త్రివిక్రమ్ అ..ఆ.. లు
సినిమాలు పరాజయం పాలైతే విమర్శించడం సులభం. విజయం సాధించిన వాటిని ఏమైనా అంటే జీర్ణించికోవడం కష్టమే. సర్థార్ గబ్బర్‌సింగ్, బ్రహ్మోత్సవం దెబ్బతిన్నాయి కనుక చాలా విశ్లేషణలు, విసుర్లు. సరైనోడు ‘వూర మాస్’ అని చెప్పుకున్నాడు కనుక కలెక్షన్లు తెచ్చుకున్నాడు కనుక ఓకే. సక్సెస్ మీట్‌లో సమంత అన్నట్లు డబ్బులు, మెప్పు కూడా తెచ్చిన అ ఆ.. మాత్రం ఇలాంటి విమర్శలకు భిన్నంగా వచ్చిందా! చిత్రం విడుదలయ్యాక మీనాతో పోలిక రావడం త్రివిక్రమ్ అంగీకరించడం జరిగిపోయింది. అయితే చిత్రం చూసినప్పుడు ఆయన అన్న ప్రకారం యుద్దనపూడి సులోచనరాణి పేరు కలిపినట్లు కనిపించలేదు.
అత్తారింటికి దారేది, గుండమ్మకథకు మరోరూపమని అనుకున్నదే. మీనా పోలికలు పక్కనబెడితే అత్తారింటి లక్షణాలు కూడా అ ఆ..లో అన్ని విధాల అగుపించాయి. అందులో అత్తకు అన్యాయం జరిగితే.. ఇందులో అత్తే అన్యాయం చేయడం. దానికి సంబంధించిన కథనాలు, దృశ్యాలు పదేపదే పలురకాలుగా చూపించడం చివర్లో హీరో నీతి బోధ. అన్నీ అదే కోవ. అత్త పాత్ర , వేసిన నదియా కూడా సేమ్ టూ సేమ్. ఆమె లేనప్పుడు భర్త నరేశ్ కూతురు సమంతను మేనత్తల గ్రామానికి పంపడం. మళ్లీ ‘దేవదేవం’ తరహాలో పాట, అక్కడ పల్లెటూరి ఇంట్లో కంగాలీ , చనిపోయిన దగ్గర ఏడుపుల్లోనూ ఎగతాళి, ఎబ్బెట్టయిన పెళ్లి చూపుల సన్నివేశం.అంతా హడావుడిగా స్పీడ్ కామెడీ సూత్రం ప్రకారం నడిచిపోతుంది.
మీనాలో ప్రధానమైన అంశం తల్లి పోసెసీవ్ స్వభావం అన్ని తను చెప్పినట్లు జరగాలనుకోవడం దాన్ని కాదనలేని తండ్రి. ఘర్షణ పడే కూతురు. ఆత్మాభిమానం గల ఆమె బావ. వీరందరి మధ్య మానవ స్వభావ చిత్రణ. అ ఆ..లో అవన్నీ ఉన్నాయంటే ఉన్నాయి. అంతకన్నా భిన్నంగా చూపించాలనే ప్రయత్నం. దీనివల్ల ఏ పాత్ర బలమైన ముద్రవేసే అవకాశం లేనట్టయింది. సమంతపై ఆద్యంతం దృష్టిపెట్టి హీరో నితిన్‌ను కట్టడి చేయడం దర్శకుడు చేసిన అతి మంచిపని లేకపోతే చిత్రం మరోలా వచ్చేది.
ఈ రోజుల్లో పూర్తి కామెడీ లేకుండా విజయం వుండదు. అయితే సన్నివేశాలు బలమైన పాత్రలు యువ ప్రేక్షకులు కోరుకోరని కాదు. ి మంచి విషయాలు బాగా చూపిస్తే ఈ ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారు. అంత ఓపిక, అల్లిక లేకపోవడం వల్లనే కలగాపులగపు కథలతో సరిపెట్టడం. త్రివిక్రమ్ నాకు ఇష్టమైన కమర్షియల్ దర్శకుడు. నువ్వేనువ్వే తొలిప్రయత్నం అయినా చాలా సంతృప్తికరమైన చిత్రం. అతడు హాలీవుడ్ నమూనాను అనుసరించే బిగువైన తెలుగు బొమ్మ. నేనెప్పుడూ చూసే సినిమాలో జాబితాలో అది వుంటుంది. ముఖ్యంగా సంభాషణలు. ఖలేజా, జల్సా డబ్బులు తెచ్చిన సాధారణ సినిమాలే. జులాయి కేవలం హీరో చలాకీతనం ఆధారంగా విజయం సాధించిన ఒక అసహజ కథ. మళ్లీ అత్తారింటికి దారేది మామూలు విషయాన్నే పట్టుగా చెప్పిన ఘనవిజయం. ఇది కూడా నాకిష్టమే. సన్నాఫ్ సత్యమూర్తి రెండో సగం అతుకులమయం. త్రివిక్రమ్ శ్రీనివాస్‌లాంటి ప్రతిభావంతుడైనా దర్శకుడి పూర్తి శక్తిని ప్రతిబింబించేది కాదు. అలా చూస్తే అ ఆ.. ఇప్పుడున్న చిత్రాల మధ్య వసూళ్లు తెచ్చి ఉండొచ్చు గానీ బలమైన ముద్ర వేసిందని చెప్పడం కష్టం. అయితే యాభై కోట్ల వసూళ్ల యాడ్ పడింది గనక ముద్ర పెద్ద విషయమేం కాదు.
కొసమెరుపు: ఇప్పటివరకు మన సినిమాల్లో ఇతరుల కోసం త్యాగం చేయడం గొప్ప విలువగా చూపించారు. ”అవతలివారిని గెలిపించడం కోసం నీతో ఉన్నవారిని ఓడించడం సరికాదు”. అంటూ హీరో తల్లి ఇచ్చే సందేశం ఇందుకు భిన్నమైన కోణం.