పూజకు కులమే అర్హతా?

06th_archakas-s_06_2883343f
ఏ కులమూ నీదంటే గోకులమూ నవ్వింది.. అంటూ పాట. కాని కులాల దొంతరలు నిచ్చెనమెట్ల సమాజం వాటినుంచి అంత బయిటపడటం లేదు. పైగా కులాధిక్యతను నియమావళిని ఎవరైనా ప్రశ్నిస్తే భరించలేకుండా వుంది. ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య బ్రాహ్మణులకు వ్యతిరేకంగా చేస్తున్న తీవ్ర విమర్శలపై మీ స్పందన ఏమిటని కొందరు నన్నడిగారు. మొదటి సంగతి బ్రాహ్మణీయ సమాజం అన్నప్పుడు మొత్తం సమాజం తప్ప ఒక కులం కాదు. ఆయన ఏ ఒక్క వ్యక్తిమీదనో కాకుండా వ్యవస్థపై చేస్తున్నప్పుడు ఆ విధంగానే చూడాల్స వుంటుంది.ఆ కులవివక్షను, హెచ్చుతగ్గులను మీరు ఆమోదించకపోతే ఐలయ్య విమర్శ మీకు తగలదు. ఒక వేళ మీరు నిజంగా ఇప్పటికీ మేమే అగ్రభాగాన వుండి ఆధ్యాత్మిక గురువుల పాత్ర పోషించాలనుకుంటే అప్పుడు ఆ వ్యవస్థ ప్రతినిధులుగా ఆయన విమర్శలకు సమాధానంచెప్పుకోకతప్పదు.
ఐలయ్య మాటల్లో హెచ్చుతగ్గులేమిటి, సమగ్రత ఎంత అనే మీమాంస కన్నా మౌలికంగా ఆయన వివక్షలను ప్రశ్నిస్తున్నారనేది వాస్తవం. దానికి గాను ఆయనపై దాడి చేయడం అసహనమే అవుతుంది. నిండైన బ్రాహ్మణుడు మెట్టుభూమి ఒకటే చండాలుండేటి సరిభూమి యొకటే అన్న అన్నమయ్య పాటలు పాడుకుంటున్నప్పుడు ఐలయ్య మాటలకు ఆక్షేపణ ఎందుకు?
ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే ఐలయ్య లేవనెత్తే ఒక ప్రధానసమస్య ఇప్పుడు తమిళనాడులో ఎదురైంది. అక్కడ ప్రభుత్వం బ్రాహ్మణేతరులకు పూజారి వృత్తిలో శిక్షణ ఇప్పించింది. 2007-09 మధ్య ఆ విధంగా 206 మంది శిక్షణ పొందారు. కాని ఇప్పటి వరకూ వారికి ఉద్యోగ నియామకాలు లేవు. దేవాదాయ శాఖ తరపున పూజారిగా పనిచేసేందుకు కులం కొలబద్ద కావడాన్ని రాజ్యాంగం ఒప్పుకోదని సుప్రీం కోర్టుతీర్పు నిచ్చిన తర్వాత కూడా వీరికి నియామకాలు లభించలేదు. ఆ తీర్పులో సుప్రీం కోర్టు ఆనవాయితీని బట్టి నియామకాలు చేయాలని ఒక సూచన చేయడంతో దాన్ని లొసుగుగా మార్చుకుని వారిలో ఎవరికీ నియామకాలు లేకుండా చేశారు. నిజానికి ఆనవాయితీ అనేట్టయితే తమిళనాడులోని వైష్ణవాలయాలకు బ్రాహ్మణుల్లోనూ ఫలానా గోత్రీకులే పూజారులుగా వుండాలని ఆచారాలు చెబుతాయి. ప్రభుత్వం ఒకసారి శిక్షణ ఇచ్చినా నియామకాలు జరగలేదంటే కులం పట్టు వున్నట్టా లేనట్టా? గుడిలో దేవుడి విగ్రహం బ్రాహ్మణేతరుల పూజలు తీసుకోనంటుందా? ఈ శిక్షణ పొందిన అభ్యర్థుల సంఘం కార్యదర్శి వి.రంగరాజన్‌ తమకు సత్వరం నియామకాలు జరగాలని కోరుతున్నారందుకే.
కొంతకాలం కిందట తిరుపతిలోనూ ఇలాటి వివాదమే ఎదురైంది. బ్రాహ్మణేతరులకు వేదవిద్య నేర్పిపూజారి పని ఇప్పిస్తామంటే చాందసులు దుమారం రేపారు. తర్వాత ఆ పథకం ముందుకు కదిలింది లేదు.
పల్లెల్లోనూ హైదరాబాదు వంటి నగరాల్లోనూ కూడా గ్రామదేవతలు, స్థానిక దేవతల గుళ్లలో బిసిలు మహిళలు కూడా పూజారులుగా వుండటం చూస్తాం. ఆ దేవతలను కూడా సంసృతీకరించడంతో అక్కడా పరిస్థితి మారుతుండొచ్చు. ఎల్లమ్మ అంటే ఎల్లలో వుండే దేవత. ఆమెకు రేణుక అని పేరు తగిలించారు. తలుపులమ్మ, పోలేరమ్మ, గట్టు మైసమ్మ ఆటలమ్మ ఈ పేర్లలోనే వారి పుట్టుక కూడా వుంటుంది. వీరందరినీ కాళికాంశగా చెప్పి ఆమెను ఈశ్వరుడిలో సగభాగంగా అంటే అర్ధనారీశ్వరిగా చేస్తేగాని ఆచారాలు శాంతించలేదు. అదంతా పెద్దచరిత్ర.
నిజానికి ఈ జాడ్యం హిందూమతంలోనే కాక మతం మారిన క్రైస్తవులలోనూ వుందని తమళనాడులోనే జరిగిన అధ్యయనం వెల్లడించింది. అక్కడ క్యాథలిక్‌ చర్చిలో ఎలాటి ముఖ్య బాధ్యతలు ఈ దళిత క్రైస్తవులకు ఇవ్వడం లేదు. ఆ రాష్ట్రంలో 39,64,360 మంది క్యాథలిక్కులుంటే వారిలో 22,40,726 మంది దళితులనుంచి వచ్చినవారే. వీరు అక్కడ కూడా వివక్షకు గురవడం విచారకరమైన వాస్తవం. దలిత్‌ విడుదలై పెరవి నాయకుడు జాన్‌ సురేష్‌ మాట్లాడుతూ కుల వివక్ష ఇక్కడ కూడా కొనసాగుతుందనేది వాస్తవమని వ్యాఖ్యానించారు. దళితులు వివక్షను వదలించుకోవడానికే మతం మార్చుకుంటారనేది నిజం కాదనీ అయితే ఆ తర్వాత కూడా వారిని తక్కువగా చూడటం కొనసాగుతుందని చెప్పారు.ఈ సమస్య ప్రొటెస్టంట్‌ శాఖలోనూ వుంది.కొన్నిచర్చిలలో దళితుల అంతిమ సంస్కారానికి కూడా అనుమతించకపోవడం మరింత దారుణమైన వాస్తవం.
కనుక ఎవరిమీదనో దాడి చేసేబదులు కుల వివక్షపై పోరాడ్డం అవసరం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *