ఇప్పుడు సినిమాలపై వేటు

 

Udta_Punjab

గతంలో రచయితల భావస్వేచ్ఛపై దాడి చేసిన మోడీ ప్రభుత్వం ఇప్పుడు సినిమా రంగాన్ని శాసించడం మొదలుపెట్టింది. దేశానికే ఆందోళన కలిగిస్తున్న పంజాబ్‌ మాదకద్రవ్యాల (డ్రగ్స్‌) సమస్యపై సినిమా తీయటం తప్పంటున్నారు. ఉడ్‌తా పంజాబ్‌ (మేల్కొంటుంది) అన్న టైటిల్‌తో అనురాగ్‌ కశ్యప్‌ తదితరులు నిర్మించిన చిత్రాన్ని ముప్పుతిప్పలు పెట్టడంపై బాలీవుడ్‌ భగ్గుమంటున్నది. అమితాబ్‌ బచ్చన్‌, మహేశ్‌ భట్‌, శ్యాం బెనగల్‌, జోయా అక్తర్‌ వంటి ప్రముఖులు దీనిపై నిరసన తెలియజేశారు. జూన్‌17న విడుదల కావాల్సిన ఈ చిత్రంలో పహ్లాజ్‌ నిహ్లని అధ్యక్షతన గల సెన్సార్‌ బోర్డు 89 కట్స్‌ చేయాలని చెప్పింది. అసలు టైటిల్‌లో గానీ, చిత్రంలో గానీ పంజాబ్‌ అన్న మాటే వినిపించరాదని హుకుం జారీ చేసింది. సమస్య, కథ మొత్తం పంజాబ్‌ గురించే అయినప్పుడు ఆ పేరే లేకుండా చేయడం ఎలా సాధ్యం? అందుకే నిర్మాతలు దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు. ఈలోగా మీడియాలోనూ బయట కూడా తీవ్ర వాదోపవాదాలు సాగుతున్నాయి. పంజాబ్‌లో ప్రస్తుతం అకాలీదళ్‌, బిజెపి మిత్రమ ప్రభుత్వం నడుస్తున్నది. 2017లో ఎన్నికలు కూడా జరగాల్సి వుంది. ఈ డ్రగ్స్‌ సమస్యతో సహా అనేక వైఫల్యాల వల్ల పాలకకూటమికి ఓటమి తప్పదని అందరూ అనుకుంటున్నారు. ఈ కారణంగానే సినిమాలో కూడా పంజాబ్‌పై విమర్శలు తొలగించమంటున్నారనేది స్పష్టం. ఈ నిర్ణయాన్ని ఆప్‌ అధినేత కేజ్రివాల్‌, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తదితరులు తప్పుపట్టారు. ఎన్నికలో ఈ రెండు పార్టీలే ప్రధాన పోటీదారులుగా ఉన్నాయి. అయితే నిర్మాత అనురాగ్‌ కశ్యప్‌ ఈ సమస్యను రాజకీయం చేయొద్దంటూ వారిపైనా విమర్శ చేశారు. పహ్లాజ్‌ నిహ్లనిని నియమించినప్పుడే సెన్సార్‌ బోర్డు పక్షపాత నిర్ణయాలు తీసుకోవచ్చని విమర్శలు వచ్చాయి. తాజా వివాదం తరువాత పహ్లాజ్‌ తాను నరేంద్రమోడీ వీరభిమానినని చెప్పుకోవడానికి ఎంత మాత్రం వెనుకాడబోనని గర్వంగా ప్రకటించారు. చివరకు దీనిపై కోర్టు ఎలాంటి తీర్పు ప్రకటిస్తుందో కానీ చలనచిత్రకారులు, కళాకారులు మాత్రం ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. సెన్సార్‌ పేరిట సృజనాత్మక స్వేచ్ఛను భంగపర్చాలని గతంలో న్యాయస్థానాలు తీర్పులు ఇచ్చి ఉన్నాయి. కొన్నిసార్లు అసభ్యత, దేశభద్రత, మతసామరస్యం వంటి పేర్లతో కటింగ్స్‌ చేస్తుంటారు. బొంబాయి నుంచి విశ్వరూపం వరకు ఆ విధమైన సమస్యలు ఎదుర్కొన్నాయి. కానీ ఇప్పుడు పంజాబ్‌ అన్న పేరుకు అభ్యంతరం పెట్టడంలో రాజకీయాలే తొంగిచూస్తాయి. చిత్రంలో కథా,పాత్రలు కల్పితమని ముందుగానే ప్రకటిస్తారు గనుక దానిపై ఎలాంటి వివాదాలు తలెత్తే ఆస్కారం ఉండకూడదు. రాష్ట్రాలు , ప్రాంతాలు, భాషల పేర్లను సినిమాల్లో ఉపయోగించడం ఎప్పుడు జరుగుతూనే ఉంది. కనుక ఉడ్‌తాపంజాబ్‌పై వేటు వేయడం మరింత విస్రృతమైన చర్చకు, కార్యాచరణకు దారితీస్తున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *