అస్ట్రేలియానుంచి అదానీ ఔట్!?

మన దేశంలోకి విదేశీ కంపెనీలను పెట్టుబడులను ఆకర్షించేందుకు ఎప్పటికప్పుడు ఎన్నెన్నో రాయితీలు ప్రకటిస్తుంటారు. వారొస్తే చాలన్నట్టు పొంగిపోతుంటారు. కాని సాక్షాత్తూ ప్రధాని మోడీకి సన్నిహితుడుగా పేరు మోసిన పారిశ్రామికవేత్త గౌతం అదానికీ ఆస్ట్రేలియాలో ఎదురవుతున్న అవస్థలు చూస్తుంటే మనం ఎంత అమాయకులమో తెలుస్తుంది. తమ దేశ వనరులను పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ప్రతిదేశం ఎంతో ప్రాధాన్యతనిస్తుంది. అంతేతప్ప మన పాలకుల్లా అన్నీ తెరిచిపెట్టదు. ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ రాష్ట్రం బొగ్గుగనుల ప్రాజెక్టు, రైల్వేలైను ఇన్ఫ్రా సదుపాయాల నిర్మాణం కోసం బిడ్డింగ్‌ను ఆహ్వానించి
నప్పుడు అదానీ రంగప్రవేశం చేశారు. 2100 కోట్ల డాలర్ల విలువైన ఆ వెంచర్ ఆయనకు దక్కింది. ఇదంతా జరిగి ఆరేళ్లయింది గాని అడుగు పడింది లేదు. ఆయనకు అనుకున్న మేరకు ఆర్థిక సహాయం చేసేందుకు ఫ్రెంచి బ్యాంకులు నిరాకరించాయి. వాటిని తాము అసలు అడగనే లేదని ఆయన కంపెనీ ప్రకటించింది. తర్వాత 2015 ఏప్రిల్‌లో పర్యావరణ కార్యకర్తల ఫిర్యాదుపై న్యాయస్థానం నిలుపుదల చేసింది. అయినా ఎలాగో పోరాడారు. ఆ దశలోనే ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన ప్రధాని మోడీ అదానీ తరపున ఆ దేశప్రభుత్వానికి ఒక మాట చెప్పివచ్చారని కథనాలున్నాయి. మొత్తానికి 2016 ఏప్రిల్‌లో అదానీకి మళ్లీ ప్రభుత్వం నుంచి అనుకూల సంకేతాలు వచ్చాయి.తాను 300 కోట్ల డాలర్లు ఖర్చు కూడాచేశానని ఆయన అంటున్నారు. ఇంత జరిగినా మళ్లీ కొత్త ఆటంకాలు రావడంతో ఇది జరిగేపని కాదన్న నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తుంది. ఆస్ట్రేలియన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీన్ని ఇలా సాగించడంలో అర్థం వుండదు అని ఆయన వ్యాఖ్యానించారు.ఆస్ట్రేలియా ప్రధాని మాల్కం టర్నబుల్ మాత్రం దీనిపై ఇంకా పరిశీలన జరుగుతున్నట్టు చెబుతున్నారు.