ప్రాతిపదిక లేని ‘ప్రాంతీయ’ కలలు

fedaral111ఇటీవలి శాసనసభ ఎన్నికల తర్వాత దేశంలో ప్రాంతీయ పార్టీల ప్రాభవం నడుస్తున్నదనే వాదన బాగా పెరిగింది. బిజెపి కాంగ్రెస్‌లు పాలక పార్టీలుగా వున్నా కేవలం అయిదారు రాష్ట్రాలలోని 200 పార్లమెంటు స్థానాలలో మాత్రమే ముఖాముఖి తలపడుతున్నాయనీ, మిగిలిన చోట్లన్నిటా ప్రాంతీయ పార్టీల రాజ్యం నడుస్తున్నదని ఈ వాదన చేసేవారంటున్నారు. ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో మమతాబెనర్జీ ప్రమాణ స్వీకారానికి హాజరైన ముఖ్యమంత్రులు మాజీలు కొందరు ఆ వాదనకు ఆచరణ రూపమన్నట్టు ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు గురించి మాట్లాడారు.బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి ఆర్జేడి నేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఇందుకు చొరవ తీసుకోగా కాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నాయకులు ఫరూక్‌ అబ్దుల్లా బలపర్చారు. అంతటితో ఆగక మమతా బెనర్జీ ఈ కూటమికి నాయకత్వం వహింtcms చాలన్నట్టు మాట్లాడారు. ఆమె ఔను కాదనకుండా తాను చాలా చిన్నదాన్నని తన వల్ల కావలసిన సహాయం ఏదైనా చేస్తానని మనోభీష్టం వెల్లడించుకున్నారు.ఈ సందర్భంలో యుపి ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ (సమాజ్‌వాది)బీహార్‌ ముఖ్యమంత్రి నితిష్‌ కుమార్‌ (జెడియు) ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌(ఆప్‌) హాజరైనారు. తెలుగుదేశం,బిజూ జనతా దళ వంటి పార్టీల ప్రతినిధులు కూడా అక్కడ వున్నారు. బిజెపికి ఓడించేందుకు అదే సమయంలో కాంగ్రెస్‌ రహిత కూటమి ఏర్పాటుకు ఇదే మార్గమని వారన్నారు. . ఇదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు కూడా ప్రాంతీయ పార్టీల మాటే చెల్లుతుందని జాతీయ పార్టీల పాత్ర తగ్గుముఖం పట్టిందని స్పష్టంగా చెప్పేశారు. 80 మంది ఎంపిలతో ప్రెషర్‌గ్రూపుగా వ్యవహరించబోతున్నట్టు సూచనగా చెప్పారు. కమ్యూన్ణిస్టులు కూడా ప్రాంతీయ పార్టీలుగా మారాయన్నారు. తమాషా ఏమంటే బిజెపి కాంగ్రెస్‌లకు వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు గురించి వీరు మాట్లాడుతున్నా మమత ప్రమాణ స్వీకారానికి వచ్చిన వారిలో బిజెపి కేంద్ర మంత్రలు కూడా వున్నారు.
అంకెలూ అనుభవాలూ
2009 ఎన్నికల్లోనే మొదటిసారి కాంగ్రెస్‌ 200 స్థానాలకు మించి తెచ్చుకోగలిగింది. 2014లో మొదటిసారిగా బిజెపి స్వంతంగా పూర్తి మెజార్టి(290) స్థానాలు పొందింది. అయితే అప్పుడు కాంగ్రెస్‌ ఇప్పుడు బిజెపి కూడా రాష్ట్రాలలో ఓడిపోతూనే వున్నాయి. మొన్నటి అయిదు రాష్ట్రాల ఎన్నికలే తీసుకుంటే బిజెపికి63,కాంగ్రెస్‌కు 115 స్థానాలు రాగా ఇతర పార్టీలకు 643 స్థానాలొచ్చాయి. బిజెపికి 60 వచ్చిన అస్సాంలో మాత్రం అధికారం దక్కగా కాంగ్రెస్‌కు రెండు చోట్ల వున్నఅధికారం పోయింది.ఇంతకన్నా విస్త్రతమైన మరో లెక్క ప్రకారం గత నాలుగేళ్లలో 30 రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి. 4117 సీట్లకు పోటీ జరిగితే బిజెపి 1051, కాంగ్రెస్‌ 871, మాత్రమే తెచ్చుకున్నాయి.అంటే బిఎస్‌పి వామపక్షాలతో కలిపి చూస్తే మిగిలిన పార్టీలకే 2195 స్థానాలు వచ్చాయి. 465 స్థానాలు కాంగ్రెస్‌,బిజెపియేతర పార్టీలకే వచ్చాయని లెక్కలు చెబుతున్నాయి. అయితే ఇందులో కమ్యూనిస్టులను మినహాయిస్తే మిగిలిన పార్టీలన్నీ ఆర్థిక విధానాలలో ముమ్మూర్తులా కాంగ్రెస్‌ బిజెపిల నమూనానే అనుసరిస్తాయి.అంతేగాక ఎప్పుడో ఒకప్పుడు ఈ రెండు పార్టీలలో ఒకదానితో జతకట్టి అధికారం పంచుకున్న చరిత్ర వీటిది. ఇప్పుడు కూడా అలా చేస్తున్న పార్టీలు వున్నాయి. కనుక ప్రత్నామ్నాయం అన్నప్పుడు కేవలం సీట్ల సంఖ్యను బట్టి మాత్రమే గాక విధానాలు కీలకపాత్ర వహిస్తాయి. దేశానికి చేటు తెచ్చే సరళీకరణ విధానాలను సంఘ పరివార్‌ మతతత్వాన్ని సూటిగా వ్యతిరేకించనప్పుడు భిన్నమైన విధానాలు అనుసరించలేనప్పుడు వేరే వేదిక వల్ల ప్రయోజనమేమిటి, ప్రాతిపదిక ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.ఇక టిఆర్‌ఎస్‌ విషయానికి వస్తే తమ ప్రభుత్వంలో చేరేందుకు ఆ పార్టీ అభ్యర్థన పంపలేదని పంపితే ఆలోచించే వాళ్లమని బిజెపి అద్యక్షుడు అమిత్‌ షా హైదరాబాదులో చెప్పారు.కెసిఆర్‌ దీనిపై రాజకీయంగా స్పందించకుండా తెలంగాణ కోణంలో విమర్శలకే పరిమితమైనారు,ఆంధ్ర ప్రదేశ్‌ పాలకపక్షమైన తెలుగుదేశం ఇప్పటికే బిజెపి భాగస్వామిగా వుంది. ఇద్దరు ముఖ్యమంత్రులలో ఎవరూ బిజెపి మతతత్వ రాజకీయాలను గాని, అసహన వ్యవహారాలను గాని నిశితంగా ఖండించింది లేదు. కనుక ప్రాంతీయ పార్టీల బలం పెరగడం ఒకటైతే వాటి కలయిక ఎవరితో కలసి ఎవరికి వ్యతిరేకంగా ఏ ప్రాతిపదికన ఎవరి నాయకత్వంలో ఏర్పడుతుందనే సందేహం కలుగుతుంది.
హేమాహేమీల పాత్ర
ఏ కొలబద్ద లేకుండా గతంలో ఇలాగే ప్రాంతీయ పార్టీల కూటములు ఏర్పాటు చేసేందుకు జరిగిన ప్రయత్నాలు ఘోరంగా దెబ్బతిన్నాయి.బిజెపి అప్పటి లోక్‌దళ్‌ కలసి ఎన్‌డిఎ పేరిటనే హడావుడి చేశాయిగాని అది చప్పున చల్లారిపోయింది. అదే 80వ దశకం చివరలో జాతీయ స్తాయిలో జ్యోతిబాసు,విపిసింగ్‌,హరి కిషన్‌సింగ్‌ సూర్జిత్‌, ఎన్టీఆర్‌ వంటివారి చొరవతో ఏర్పడిన బిజెపి రహిత కూటముల వల్ల చాలా సత్పలితాలు కలిగాయి. దేవగౌడ ప్రధాని అయినా, చంద్రబాబు నాయుడు జాతీయ కన్వీనర్‌ అయినా అది ఈ మహానేతల ఆశీస్సులు అండదండలతోనే అని మర్చిపోలేము. తనకు ప్రధాని అయ్యే అవకాశం వచ్చిందని చంద్రబాబు పదే పదే చెప్పేది కూడా ఆ దశను గురించే.1998లో ఆయన బిజెపితో చేతులు కలిపిన తర్వాత మళ్లీ ఆ ప్రతిష్ట రానేలేదు. కాని తాను చక్రం తిప్పాననే జ్ఞాపకాలనుంచి బయిటపడని చంద్రబాబు ఫెడరల్‌ ఫ్రంట్‌అంటూ మమత,జయలలిత, ములాయం సింగ్‌యాదవ్‌ వంటివారిని సమీకరించి ఒకటిరెండు సమావేశాలు జరిపారు. కాంగ్రెస్‌ వ్యతిరేకత పేరిట బిజెపికి అనుకూలంగా వుండే కూటమని రూపొందించేందుకు విఫలయత్నాలు చేశారు. 2011లో యుపిలో బిఎస్‌పి నేత మాయావతి ఒంటరిగా అధికారం చేపట్టాక ప్రధాని కావాలన్న ఆకాంక్షతో కొన్ని సమీకరణలు జరిపారు. 2009లో మూడో ప్రత్నామ్నాయం తరపున ఆమె లేదా జయలలిత ప్రధాని కావచ్చన్న వూహాగానాలు ఆశారాగాలు వినిపించినా ఏదీ నిజం కాలేదు. 2014లో బిజెపి నరేంద్ర మోడీని ముందుకు తెచ్చి వంటరిగా మెజార్టి పొందింది. వామపక్షాల బలం పార్లమెంటులోనూ పశ్చిమ బెంగాల్‌లోనూ బాగా తగ్గింది.ఈ పరిస్థితుల్లో ప్రజా ఉద్యమాలను ప్రత్నామ్నాయ విధానాల ప్రచారాన్ని తీవ్రం చేయాలని, కాంగ్రెస్‌ బిజెపిలతో గాని లేక అదే విధానాలను అనుసరిస్తున్న ప్రాంతీయ పార్టీలతో గాని ఎలాటి పొత్తుకు అవకాశం వుండదని సిపిఎం గత ఏడాది జరిగిన విశాఖ మహాసభలో తీర్మానించింది. మొన్న పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెష్‌తో అవగాహన ఈ విధానానికి అనుగుణంగా లేదని ఇటీవల జరిగిన పొలిట్‌బ్యూరో సమావేశం స్ఫష్టంగానే చెప్పింది. తమిళనాడులో ఉభయ కమ్యూనిస్టుపార్టీలు ఇతర పార్టీలతో కలసి పీపుల్స్‌ వెల్ఫేర్‌ అలయన్స్‌ పేరిట చేసిన ప్రయోగం కూడా ఫలించలేదు. కేరళలో మాత్రం ఘన విజయం లభించింది. ఈ అనుభవాలన్నిటికి ఆయా రాష్ట్రాలలోనూ జాతీయ స్తాయిలోనూ సమగ్రంగా చర్చించిన తర్వాత మరింత ఆచరాణాత్మక సమీక్ష సాధ్యపడుతుంది.
వామపక్షాలపై ఆపహాస్యమా?
గుజరాత్‌, రాజస్థాన్‌,మధ్యప్రదేశ్‌,హిమచల్‌ ప్రదేశ్‌,ఉత్తరాఖండ్‌, చత్తీస్‌ఘర్‌లలో మాత్రమే కాంగ్రెస్‌ బిజెపి నేరుగా తలపడుతున్నాయి. ఈ కోవలోని ఢిల్లీలో ఆప్‌ అధికారం చేజిక్కించుకుంది. తక్కిన అన్ని చోట్ల రకరకాల రాజకీయ పక్షాలున్నాయి. ప్రాంతీయ శక్తులున్నాయి. వాటిలో అనేకం పాలకపక్షాలుగా వుండగా కొన్ని మిత్ర పక్షాలుగా గణనీయమైన ప్రభావం చూపిస్తున్నాయి. వామపక్షాలు సిపిఎం నాయకత్వాన రెండు రాష్ట్రాలలో అధికారంలో వున్నాయి. కీలకమైన బెంగాల్‌లో ఓటమిపాలైనా ఉద్యమాన్ని నిలబెట్టుకుంటూ నిర్బంధంపై పోరాడుతున్నాయి. కాంగ్రెస్‌ బిజెపి మినహా మరేపార్టీ రెండు మూడు రాష్ట్రాలలో అధికారంలో లేదనేది వాస్తవం. పార్లమెంటులో తెలుగుదేశం ప్రతిపక్షంగా వున్న దశను చెబుతారు గాని అత్యధిక కాలం సిపిఎం ఆ పాత్ర పోషించిందనేది చెప్పరు. ఇప్పుడు దెబ్బతిన్న మాట నిజమే అయినా సిపిఎం సిద్ధాంత స్పష్టత కార్యకర్తల యంత్రాంగం ఎవరూ విస్మరించలేరు. ఎంత బలం వున్న ప్రాంతీయ పార్టీలైనా సరే విధాన పరమైన ప్రాతిపదిక, సరైన సంధానకర్త లేనప్పుడు నూతన రాజకీయ పొందిక సాధ్యపడదు. ఎప్పటికప్పుడు ఎన్నో రాజకీయ పల్టీలు చాలా కొట్టిన వారు వామపక్షాల పని ముగిసిపోయిందని అపహాస్యం చేయడం తగనిపని. అలా అని వామపక్షాలు తామే ప్రత్యామ్నాయమని, లేక వెంటనే అలాటిది నిర్మించేస్తామని చెప్పుకోవడం లేదు కూడా.
మమత కీర్తనలు హాస్యాస్పదం
లౌకిక ప్రజాస్వామిక విలువలు సరళీకరణను వ్యతిరేకించే ప్రజానుకూల ఆర్థిక విధానాలు లేకుండా ఏ కలయికలు దేశాన్ని గట్టెక్కించలేవు. ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకునే పాలక పార్టీలు ఆఖరుకు అన్ని కుంభకోణాల మధ్య పరస్పరం సర్దుకుంటూనే వుంటాయని కళ్లముందు నడుస్తున్న చరిత్ర చెబుతున్నది. మరోవైపున ఆయా నేతల అధికార కాంక్షలూ అవకాశవాదాలూ కనీస ఐక్యతకు కూడా ఆటంకమవుతుంటాయి. నిన్న గాక మొన్న జనతా పరివార్‌ విలీనంపై నడిచిన ప్రహసనం చూశాం. . కాంగ్రెస్‌తో బిజెపితో చెలిమి చేయడమే గాక ఇప్పుడు కూడా బిజెపితో చేతులు కలిపి రాజకీయ లబ్ది పొందిన మమతా బెనర్జీని మూడో ఫ్రంట్‌ నాయకురాలుగా చూపడం హాస్యాస్పదమే అవుతుంది. ప్రాంతీయ అన్న పదాన్ని తీసుకొచ్చింది ఇందిరాగాంధీ. పార్టీల విధానాలు ముఖ్యం తప్ప ప్రాంతీయమా జాతీయమా అన్నది మౌలికం కాదు. ఎన్నికల సంఘం లెక్కలో ఇవన్నీ రాష్ట్ర స్థాయి పార్టీలు. స్థానికంగా ఎంత బలం వున్న ప్రాంతీయ పార్టీలైనా సరే విధాన పరమైన ప్రాతిపదిక, సరైన సంధానకర్త లేనప్పుడు నూతన రాజకీయ పొందిక సాధ్యపడదు. ఎందుకంటే భారత దేశం అనేక రాష్ట్రాల కలయిక తప్ప ఏ ఒక్క రాష్ట్రమో నిర్దేశించదగింది కాదు.
(నవతెలంగాణ,జూన్‌2 ఎడిట్‌పేజి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *