నిన్న మార్గదర్శకుడు.. నేడు విషపునాగు

kodanda1111
జెఎసి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌పై కెసిఆర్‌ మినహా టిఆర్‌ఎస్‌ హేమాహేమీలంతా ఒక్కుమ్మడిగా విరుచుకుపడటం..ఇష్టానుసారం నిందించడం తెలంగాణ వాదులే భరించలేని స్థాయిలో వున్నాయి. నిన్న గంగిగోవులా చూపించిన ఆచార్యుణ్ణి ఈ రోజు విషపునాగుగా చిత్రిస్తే ఎలా చెల్లుతుందని ఆశ్చర్యపోతున్నారు. రెండేళ్ల పాలన తర్వాత ప్రభుత్వంపై నేరుగా విమర్శలు చేసిన కోదండరాంకు రాజకీయ దురుద్దేశాలు ఆపాదించడం కూడా అనుచితమనే భావన బలంగా వినిపిస్తున్నది. కాంగ్రెస్‌ బిజెపి లేక మరెవరో ఆడిస్తే ఆడుతున్న కీలుబొమ్మగా కోదండరాంను విమర్శించడం, కెసిఆర్‌ చేస్తేనే చైర్మన్‌ అయ్యారని తీసిపారేయడం అంటే గతంలో టిఆర్‌ఎస్‌ కీలుబొమ్మగా ఇప్పుడు ఇంకొకరి పావుగా వుండటం తప్ప ఆయనకు వ్యక్తిత్వం లేదా? వామపక్ష తీవ్రవాద నేపథ్యం నుంచి వచ్చిన కోదండరామ్‌ అన్ని దశల్లోనూ తెలంగాణకు సంబంధించినంతవరకూ ఆచితూచి మాట్లాడుతూ వచ్చారు. తమతో ఏకీభవించని పార్టీలను కూడా నొప్పించకుండా కొన్ని సందర్భాల్లో కలుపుకొని వచ్చే విధంగా వ్యవహరించారు. కాగలకార్యం గంధర్వులు తీర్చినట్టు చాలా సందర్బాల్లో తెలంగాణ రాజకీయ నేతల ఇరకాటాన్ని తను తప్పిస్తూ సమన్వయకర్తగా వ్యవహరించారు. ఉద్యమ కాలంలోనూ కెసిఆర్‌ ఆయనను అన్నివేళలా అక్కున చేర్చుకున్నారని చెప్పలేము. కాకుంటే జెఎసి అనే ఛత్రం చాలా అవసరం గనక సర్దుకోవడానికి సిద్ధమైనారు. అధికారంలోకి వచ్చాక ఇప్పుడు జెఎసి అవసరం తీరిపోవడమే గాక అడ్డంకిలాగా కూడా భావించారు.
కోదండరాం వామపక్ష నేపథ్యం వున్నా వాటి ఉమ్మడి ఉద్యమాలలో పాల్గొనడానికి సిద్దపడలేదు. రైతు జెఎసి కూడా ప్రత్యేకంగానే ఏర్పాటు చేశారు. మొదటి ఏడాది ప్రభుత్వంపై సుతిమెత్తగా సానుకూలంగా మాట్లాడుతూ వచ్చారు.రెండవ ఏడాదిలోనే నెమ్మదిగా స్వరం పెంచుతూ నిరసనలకు గొంతు కలుపుతూ జెఎసి అస్తిత్వాన్ని గుర్తు చేసేపనిచేపట్టారు.వివిధ సందర్భాలలో ఆయన ప్రసంగాలు నెమ్మదిగా పదును తేలుతూ మల్లన్న సాగర్‌ ధర్నా సందర్భంలో తారాస్థాయినందుకున్నాయి. రెండేళ్లలో ఏదీ సాధించలేకపోయిన ఈ ప్రభుత్వం దిగిపోవడం మంచిదని ఆయన అనడం టిఆర్‌ఎస్‌కు రాజద్రోహంలా కనిపించింది. వారికి నచ్చకపోయినంతమాత్రాన అలా అనే హక్కు ఆయనకు లేదా? 2013 భూ సేకరణ చట్టం పక్కనపెట్టి జీవో123 కింద రైతుల భూములు తీసుకోవడం పునరావాస బాధ్యత నుంచి చేతులు దులుపుకోవడం పూర్తిగా పొరబాటు. అప్రజాస్వామికం కూడా. చాలా కాలంగా ఉభయ కమ్యూనిస్టుపార్టీలు కాంగ్రెస్‌ దీనిపై ఆందోళన చేస్తూనే వున్నాయి.
జెఎసిని కూడా కలుపుకుని పోలేనంత అసహనం దేనికని నేను మొన్న నా గమనం వ్యాసంలో ప్రశ్నించాను. ఆ అసహనంలో అహం అభద్రత ఏ స్థాయిలో వున్నాయో ఈ సామూహిక శాపనార్థాలు నిరూపిస్తున్నాయి. కెసిఆర్‌ తెలంగాణ సాధకుడనుకుంటే చోదక పాత్ర జెఎసిది. తాము ఉద్యమ పార్టీని ఫక్తు రాజకీయ పార్టీగా మార్చుకోవచ్చు గాని అవతలివారు మాత్రం సూక్తులు మాత్రమే చెప్పాలని విమర్శలు చేయడం నిషిద్దమని అనుకోవడం హాస్యాస్పదం. మాట్లాడిన ప్రతివారిపైనా ద్రోహం ముద్ర వేసినట్టే కోదండరాంపై వేయడం కుదిరేపని కాదు గనకనే వ్యక్తిగత దాడికి దిగారు.
ఆయనను పదేళ్లనుంచి చాలా దగ్గరగానూ చర్చలలోనూ అనేక వేదికలలోనూ కలిశాను. విభేదించిన సందర్బాలున్నా రాజకీయ స్వార్థం ఆపాదించే దాడిని హర్షించలేను . అసలు దీన్ని వ్యక్తిగత వివాదంగా చూడటం లేదు.వ్యవస్థాగత దాడిగానే పరిగణిస్తున్నాను. కాంగ్రెస్‌ దగ్గరకు వెళ్లడం కోదండరాం తప్పు అయినట్టు చెబుతున్న టిఆర్‌ఎస్‌ నేతలు అధినేత కూడా తామే విలీనం ప్రతిపాదనలు చేసిన సంగతి ఎలా మర్చిపోతారు? ఉద్యమ పార్టీ అనేవారు ఉద్యమాలపై ఉద్యమకారులపై విరుచుకుపడే బదులు విమర్శలను స్వీకరించి పొరబాట్లు సవరించుకోవడం మేలు.కోదండరాం కూడా గతాన్ని సమీక్షించుకుని భవిష్యత్తును స్పష్టంగా నిర్ణయించుకోవడం అవసరం,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *