సుఖేందర్ పునరేకీకరణ..!

తెలంగాణలో తెలుగుదేశం పార్టీని దాదాపు నామమాత్రం చేసిన పాలకపక్షం టిఆర్‌ఎస్ ఇప్పుడు కాంగ్రెస్‌కు పెద్దఎత్తున ఎసరుపెట్టింది. గతంలోనూ కొంతమంది కాంగ్రెస్ నుంచి వెళ్లినా ఇప్పుడు వినిపిస్తున్న పేర్లు చేశాక ఆ పార్టీ నేతలకు ఆందోళన పట్టుకున్నది. తెలంగాణ ‘ఇచ్చిన’ పార్టీగా అధికారంలోకి రాలేకపోయామన్న దిగులు ఇన్నాళ్లు ఉండింది. ఇప్పుడు ఏకంగా ఉనికినే కోల్పోతే ఎలా అని జాతీయ నేతలు కూడా తలలుపట్టుకుంటున్నారు. నల్గొండ కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి నిష్క్రమణ జిల్లా రాజకీయాలను తలకిందులు చేస్తుందనే అంచనాలు ఉన్నాయి. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తనపై ఊహాగానాలను ఖండించిన అదే తుదిమాట అని అనుకోవడం లేదు. ఇక సుఖేందర్‌రెడ్డిని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆహ్వానించడం యధార్థం. ఆయన తెలుగుదేశం నుంచి వచ్చినప్పుడే కెసిఆర్ చాలా సానుకూలంగా మాట్లాడారు. అప్పుడే ఆహ్వానించారు కూడా. జైపాల్‌రెడ్డి మేనల్లుడైన సుఖేందర్‌రెడ్డి గత మూడుసార్లుగా గెలుస్తూ హ్యాట్రిక్ విజేత అయ్యాడు. ఇప్పుడాయన రాజీనామా చేసి రాష్ట్ర మంత్రి కావాలని కోరుకుంటున్నారు. అయినా ప్రస్తుతానికి ఎంపీగానే కొనసాగించవచ్చు. మాజీ ఎంపీ, తెలంగాణలో పెద్ద పారిశ్రామికవేత్త వివేక్, ఆయన సోదరుడు వినోద్ కూడా ఈ వరుసలోనే ఉన్నారు. గతంలో వివేక్ టిఆర్‌ఎస్‌లో చేరి బయటికి వచ్చారు. అప్పుడాయన పేరు ‘దళిత ముఖ్యమంత్రి’ పరిశీలనలో వినిపిస్తుండేది. ఆ అవకాశం లేదని తేలాకే వచ్చేశారని అంటారు. వి6 అధినేత అయిన వివేక్ మళ్లీ పాలకపక్షంలో చేరితే ఆ ప్రభావం అనేక రూపాల్లో ఉండొచ్చు. అసలు ఇంతమంది ఉద్దండులు వచ్చేస్తుంటే మా పరిస్థితి ఏమిటని ‘ఒరిజినల్’ టిఆర్‌ఎస్ నేతలు దిగులు పడుతున్నట్లు సమాచారం. మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి తనకు సంబంధించిన కథనాలను ఖండించారు కానీ ఆచరణలో ఏమయ్యేది చూడాల్సిందే!. మొత్తం మీద పునరేకీకరణ పేరుతో ‘ఏకైకీకరణ’ చేస్తున్న కెసిఆర్ దూకుడు ఇంకెన్ని ప్రవాహాలను లీనం చేసుకుంటుందో!.