బ్రహ్మౌత్సవం -కథ, దర్శకత్వ వైఫల్యం

mahesh
బ్రహ్మౌత్సవం సినిమా ఎందుకు అంత ఘోరంగా విఫలమైంది? నీరసోత్సవం అనీ, బోరోత్సవం అని ఎందుకు ముద్ర వేయించుకుంది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడం కోసం (ఏడు తరాలను వెతికే ఆ చిత్ర కథానాయకుడిలాగే) నేను కూడా ఆలస్యంగా వెళ్లి చూశాను.సినిమాలన్నాక జయాపజయాలుంటాయి. అయితే అందుకు కారణాలు అన్వేషించుకోవడం కూడా అవసరమే. అన్నిటికన్నా పెద్ద లోపం ఆ చిత్రం కృత్రిమతం కూరినదిగా వుండటం. శ్రీకాంత్‌ అడ్డాలపై నమ్మకంతో మహేష్‌బాబు ఒప్పుకుని తీశాడంటున్నారు గాని ఆ మేరకు దర్శకుడు హౌం వర్క్‌ చేసినట్టు లేదు. కొత్తగా చెప్పేదేమీ లేకుండా- చెప్పే తీరులో కొత్తదనం లేకుండా- తెరపట్టనంత మంది తారలు, వారందరి మధ్య సూపర్‌స్టార్‌ను, ఇద్దరో ముగ్గురో గ్లామర్‌ హీరోయిన్లను పెట్టేస్తే హిట్‌ కాకపోతుందా అన్న భ్రమోత్సవమో బ్రహ్మౌత్సవం. ఒక పెద్ద మనిషి 400 రూపాయలు సహాయం చేస్తే కష్టపడి 400 కోట్ల రూపాయల ఫ్యాక్టరీ వరకూ ఎదిగిన చంటబ్బాయి సత్యరాజ్‌ కథ. అతని లాటి కుమారుడే హీరో కాగా తనతో వుంటూనే అసూయతో రగిలిపోయే బావమరిది రావురమేష్‌ అతని ముగ్గురు సోదరులు, వారి భార్యలూ పిల్లలూ , చంటబ్బాయి స్నేహితుడూ, హీరోను ప్రేమించి కూడా ఉమ్మడి కుటుంబం బాదర బందీ చూసి వదలివెళ్లిపోయిన కాజల్‌, పదిమందిలోనే ఆనందంవుందనుకుని లండన్‌ నుంచి వచ్చి తననే వలచిన సమంత.. ఇలా ఓ పెద్ద తారాతోరణం.
చిత్రం మొదలైనప్పటినుంచి ఒకటే సెంటిమెంట్లు, జాతరలను తలపించే వేడుకలు, మాటిమాటికి ఒకరిని చూసి ఒకరు మురిసిపోవడాలు.. ఇన్నిటి మధ్య సహజంగా వున్నది చెప్పాలంటే నెగిటివ్‌ రోల్‌ అనుకున్న రావు రమేష్‌ ఒక్కరే. అతన్ని సర్దుబాటు చేసే భార్య జయసుధ, వారి అమ్మాయి ప్రణీత. సహజత్వం స్పష్టత వున్న పాత్రలివే. మిగిలిన వారంతా ముఖ్యంగా సత్యరాజ్‌ మహేష్‌ మాటలు గుమ్మరించేయడం భరించలేని స్థాయిలో వుంటుంది. దర్శకుడు తను అనుకున్నది సన్నివేశాల ద్వారా కథాగమనం ద్వారా చెప్పాలి గాని మొదలైన దగ్గర నుంచి రావు రమేష్‌ ఈర్ష్య తప్ప తక్కిందంతా ఫీల్‌గుడ్‌ అన్నట్టు తీయడంతో చూడటానికి ఏమీ లేకుండా పోయింది. అతని కూతురు భార్యతో సహా ఎవరూ ఎలాగూ తనను బలపర్చరు. ఇక సమస్యేముంటుంది? అలాటి వ్యక్తి ఏదో అన్నాడని అంతటి చంటబ్బాయి గుండెపగలి చనిపోవడం.. ఆ తర్వాత కుమారుడు ఏడు తరాలను చూస్తానంటూ బయిలుదేరడం అంతా అసహజమే. పోనీ అదైనా క్రమ పద్దతిలో వుంటుందా అంటే నాగపూర్‌ అత్తయ్య ఎపిసోడ్‌ తప్ప మిగిలినవన్నీ అతుకులే. అందరినీ కలుసుకుని వచ్చాక మామయ్య పిలవని పెళ్లికి వెళ్లి మహేష్‌ మళ్లీ లెక్చరు పీకడం.. అతను కరిగి కాళ్లదగ్గరికి రావడం పిల్లల కథలాగే! చాలామంది మొదటి సగం బాగుంది రెండో సగం బోరు అన్నారు గాని నాకైతే రెండో సగమే కొంత బెటరనిపించింది.
సత్యరాజ్‌ ఏమీ చేయకపోయినా మిర్చిలో తండ్రి పాత్ర చాలా సహజంగా వుండింది. బహుశా దాన్ని సీతమ్మ వాకిట్లో.. ప్రకాశ్‌ రాజ్‌ను మేళవించి రూపొందించిన చంటబ్బాయి పాత్ర అస్సలు జీవం కోల్పోయింది. తండ్రీ కొడుకులు మొదటి సన్నివేశ్‌ంతో మొదలు పెట్టి అడుగడుగునా ఒకే ప్రహసనం.
ఈచిత్రం ఇప్పటికే చాలా విమర్శలకు గురైంది గనక పెద్దగా రాయనవసరం లేదు. అయితే దర్శకుడు శ్రీకాంత్‌ సీతమ్మ వాకిట్లో చిత్రంలో కూడా ఇలాటి అసహజత్వమే చూపించాడు. దాంట్లోనూ కథ తక్కువ, ఇదే రావు రమేష్‌ ఈర్శ్య తప్ప మరో సమస్య లేదు. మహేష్‌ బాబు దాంట్లో తండ్రిని అన్నను కూడా తప్పు చెప్పగల వాస్తవిక వాది. దీంట్లో స్పష్టత లేని నాన్న భక్తుడు మాత్రమే. సన్నివేశాల్లోనూ పాటల్లోనూ కూడా ఆయన స్టార్‌డమ్‌ను అతిగా వాడుకోవాలనుకుని రేంజి తగ్గించేశారనిపిస్తుంది. సీతమ్మ వాకిట్లో ..చిత్రంలోనూ అనుకున్న సందేశం చేరవేయడానికి దర్శకుడు కృత్రిమ మార్గాన్నే ఎంచుకున్నారు. ప్రకాశ్‌ రాజ్‌ కుటుంబం మంచితనం అవతలివారికి తెలియడానికి రెండు యాక్సిడెంట్లు జొప్పించడం చాలా అసహజంగా వుంటుంది. అయినా తారాబలం, ముఖ్యంగా అన్న దమ్ముల వెంకటేష్‌ మహేష్‌ల అనుబంధాలు ఆవేశాలు, సీతగా వేసిన అంజలి నటన రూపం అన్నీ కలిపి నిండుదనం తెచ్చాయి. పాటలూ మాటలూ ఇంతకంటే పొదుపుగా పదునుగా నడుస్తాయి. మొదటి చిత్రం కొత్త బంగారు లోకం కూడా హఠాత్తుగా తండ్రి మరణం సంభవించి కథ మలుపు తిప్పడంలో బలహీనత వుంటుంది. చిన్న పిల్లల పరిధి మించిన మాటలుంటాయి. అనేక రిపిటీషన్లు, ఇమిటేషన్లు(సెల్ప్‌) అవసరం లేని భారీతనం అణవణువునా మంచితనం అన్నీ కలిసి అసహజమై పోయింది.
చిత్రానికి ఎంచుకున్న సందేశంలోనే పాక్షికత వుంది. నలుగురితో వుండటమంటే మన బంధువులు ఎక్కడున్నారో వెతుక్కుని మరీ వారితో వుండటం కాదు. మానవాసక్తి కొద్ది వారికోసం అన్వేషణ చేయొచ్చు గాని మన చుట్టూ వున్నవారే మన వారనుకోవాలి. ఈ సందేశాన్ని మరికొంచెం లాగితే బంధుప్రీతిగా మారిపోతుంది. అన్యాపదేశంగా దర్శకుడిలో ఆ భావన తొంగిచూస్తుంది.చిత్రంలో ముగ్గురు అమ్మాయిలనూ మూడు లక్షణాలకు ప్రతీకలుగా పెట్టారు గాని ముగ్గురూ హీరో ముందు తేలిపోతుంటారు. చెప్పాలంటే చిత్రంలో బలమైన ఒక్క సన్నివేశం సంభాషణ కనిపించవు. తెలిసిందే చెప్పడం కోసం తెలిసిన పద్ధతిలో సినిమా తీసి మరీ ఎక్కువగా చెప్పించడం – చేయడానికేమీ లేకపోవడం, ఎవరు ఏమిటో కూడా ప్రేక్షకులకేగాక బహుశా పాత్రలకు కూడా తెలియనంత గజిబిజి..అంత గొప్ప తండ్రి పోతే లండన్‌లోని కూతురు ఎందుకు రాలేదో రాదో అర్థం కాదు. నిజానికి సంభాషణలు కూడా చాలా చోట్ల అర్థం కావు. మంచినటుడు రావు గోపాలరావు క్యారికేచర్‌తో చేసిన ప్రయత్నం కూడా తేలిపోయింది. ఇంతకన్నా గీతాంజలి సినిమాలో వారి సంబంధాన్ని చూపించిన తీరు బావుంటుంది.
ఇవన్నీ చెప్పడం పోల్చడానికి కాదు. మంచో చెడ్డొ ఒక స్పష్టమైన కథాంశం, సన్నివేశాలు లేకపోతే దృశ్యమాధ్యమమైన సినిమా నిలబడదు.
ఖచ్చితంగా చెప్పలేకపోయినా మరో అంశం కూడా వుంది. విభజన నేపథ్యంలో ఈ చిత్రం పూర్తిగా విజయవాడ ఆ పరిసరాలను చూపిస్తుంటుంది. ఏడు తరాల కోసం దేశమంతా తిరిగినప్పుడు కూడా సరిహద్దుల్లోని తెలంగాణ జిల్లాలను చూపించలేదు. హైదరాబాద్‌ సైబరాబాద్‌ ప్రసక్తి లేదు. మన చిత్రాల వసూళ్లలో సగానికిపైగా హైదరాబాదులో రావలసిందే. దానికే చోటు లేకుండా పోతే స్వంతమనే భావన కలగదని కూడా గుర్తించాలి. సీతమ్మ వాకిట్లొ చిత్రం జరిగేది గోదావరి జిల్లాల్లో అయినా హైదరాబాద్‌ తరచూ తగులుతుంటుంది. బంధుప్రీతికి ఇది కూడా తోడైతే అసహజత్వం ఇంకా పెరుగుతుంది.
శ్రీకాంత్‌ అడ్డాల మంచి దర్శకుడే కావచ్చు గాని స్పష్టత పెంచుకోవాల్సి వుంది. మహేష్‌ బాబు సూపర్‌స్టార్‌ హౌదాను కాపాడుకోవాలంటే కథల ఎంపిక చిత్రణలో మరింత జాగ్రత్త వహించవలసి వుంది. పోకిరీ దూకుడు బిజినెస్‌మ్యాన్‌లు విజయం సాధించడానికి చాలా కారణాలున్నాయి. అతడుతో పోలిస్తే అవన్నీ పటిష్టమైన కథా నిర్మాణంతో సాగినవేమీ కాదు. బాగుండటం అంటే బాగా వుండటం కాదు, నలుగురితో వుండటం అని అత్తారింటికి దారేదిలో హీరో చెప్పేసందేశం(నిజానికి అత్తారింటికి లోనూ బ్రహ్మానందం ఎపిసోడ్‌ బోరు కొట్టిస్తుంది గాని ఎక్కువ సేపుండదు) బ్రహ్మౌత్సవం చంటబ్బాయి జీవితాశయం కూడా ఇంచుమించుఅదే. మరి ఎంత పకడ్బందీగా తీసి వుండాలి?
సందేశం ఇవ్వాలంటే టెలిగ్రాం పంపించు, సినిమా తీయడమెందుకు అనేవాడట చక్రపాణి. సందేశం ఎంతగొప్పదైనా సన్నివేశాలు సంభాషణలు సంబంధాలు అన్నీ అమరితేనే విజయం. ఈ సత్యాన్ని మన దర్శకులు హీరోలు గ్రహింతురు గాక.
గమనిక: ఇవన్నీ ఒక కమర్షియల్‌ చిత్రం కొలబద్దలతో రాసినవేనని అందరికీ మనవి. వాస్తవికత లోతులు వెతికే వారికి మరీను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *