అమెరికా ఉచ్చులో భారతదేశం?

obama-modi-1-pti-L

                              ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటన, పార్లమెంటులో ప్రసంగం గురించి తెలుగు పత్రికలో పరవశంగా ప్రచారం ఇచ్చాయి. ఇంగ్లీష్‌ పత్రికల్లో ప్రాముఖ్యత ఉన్నా ఈ పరవశం లేకపోవడం గమనించదగ్గది. హిందుస్తాన్‌ టైమ్స్‌ గతంలో మన్మోహన్‌ సింగ్‌ ప్రసంగాన్ని ఇప్పుడు మోడీ ప్రసంగాన్ని పోల్చి చూపింది. ఇద్దరు అమెరికాను ఆలింగనం చేసుకున్నారు. కానీ స్వరంలో తేడా ఉంది. మన్మోహన్‌సింగ్‌ వాస్తవికతలకు అనుగుణంగా పరివర్తన చేసుకోవాలన్న తరహాలో మాట్లాడారు. ఇందుకు భిన్నంగా మోడీ పూర్తిగా అమెరికా రాగం ఆలపించారు. ”గత అవరోధాలు” తొలగాయి. కొత్త లయ కుదిరింది అంటూ అమెరికా వైపున చేరుతున్న సంకేతాలు ఇచ్చారు. మాజీ ప్రధాని చైనా ప్రసక్తి తీసుకురాలేదు. కానీ మోడీ పరోక్షంగా చైనాకు వ్యతిరేకంగా అమెరికాను బలపర్చుతున్నట్లు సూచనలు వదిలారు. కొంచెం ఎక్కువ తక్కువలు ఉన్నా అప్పుడు కూడా అమెరికా ఎంపీలు చాలాసార్లు చప్పట్లు కొట్టారు. దౌత్య ప్రపంచంలో సర్వసాధారణమైన ఈ విషయాన్ని ఘనతగా చెప్పుకోవడం హాస్యాస్పదం. రక్షణ రంగంలో భారత్‌ అమెరికా వైపు మొగ్గిన విషయం మోడీ పర్యటనలో తేటతెల్లమైందని హిందూ సంపాదకీయంలో వ్యాఖ్యానించింది. ఇందుకే అమెరికా భారతదేశాన్ని తన ప్రధాన రక్షణ భాగస్వామిగా అభివర్ణించింది. భారతదేశ సౌభాగ్యం అమెరికాకు ప్రయోజనకరమని 2005లో మన్మోహన్‌ అన్నారు. 10 ఏళ్ల తరువాత ఇప్పుడు మోడీ బలమైన సౌభాగ్యవంతమైన భారత్‌ అమెరికాకు వ్యూహాత్మకంగా ప్రయోజనకారి అని జోడించడం దాని ప్రతిబింబమే. నిజంగా మోడీ ప్రభుత్వం అమెరికా వైపు అంతగా మలదల్చుకుంటే అప్పుడు పార్లమెంటులో స్పష్టంగా ప్రకటించాలని కూడా హిందూ సూచించింది. ఇటీవలనే అలీన విధానం మాదని చెప్పిన ప్రధాని మోడీ ఇంతటి కీలక మార్పు అమెరికా వైపు మొగ్గు ఎలా సమర్థించుకుంటారు.?

అమెరికా దోస్తీ గురించి మోడీ ఇంత మురిసిపోతుంటే ఆ దేశం మాత్రం తన సంప్రదాయిక నేస్తమైన పాకిస్తాన్‌ను బుజ్జగించే పనిలో పడింది. మోడీ ఢిల్లీలో దిగకముందే అమెరికా ఉన్నత ప్రతినిధివర్గం పాకిస్తాన్‌లో దిగింది. భారత్‌తో సాన్నిహిత్యం వల్ల మీకు నష్టమని చెప్పడం దీని ఉద్దేశ్యం. ఆసియా వ్యవహారాలకు సంబంధించిన కౌన్సిల్‌ బాధ్యుడు పీటర్‌ లోవి,రిచర్డ్‌ బర్లిన్‌లతో సహా పలువురు ఇందుకోసమే ఇస్లామాబాద్‌లో చర్చలు జరుపుతున్నారు. తాలిబాన్ల నాయకుడు మసూద్‌ను పాకిస్తాన్‌ భూభాగంలోకి చొరబడి అమెరికా ద్రోన్‌ దాడిలో చంపిన ఘటన తరువాత ఏదో దూరం పెరిగినట్లు ఇరుదేశాలు నటించాయి. అయితే అదంతా పైపైనే. ఇప్పుడు అమెరికా ప్రతినిధివర్గం పాకిస్తాన్‌కు అన్ని విధాల భరోసా, హామీలు ఇచ్చి మరీ వస్తుంది.
ఎన్‌ఎస్‌జీలో భారత్‌ ప్రవేశం వచ్చేసినట్టే మరో ప్రచారం నడుస్తున్నది. అయితే పాకిస్తాన్‌ సీనియర్‌ నాయకుడు సత్రాజ్‌ అజీజ్‌ తమను కాదని భారత్‌కు సభ్యత్వం ఇవ్వడాన్ని వివక్షగా చెబుతున్నారు. దానిపై అమెరికా స్పందించే, సహకరించే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. అంటే ఆ దేశం మనకేదో ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చిందన్న ప్రభుత్వ ప్రచారాలు ఉత్తివేనని అర్థం చేసుకోవాలి. చైనా మనకు ఆటంకం అయినట్లు పాకిస్తాన్‌ బలపర్చుతున్నట్లు చెబుతుంటే ఇక్కడ అమెరికా ప్రత్యక్షమవుతున్నది. ఎన్‌ఎస్‌జీ నియమాలు పాటించాలని చెప్పడం తప్ప చైనా మనకు వ్యతిరేకంగా మాట్లాడిందేమీ లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇంతకన్నా మనం చైనాతో నేరుగా మాట్లాడడం మంచిదని సూచిస్తున్నారు. దానికి బదులు అమెరికాతో చేరి చైనా వ్యతిరేక భాష మాట్లాడడం ఉభయులకు నష్టమని వివరిస్తున్నారు. అయితే మోడీ సర్కార్‌ ఇలాంటి హితబోధలు వినే స్థితిలో లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *