జాతిద్వేషంపై మతిమాలిన వికె వ్యాఖ్యలు

ఢిల్లీలో ఆఫ్రికా దేశాల నల్లజాతీయులపై సాగుతున్న దాడులకు దేశం ఆందోళన చెందుతుంటే విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.కె.సింగ్ మతిమాలిన వ్యాఖ్యలు చేస్తున్నారు. మెహరాలి ప్రాంతంలో ఒక ఆటోను కిరాయికి తీసుకునే విషయమై తలెత్తిన వివాదంలో మే20 మసోనా కెతేదా ఆలీవర్ అనే ఫ్రెంచి బాషోపాధ్యాయుణ్ని దారుణంగా చంపేశారు. అతను కాంగో దేశస్తుడు. దానిపై నిరసనలు పెరుగుతుంటే చత్తాపూర్ దక్షిణ డిల్లీ మధ్య నాలుగుచోట్ల మరిన్ని దాడులు చేశారు. కాటే కెనతా అనే జంటను కారులో నుంచి లాగి వెంటాడితే ఎలాగోబయిటపడ్డారు. తన జీవితంలోనే ఆ పదిహేను నిముషాలు భయానకమైన అనుభవమని ఆ తల్లి రోదిస్తున్నది. ఇంతకు ముందు బెంగుళూరులోనూ నల్లజాతి విద్యార్థినిని వేధించిన ఘటన తీవ్ర ఆందోళనకు కారణమైంది. ఢిల్లీ వివాదం సాగుతుండగానే హైదరాబాదులో గజీమ్ అనే నైజీరియన్‌ను ఏదో వివాదంపై పొరుగింటి ఆసామి మహ్మద్ గఫూర్ చితక్కొట్టారని కేసు నమోదైంది. ఇవన్నీ చూసి 54 ఆఫ్రికా దేశాలకు చెందిన దౌత్యవేత్తలు కేంద్రానికి గట్టి నిరసన తెలిపారు. ఆఫ్రికా దినోత్సవానికి కూడా హాజరు కాబోమన్నట్టు మాట్లాడారు. దీనిపై ఎలాగో తంటాలు పడి సర్దిచెప్పి ఆ వేడుక జరిపించేశారు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, హౌం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లు కఠిన చర్యలు తీసుకుంటామని హామీలిచ్చారు. హత్య, దాడుల కేసులో అరెస్టులు చేశారు.పరిస్థితి ఇంత తీవ్రంగా వుంటే
సైనిక దళాధిపతిగా పనిచేసిన ఈ పెద్ద మనిషి వికెసింగ్ ఇవి చిన్న చిన్న తగాదాలని తేలిగ్గా మాట్లాడ్డం దారుణం. గతంలోనూ హర్యానాలో దళితులను హత్య చేస్తే కుక్క చనిపోతే కూడా విచారం వెలిబుచ్చాలా అని హీనంగా మాట్లాడి తర్వాత సర్దుకున్నారు. భారత దేశానికి చిరకాల మిత్రదేశాలైన ఆఫ్రికా దేశాల అతిధులు ఉద్యోగులు విద్యార్థులు విద్వేషానికి గురవుతుంటే ఆఫ్రికా అతిధులు ఉద్యోగులు విద్యార్తులు వేధింపులకు గురవుతుంటే తేలిగ్గా తీసేయడం బాధ్యతారహితం. నిజానికి ఇవి చెదురుమదురు ఘటనలు కావు. తెల్లజాతి పాలన వల్ల కుల దురహంకారం వల్ల మన దేశంలో నల్లగా వున్న వారిని అణగారిన వారిని చులకనగా చూడటం దురాచారంగా మారింది. తమను ఎప్పుడూ జాత్యహంకారంతో వేదిస్తుంటారనీ,హాప్సీలనీ నీగ్రోలని అవమానకరంగా పిలుస్తుంటారని వారు ఆవేదన చెందుతున్నారు. అవన్నీ తట్టుకుని ఎలాగో బతికేస్తున్నా ఏకంగా ప్రాణాంతక దాడులు చేస్తే ఎలాగని ప్రశ్నిస్తున్నారు. హైదరాబాదులోని ఇఫ్లూలో కూడా ఈ తరహా ఆందోళన జరిగింది. నైజీరియా దేశస్తులు మాదకద్రవ్యాల అక్రమ రవాణా చేస్తుంటారనే కేసులు వున్నాయి. అయితే ఆ దేశాల వారిని వేధించేందుకు అది ఎంతమాత్రం కారణం కాకూడదు. గాందీజీ ఆఫ్రికాలోనే తన పోరాటం ప్రారంభించినప్పటికీ ఆ రోజుల్లో కూడా భారతీయులకు స్థానిక నల్లజాతి వారిపై పెద్ద గౌరవం వుండేది కాదు. వారు మాత్రం ఈ దేశాన్ని చాలా ఉన్నతంగా చూస్తారు. నెహ్రూ తమకు స్పూర్తిగా వుండేవారని నెల్సన్ మండేలా స్వయంగా చెప్పారు. వికెసింగ్ వంటి వారి నోటికి తాళం వేసి ఈ దురంతాలను అరికట్టకపోతే అంతర్జాతీయంగా మన ప్రతిష్టకు మరింత మచ్చ .