అమెరికాతో ఒప్పందాలపై ఆర్భాటమేల?
ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన సందర్భంగా అణుశక్తికి సంబంధించి అంతర్జాతీయవ్యవహారాల్లో మనదేశం స్థానాన్ని బలపరుచుకోవడం గురించి చాలా ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నది. వాస్తవంగా అమెరికా అధ్యక్షుడు ఒబామా ఇప్పుడు కోరల్లేని అధ్యక్షుడు ( లేమ్‌డక్ ప్రెసిడెంట్) అంటారు. అలాంటి ఒబామాతో మోడీ ఇప్పుడు జరిపింది ఏడో సమావేశం.
పర్యటన సందర్భంగా నాలుగు ప్రధాన అంశాలను ఇరుదేశాలు ప్రకటించాయి. మొదటిది అణుసామాగ్రి సరఫరాల బదాలయింపుపై అవగాహన (లాజిస్టిక్స్ ఎక్స్చేంజ్ మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్). రెండవది క్షిపణి నియంత్రణ వ్యవస్థ (ఎంటీసీఆర్). మూడవది ఇందుకు సంబంధించిన సాంకేతిక సరఫరాలకు సహకారం. నాలుగవది ఎన్ఎస్జీలో సభ్యత్వం కోసం భారతదేశం అభ్యర్థనను ముందుకు నడిపేందుకు అమెరికా అంగీకారం. ఈ అంశాల్లో మొదటి రెండింటికీ సంబంధించి భారతదేశం మరిన్ని చర్యలు తీసుకున్నట్లు అమెరికా సంతృప్తి చెందాల్సి ఉంటుంది. ఎన్ఎస్జీలో చేర్చుకునేందుకు తన గట్టి మద్దతు మాత్రమే అందిస్తుంది. పర్యవరణ విషయమై పారీస్ ఒడంబడిక కుదర్చడంలో ఇండియా పాత్రను ఒబామా ప్రశంసించారు. కానీ అమెరికా ఇచ్చిన వివరణ పట్ల ఇండియా పూర్తి సమ్మతి తెలియచేయలేదు. మినహాయింపులు అట్టిపెట్టుకుంది. ఒక్కముక్కలో చెప్పాలంటే ఇందులో ఏదీ అంతిమంగా సంతకాల దశకు చేరినట్టు కాదు. ఇండియా చెప్పుకున్న మేరకు కూడా ఒబామా సానుకూల సమ్మతి తెల్పలేదు. ఈ ఒప్పందం వల్ల జరిగేది అమెరికా ఆయుధ కంపెనీల వ్యాపారానికి భారతదేశాన్ని మార్కెట్‌గా మార్చటం మాత్రమే. మన క్షిపణి పరికరాలు, ఆయుధ సంపత్తి ఎగుమతి చేసుకోడానికి దీనివల్ల అవకాశాలు పెరుగుతాయన్నది అవాస్తవిక ఊహాగానం. ప్రపంచ ఆయుధ వ్యాపారంలో అరవైశాతం పైగా అమెరికా ఆధ్వర్యంలోనే నడుస్తున్నది. పైగా అక్కడి ఆయుధ సంస్థలు కార్పోరేట్ మిలటరీ వ్యవస్థలుగా మారిపోయాయి. ఆ దేశ సైన్యంలో కూడా ప్రయివేటు బలగాలు పనిచేస్తాయి. కనుక అలాంటి దేశంతో ఒప్పందానికి రావడమంటే మన సైనిక, రక్షణ, ఆయుధ వ్యవస్థలలో అంతర్జాతీయ బేహారుల చొరబాటుకు తలుపులు తీసినట్టు అవుతుంది. అనైతికతకు పేరుమోసిన అలాంటి కంపెనీల వల్ల మన దేశ భద్రత, రక్షణ పాటవంపై పడే ప్రభావం ఊహించవల్సిందే. ఈ వ్యాపార లావాదేవీలకు అవసరమైన ప్రాతిపదిక, సరఫరా వ్యవస్థ సృష్టించడానికే మోడీ ప్రస్తుత పర్యటన దారితీస్తుంది. మోడ్రన్ లాండింగ్ ఎక్విప్మెంట్స్, ప్రొఫల్షన్ మిషనరీ సరఫరా భారత్ కోరుతున్నా ఆ ఒప్పందం ఇంకా పూర్తి కాలేదు. పాకిస్తాన్‌కు ఇప్పటివరకు సరఫరా చేస్తున్న ఎఫ్15, ఎఫ్16 విమానాల స్థానే ప్రస్తుతం ఎఫ్35 అయిదోతరం విమానాలు రంగంలోకి వచ్చాయి. వీటిని అమెరికా మనకు విక్రయించే అవకాశం ఒకటైతే.. వీటి తయారీకి సంబంధించి గతంలోనే రష్యాతో మనం ఒప్పందం కుదుర్చుకున్నాము. ఆరీత్యా కూడా ఇది గొప్ప ఫలితంగా చెప్పలేము.