన అగ్రవర్ణ దురహాంకారానికి తిరోగమన భావజాలానికి ఈ మాటలు అద్దంపడుతాయి. హర్యానాలో దళితులను హతమార్చితే కుక్కలతో పోల్చిన రక్షణ సహాయ మంత్రి వికే.సింగ్ మాటలు కూడా గుర్తుకు వస్తాయి.