బిజెపి బిగింపు-చంద్రబాబు లాలింపు!

ప్రస్తుత రాజకీయ సమీకరణాలు మారే అవకాశం లేదని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి స్పష్టంగా చెప్పారు. అంటే బిజెపితో చెలిమి కొనసాగిస్తానని అర్థం. కాని బిజెపి అధిష్టానం, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు మాత్రం అందుకు పూర్తి రివర్స్‌లో వున్నాయి. రాజ్యసభ స్థానాలు ఆఖరు వరకూ అడగకుండానే బిజెపి బెట్టుచేసింది. ఆఖరి నిముషంలో అడిగారన్న కొరత పెట్టుకోకుండా రైల్వేమంత్రి సురేష్ ప్రభును రాజ్యసభకు పంపించిన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రికి ఆశాభంగమే మిగిల్చింది బిజెపి నాయకత్వం. ప్రత్యేక హౌదా రాకపోయినా కనీసం విశాఖ రైల్వేజోన్ అయినా ఇప్పిస్తే కొంత పరువు కాపాడుకోవచ్చన్న అంచనాలు తలకిందులు చేసింది. రైల్వే బడ్జెట్ సమయంలో మాతో చర్చించిన బిజెపి నేతలు చాలామంది జోన్ తర్వాత తప్పక వస్తుందని వాదించారు. కాని ఇప్పుడు సురేష్ ప్రభు స్వయంగా ఆ అవకాశం లేదని చెప్పేశారు. ఇతర కోర్కెలను నెరవేరుస్తామన్నారు. కృతజ్ఞతా ప్రకటన సమయంలోనే కుండబద్దలుకొట్టి చెప్పారంటే ఆశలు వదులుకోవలసిందేనని తేలిపోయింది. ఒరిస్తా అభ్యంతరం చెబుతున్నదనే సాకు కూడా వినిపించారు. ప్రత్యేక హౌదా విషయంలో వలెనే దీనిపైన కూడా గత ప్రభుత్వం పరిశీలించాలని చెప్పిందే తప్ప నిర్ణయం తీసుకోలేదని మెలికపెట్టారు. మాకు జోన్ ముఖ్యం అని చంద్రబాబు అన్నమాట లాంఛనమే తప్ప ప్రబావశీలం కాదని ఆయనకూ తెలుసు.
గోరుచుట్టమీద రోకటిపోటులా ఇదే సమయంలో ఆర్థిక సహాయానికి సంబంధించి కూడా కేంద్రం నుంచి వచ్చిన సంకేతాలు ప్రతికూలంగా వున్నాయి. రెవెన్యూలోటు 16 వేల కోట్లు అన్న సిఎజి లెక్కను అవతలపెట్టేసి ఆరువేల కోట్లకే పరిమితమైంది. రైతు రుణమాఫీ తమకు సంబంధం లేని కొత్త పథకమని తేల్చిపారేసింది. రాజధానికి కూడా ఇప్పటికి ఇచ్చిన రెండువేల కోట్ల పైచిలుకు తప్ప మరింత మంజూరు చేసే అవకాశం లేదని స్పష్టం చేసింది.
ఏతావాతా చంద్రబాబు సన్నాయి నొక్కులు సర్దుబాటు రాగాలు కేంద్రం ముందు పనిచేయడం లేదని తేలిపోయింది. తలుపుచెక్కతో వారంటుంటే తమలపాకుతో నేనంటున్నా అన్న చందంగా వుంది ఈ వ్యవహారం.
తెలంగాణలో ప్రాజెక్టుల వివాదాలపై ముఖ్యమంత్రి కెసిఆర్‌తో తను సమావేశమయ్యే అవకాశం లేదని కూడా చంద్రబాబు చెప్పేశారు. గతంలో తెలంగాణ మంత్రి హరీశ్ రావు రాసిన లేఖలకు ఇచ్చిన సమాధానంలో ఎపి మంత్రి ఉమామహేశ్వరరావు ఇదే భావం వెలిబుచ్చుతూ వచ్చారు. కృష్ణా గోదావరి నదీజలాల ఉన్నతస్థాయి వ్యవస్థల ముందు త్రిపక్ష వేదికపై మాత్రమే చర్చ జరగాలన్నది ఎపి అభిప్రాయంగా వుంది. అయితే కృష్ణా బోర్డు ఏకపక్షంగా వ్యవహరిస్తుందనేది తెలంగాణ అభియోగం. దీన్ని రాజకీయ విమర్శలకే పరిమితం చేయకుండా కేంద్రానికి ఫిర్యాదు రూపంలోనే లేఖరాశారు. మరి మధ్యవర్తి వ్యవస్థ లేకుండా ఇంత తీవ్ర సమస్యలు పరిష్కారం కాబోవు. అసలు తెలంగాణతో కలసి కూచోవడమంటేనే వారి వాదననుఆమోదించినట్టవుతుందని ఎపి అనుకుంటున్నది. దిగువ రాష్ట్రమే గనక ఎపి ఏమనుకున్నా తమకు ఇబ్బంది లేదన్నది కెసిఆర్ వైఖరిగా వుంది. (గతంలో తెలుగుగంగపై కర్ణాటక వివాదం లేవనెత్తినప్పుడు ఎన్టీఆర్ దానిలో భాగస్వామి కావడానికి చాలా కాలం నిరాకరించారు.) .ఈ విషయంలోనూ కేంద్రం జోక్యం చేసుకోవడానికి సిద్ధపడటం లేదు. అక్కడ వెంకయ్యనాయుడు ఇరు రాష్ట్రాల మధ్య పెద్ద మనిసిలా మాట్లాడుతుంటే ఇక్కడ బండారు దత్తాత్రేయను తమ ఖాతాలో వేసుకోవడానికి టిఆర్‌ఎస్ పావులు కదిపేసింది. ఆయన అనవసరంగా కెసిఆర్‌ను పొగుడుతున్నారని బిజెపి రాష్ట్ర నాయకులు మొన్న ధ్వజమెత్తారు గాని దత్తన్న ధోరణి మారేట్టు లేదు. ఏది ఏమైనా ఇరురాష్రాల నేతలు చర్చలతో పరిష్కరించుకోవడం శ్రేయస్కరం.