అమరావతి – అయోమయం,. అనిశ్చితం,

నూతన రాజధాని అమరావతిలో భాగంగా వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణం తలపెట్టిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అటు భవన నిర్మాణంలోనూ ఇటు ఉద్యోగుల తరలింపులోనూ కూడా అయోమయంగా వ్యవహరించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అంత అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి ఎందుకింత తడబాటుకు గురవుతున్నారు పొరబాట్లు చేస్తున్నారు?. కనిపించని ఏవో ఒత్తిళ్లు లేదా చెప్పడానికి లేని అంతర్గత పథకాలు ఆయనను ప్రభావితం చేస్తున్నాయా?
పదేళ్లపాటు హైదరాబాదులో ఉమ్మడి రాజధానిగా కొనసాగించే అవకాశం వున్నా సాద్యమైనంత త్వరగా వెళ్లాలనే అంతా కోరుకున్నారు. అయితే దాని అర్థం తాడూ బొంగరం లేకుండా వ్యవహరించాలని కాదు. విజయవాడ గుంటూరు వంటి ప్రముఖ నగరాలు అందుబాటులో వున్నా తాత్కాలికం కోసం వెలగపూడిలో అన్ని వందల కోట్లు ధారపోయాలా అని ముందే విమర్శలు వచ్చాయి. తర్వాత కూడా వాడుకోవడానికి వీలుగా కడుతున్నామన్నారు. అయితే తర్వాత వీటిని కళ్యాణమంటపాలుగా సభామందిరాలుగా వాడతామని తర్వాత వివచణ ఇచ్చారు. అంటే వాణిజ్య కేంద్రాలుగా వుంటాయన్నమాట. అదైనా ఎన్ని అంతస్తులు ఎప్పటిలోగా కట్టాలంటే మళ్లీ అనిశ్చితి. అనేక మార్పులు.చివరకు జి+3తో ఈ దశ అయిపోతుందన్నారు. అందులో దిగువ రెండు ఫ్లోర్లు ఉద్యోగులకు పై రెండు ఫ్లోర్లు శాఖాధిపతులకు కేటాయించాలనుకున్నారు. జూన్‌చివరకు వీటిలోచేరితే ఆగష్టునాటికి తక్కిన రెండు ఫ్లోర్లు ఇచ్చేస్తారని భావించారు. కాని ఏదీ అనుకున్నట్టు జరగలేదు.
వీటన్నిటికంటే పెద్ద సమస్య భవనం కడుతున్న కాంట్రాక్లర్ల అంటే ఎల్‌అండ్ టి , షాపూర్జీ వాలా సంస్థల రేట్లు. మొదట అనుకున్నట్టు గాక అదనంగా మరో రెండు ఫ్లోర్లు వేసేందుకు వారు ఎంతమాత్రం అంగీకరించలేదు.మరోవైపున ప్రభుత్వం కూడా అనుకున్న ప్రకారం హడ్కొనుంచి రుణం 500 కోట్లు తెచ్చుకోలేకపోయింది. కారణం ఇంతకన్నా వింత సమస్య- నిర్మాణం జరుగుతున్న భూమిపై ప్రభుత్వానికి ఏ హక్కు లేదు. అది రైతుల నుంచి తీసుకోవడం తప్ప చట్టబద్దంగా రిజిస్ట్రేషన్ జరగలేదు. స్వంతహక్కులేని భూమిపై రుణం లభించడం కష్టమైంది.
మరో రెండు ఫ్లోర్లు కడితే అదనంగా పదిశాతం ఇస్తామని క్రిడా ఆశచూపినా వారు సిద్ధం కావడం లేదు. వేరే కాంట్రాక్టర్లను పిలవాలంటే ఇప్పటికే అధిక రేటు ఇస్తున్నాము గనక ఇంకా పెంచడం మంచిది కాదని అధికారులు సలహా ఇచ్చారట. దాంతో తాత్కాలికంపై గొప్పలు విరమించి అద్దె భవనాలు వెతకమని పురమాయించారు. రాకపోకల సదుపాయాలు అంతంత మాత్రంగా వుండటంతో ఒకో కార్యాలయం ఒకచోటైతే ఎలా అని అధికారులు తలలుపట్టుకున్నారు.ఇప్పుడు ప్రధాన కట్టడమే అయింది.ఇంకా ఇతర సదుపాయలు ఫర్నిషింగ్, కనెక్షన్లు వంటివన్నీ వున్నాయి. ఇవి ఇతరులకు ఇస్తే ఇబ్బంది గనక మళ్లీ ఇదే సంస్థలకు దఖలు పర్చనున్నారు.
జూన్27 అని ఒకటికి రెండు సార్లు గంభీరంగా ప్రకటించినా, ఉద్యోగులు రావలసిందేనని హుకుంలు జారీ చేసినా వాస్తవ పరిస్థితి ఇంత దారుణంగా వుంది గనకనే చంద్రబాబు మళ్లీ కాస్త వెనక్కు తగ్గారు. జూన్27తో మొదలుపెట్టి దశలవారీగా తీసుకెళ్తామన్నారు. మరి ఈ కొత్త గజిబిజి తర్వాత తమ పిల్లలను ఎక్కడ చేర్చాలన్న సందేహం ఉద్యోగులను ఆందోళనకు గురి చేస్తున్నది.అద్దెలు ప్రయాణ భారాలు సరేసరి. భార్యా భర్తలు ఎవరెక్కడ అనే సమస్యా వుంది. మొదటే స్పష్టంగా తేల్చిచెప్పివుంటే వారు సర్దుబాటు చేసుకునేవారు. పైగా కార్యాలయ భవనమే సిద్దం కానప్పుడు పాలనను తరలించడం వల్లప్రయోజనమేమిటనేది పెద్ద ప్రశ్న. విద్యా సంవత్సరం మధ్యలో నిర్ణయం తీసుకుంటే అది మరో తలనొప్పి.