వెంకయ్య నాయుడు.. లోపం మీదే.. కోపం మీదే..??

  • vnkayya111
    కేంద్ర మంత్రి బిజెపి సీనియర్‌ నాయకుడు వెంకయ్య నాయుడుకు ఈ మధ్య కోపం ఎక్కువైందని ఆ పార్టీ నేతలు అంటుంటారు. వయస్సు పనిభారం ఇతర వ్యవహారాలు కలసి అలసిపోవడం వల్ల అలా జరగడం సహజమే. అయితే రాజకీయాల్లోనూ దాన్నే ప్రదర్శిస్తే ఇబ్బంది. ఆంధ్ర ప్రదేశ్‌ ప్రత్యేక హౌదా విషయంలో ఆయన మరోసారి ఆగ్రహౌదగ్రులై పోయారు. తనను విమర్శించేవారికి రాజకీయ దురుద్దేశాలు అంటగడుతున్నారు. పదేళ్ల ప్రత్యేక హౌదా అడగడమే తప్పయినట్టు తనపై దాడి చేయడమేమిటని ఆవేదన చెందారు. తను మాట్లాడకపోతే లోక్‌సభలో వలెనే రాజ్యసభలోనూ యథాతథంగా పూర్తయిపోయేది కదా అని ప్రశ్నిస్తున్నారు. వీటన్నిటికీ వివరణ ఆర్కేకు ఓపెన్‌గాచెబుతానని తనకు తనే వేదికనూ ప్రయోక్తనూ కూడా ప్రకటించేసుకున్నారు.
    ఎంతగా ఆగ్రహించినా సరే ఈ వాదనలేవీ నిలిచేవి కావు.

లోక్‌సభలో ఆమోదం పొందడానికి కూడా మీపార్టీ మద్దతు ప్రధానం గనక అక్కడ ఎందుకు అడగలేదు? దానికి మరెవరినో మీరెలా నిందిస్తారు?
రాజ్యసభలో అడగడం తప్పని ఎవరూ అనలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వుండగా అడిగిన వారు మీరే అధికారంలోకి వచ్చాక తిరస్కరించడమేమిటని నిలదీస్తున్నారు.
చట్టంలో పెట్టి వుంటే సమస్య వచ్చేది కాదంటున్నారు. ఆనాడు ప్రధాని హామీకి చట్టబద్దత కల్పించే అవకాశం కేంద్రంలో మీకే వున్నా ఎందుకు వుపయోగించుకోలేదు? మీరు చట్టంలో చేరిస్తే ఏదైనా న్యాయస్థానం కొట్టేసిందా?

ఇంత అనుభవజ్ఞులైన తమకు ప్రత్యేక హౌదా ఇవ్వడం కుదరదనిముందే తెలుసా? దాన్ని చట్టంలో చేర్చలేమని మన్మోహన్‌ ముందే చెప్పిన తర్వాత కదా సభలో చదివింది? మరి మీరెలా ఒప్పుకున్నారు?
పోనీ తర్వాతైనా అర్థమైతే ఎన్నికల ప్రచారంలో దాన్ని ఎందుకు పదే పదే పునరుద్ఘాటించారు? ప్రణాళికలో ఎందుకు చేర్చారు?వూరికే వూరించడానికా?
ఏ అధ్యయనాలూ రాకముందే మరే కేంద్ర నేత గొంతు విప్పక ముందే విజయవాడలో మొట్టమొదటే మీరు హౌదా రావడం కష్టమని ఎలా చెప్పగలిగారు? ఎన్నికల అవసరాలు తీరిపోయినందుకా? లేక మీ ప్రభుత్వాధినేత సహకరించనందుచేతనా?
అదే నిజమైతే మీరు మీ విశ్వసనీయతకు సంబంధించిన అంశంగా ఎందుకు తీసుకోలేదు? పట్టుపట్టలేదు?
ఆ తర్వాత పరిపరివిధాల ఎందుకు పరిశీలనలో వుందని చెప్పారు? ఆర్థిక మంత్రి స్వయంగా అది ముగిసిన అధ్యాయం అన్న తర్వాత ఇప్పటికీ పరిశీలనలో వుందని ఎలా చెబుతున్నారు?
.ప్రత్యేక హౌదాను మించిన ప్యాకేజీ అంటున్నా అలాటిది ప్రకటించడానికి ఏం అడ్డం వచ్చింది? మీరే గొప్పగా నిధులిచ్చాం అని చెప్పగల పరిస్థితి లేక బాగానే ఇచ్చామని, అన్నీ ఒకసారి విడుదల చేయలేమని సన్నాయినొక్కులు నొక్కుతున్నారు కదా.. ప్రతిపక్షాలు అంటే పొరబాటా?
ఇప్పటిదాకా ఆర్థిక శాఖ చుట్టూ తిరుగుతున్న చర్చ ఒక్కసారిగా హౌంశాఖకు సంబంధించిందని చెబుతున్నారు.. ఇక దానివైపు చూస్తూ కూచోమంటారా?
.నేను కర్ణాటకకు చెందిన వాణ్ని అని పదేపదే చెప్పుకోవడంలో ఉద్దేశమేమిటి? ఇక్కడ వివాదాలతో చేతులు దులుపుకోవడమేనా?
మీరు నిస్సందేహంగా సీనియర్‌నాయకులు. జాతీయ స్థాయిలో గణనీయమైన ప్రభావం చూపిన సమకాలీన తెలుగు ప్రముఖులలో ముందుపీఠిన వుంటారు. అయితే తెలుగువారికి సంబంధించిన సమస్యలో ఇంత అసంబద్దమైన స్పందనను సరిదిద్దకపోతే మీ వ్యక్తిత్వానికి లోపమే. సమర్థిస్తే ఇంకా పెద్ద పొరబాటు. ఇదో గౌరవ ప్రదమైన విమర్శ మాత్రమే. దెప్పి పొడుపు కాదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *