మోడీ పాలన త్రీ డీ హంగామా

modi 2 years...

నరేంద్ర మోడీ ప్రభుత్వం ద్వితీయ వార్షికోత్సవాలను భారీగా నిర్వహించేందుకు సకల సన్నాహాలు తారస్థాయిలో జరుగుతున్నాయి. రెండున్నర దశాబ్దాల తర్వాత పూర్తి మెజార్టితో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం గనక ప్రచారం మోతమోగించుకోవచ్చు. కాని అందుకోసం అనుసరిస్తున్న పద్ధతులు కొత్త కొత్తగా వాణిజ్య ఫక్కీలో వున్నాయి. బిగ్‌ బి అమితాబ్‌ బచన్‌, ముగ్గురు ఖాన్లు- అమిర్‌ సల్మాన్‌ షారుఖ్‌లు వేదికపై కనిపించనున్నారట. వికాస్‌ పర్వ్‌ పేరిట దేశమంతటా సంరంభం సాగుతుందట. అద్యక్షుడు అమిత్‌ షా సప్త రాష్ట్ర పథకం(మిషన్‌ సెవెన్‌ స్టేట్స్‌)లో భాగమైన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లలో అభ్యుదయ పథంలో భారత దేశంపేరిట 16 మంది కేంద్ర మంత్రుల పటాలం బయిలుదేరి వస్తుందట.మోడీ ప్రభుత్వ జయాపజయాలు, విధానాల మంచి చెడ్డలు అసహన రాజకీయాల నుంచి ఆర్థిక సవాళ్ల వరకూ అన్ని ఇప్పుడు ఎలాగూ చర్చకు వస్తాయి. పారిశ్రామిక రంగంలో ఎంతగా వెనుకబాటు సంభవించిందో ఆర్థిక వేత్త ప్రభాత్‌ పట్నాయక్‌ వివరంగా విశ్లేషించారు, చెట్టులేని చోట ఆముదపు చెట్టే మహావృక్షమన్నట్టు తప్ప నిజంగా మన ఆర్థికాభివృద్ధి చాలా పరిమితమని సాక్షాత్తూ రిజర్వు బ్యాంకు గవర్నర్‌ రఘురాం రాజన్‌ ప్రకటించారు. కరువు నివారణలో నిరక్ష్యాన్ని సుప్రీం కోర్టు ఒకటికి రెండు సార్లు తప్పు పట్టింది.. ఉత్తరఖండ్‌ రాజకీయ దుర్నీతికి గాను అదే సుప్రీం కోర్టు ఎన్నడూ లేని స్థాయిలో చివాట్లు పెట్టి సవరణ చర్యలు తీసుకోవలసి వచ్చింది.హెచ్‌సియు నుంచి జెఎన్‌యు వరకూ ప్రతిష్టాత్మక కేంద్ర విద్యాలయాలు ప్రభుత్వదాడి కారణంగా ప్రతిష్టంభనలో పడిపోయాయి. సరళీకరణ అంటేనే సులభతరం(ఈజీ) చేయడం. ప్రభుత్వాలు సామాన్య ప్రజలను గాక సహస్ర కోటీశ్వరులైన కార్పొరేట్ల పని సులభం చేయడానికి ఈ విధానాలు అమలు చేస్తూ వచ్చాయి. మోడీ ప్రభుత్వం గద్దెక్కిన తర్వాత ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌(వ్యాపారప్రక్రియ సులభతరం)అన్నది అధికారికి నినాదంగానే మారింది. మరోవైపున కార్మిక భద్రతపై హక్కులపై వేటు వేసేందుకు కత్తులకు పదును పెడుతున్నారు..అయితే ఇవన్నీ ఎలా వున్నా బిజెపి పార్టీ, ప్రభుత్వం కూడా భారీగానే ప్రచార సామగ్రి దిగుమతి చేస్తున్నాయి. మీడియా ఇన్‌చార్జిలతో జాతీయ వర్క్‌షాప్‌ నిర్వహించారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఒక పుస్తకమే విడుదల చేశారు. ఏతావాతా ఏదో ద్వితీయ వార్షికోత్సవానికి గాక భావి వ్యూహాల పరిపూర్తికి చేసుకుంటున్న ఆmaxresdefaultర్బాటాలుగా అగుపిస్తున్నాయి. అస్సాం విజయం ఆధారంగా తాము జాతీయంగానే తిరిగి రాబోతున్నామన్న భావం కలిగించడం దీనంతటి ఉద్దేశం.

పొంచివున్న సవాళ్లు
వచ్చేఏడాది శాసనసబ ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో బిజెపికి సంబంధించిన గుజరాత్‌,పంజాబ్‌(అకాలీలతో కలసి),గోవావున్నాయి. కాంగ్రెస్‌ పాలనలోని ఉత్తరాఖండ్‌,హిమచల్‌ ప్రదేశ్‌,మణిపూర్‌, సమాజ్‌వాదిపార్టీ పాలనలోని ఉత్తర ప్రదేశ్‌లలో ó ఎన్నికలు జరుగుతాయి. ఇందులో గుజరాత్‌ మోడీ స్వంత రాష్ట్రమే గాక బిజెపి నిరంతరంగా గెలుస్తున్న ఏకైక రాష్ట్రం. పంజాబ్‌లో ప్రస్తుత ప్రభుత్వంపై వ్యతిరేకత బాగా వుందని కాంగ్రెస్‌ లేదా ఆప్‌లలో ఏది గెలుస్తుందోనని విశ్లేషణలు నడుస్తున్నాయి. ఇక కాంగ్రెస్‌ పాలించే హిమచల్‌ ప్రదేశ్‌ సంప్రదాయికంగా బిజెపి పాలనలోనూ నడిచినరాష్ట్రం. ఉత్తరాఖండ్‌లో ఇటీవలి రాజకీయ దుస్సాహసం బెడిసికొట్టింది. అదే సమయంలో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి హరీష్‌ రావత్‌పైనా అసంతృప్తి వుంది. యుపిలో గనక గెలవకపోతే దేశంలోనూ బిజెపి పునరాగమన వాతావరణం మాయమవుతుంది. గుజరాత్‌ నిలబెట్టుకోవడం ప్రాణాస్పదం. గోవా మణిపూర్‌ చిన్నరాష్ట్రాలు. ఇక 2018లో బిజెపి పాలనలోని రాజస్థాన్‌, మధ్య ప్రదేశ్‌,చత్తీస్‌ఘర్‌లలోనూ కాంగ్రెస్‌కు మిగిలిన పెద్ద రాష్ట్రం కర్ణాటకలోనూ, సిపిఎం వామపక్షాల పాలనలోని త్రిపురలోనూ నాగాలాండ్‌, మేఘాలయ,మిజోరాంలలోనూ ఎన్నికలు జరగాలి. యుపిలోని 79 లోక్‌సభ స్థానాలలోనూ 71 బిజెపి గెలిస్తే ఇప్పుడు ఆ బలం నిలిచే సూచనలు లేవు. స్థానిక ఎన్నికలలో బిజెపి బాగా దెబ్బతినింది. అదే శాసనసభ ఎన్నికల్లో పునరావృతమైతే 2018లో తమ పాలనలోని రాష్ట్రాలలోనూ ఉత్తరోత్తరా లోక్‌సభ ఎన్నికల్లోనూ కూడా ఆశలు వదులుకోవలసి వుంటుంది. ఇలాటి రాజకీయ సందర్బం గనకే కేంద్ర బిజెపి నాయకత్వం ద్వితీయ వార్షికోత్సవాలను రాజకీయ బలప్రదర్శనగా రాబోయే ఎన్నికల ప్రచార దర్శనంగా మార్చేస్తున్నది.

మోడీ మార్కు ప్రచార కాండ
2013తో మొదలు పెట్టి మోడీని ప్రధాని అభ్యర్థిగా ఆవిష్కరించడం ఈ ధోరణికి పరాకాష్ట. గుజరాత్‌లో మోడీ ప్రభుత్వ వ్యాపార అనుకూల పోకడలు కార్పొరేట్‌ ఇండియాకు బాగా నచ్చాయి. 2002 మారణహౌమంపై దేశమంతటా నిరసన వ్యక్తమైనా బేఖాతరు చేసి మరోసారి విజయం సాధించిన మోడీ ఏకపక్ష ధోరణి ఇంకా బాగా నచ్చింది. అందుకే అప్పటి ప్రధాని వాజ్‌పేయి మోడీని మార్చాలని గోవాలో జరిగిన జాతీయ కార్యవర్గంలో సూచించినా కార్పొరేట్ల ఆకాంక్ష మేరకు ఆరెస్సెస్‌ ఆయననే కొనసాగించింది.(అప్పుడే ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వాజ్‌పేయి తరహాలో మాట్లాడటాన్ని మోడీ ఇప్పటికీ క్షమించలేదని చెబుతుంటారు) రిలయన్స్‌ అధినేత అనిల్‌ అంబానీ గుజరాత్‌ అందించిన మరో మహాత్ముడు అంటూ మోడీని ఆకాశానికెత్తేశారు. ఎన్నికలకు బాగా ముందుగానే ఆయనను ే ప్రధాని అభ్యర్థిగా ప్రజల ముందుకు తెచ్చారు. 2013-14లో మోడీ ఎన్నికల ధగధగలు సోషల్‌ మీడియాలో సామూహిక యంత్రాంగం ఇవన్నీ ఒక క్రమ పద్ధతిలో చేసిన ప్రచారవ్యూహాలే. ఆ ప్రచారంలోనూ ప్రణాళికలోనూ చెప్పిన చాలా విషయాలు మోడీ సర్కారు అమలు చేసింది లేదు. కనుకనే మరోసారి ప్రచార ప్రభంజనం సాగిస్తే తప్ప ప్రజలను మభ్యపెట్టడం సాధ్యం కాదు. ఈ కారణంగానే ఇంతవరకూ ఏ ప్రభుత్వం చేయని విధంగా రెండవ వార్షికోత్సవం పేరిట మధ్యంతర ప్రచార ప్రహసనం తలపెట్టారు. స్వచ్చ భారత్‌ కింద లక్ష్యంగా పెట్టుకున్న మరుగుదొడ్ల నిర్మాణం కూడా మూడోవంతు పూర్తి కాలేదు. మేడిన్‌ ఇండియాను మేకిన్‌ ఇండియాగా మార్చిన ఈ ప్రభుత్వం విదేశీ సంస్థలకు తలుపులు బార్లా తెరిచేసి దేశీయాభివృద్ధికి తిలోదకాలిచ్చింది. తాజాగా ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ విడుదల చేసిన పేటెంట్ల మేధా హక్కుల ముసాయిదా కూడా దేశ ప్రయోజనాలను ఫణం పెట్టి విదేశీ సంస్థలను సంతృప్తిపరిచేదిగా వుంది. అయితే పేటెంట్లపై అవగాహన పెరగాలంటూనే కేంద్రం డబ్ల్యుటివో షరతులకు ఘోరంగా తలవంచింది.ఇలా ప్రతిరంగంలోనూ దారుణంగా వున్న వాస్తవాలను తలకిందులుగా చూపించాలంటే త్రీడీ ప్రచారమే శరణ్యమవుతున్నది.
ప్రచార సంస్థల ప్రభావం
ప్రచారాలతోనే ప్రభుత్వాదికారం లభిస్తుందా అంటే అప్పటి పరిస్థితిని బట్టి సఫలమైనవీ విఫలమైనవి కూడా వున్నాయి. దేశంలోనే తొలిసారి 1980లో ఇందిరాగాంధీ ఎన్నికల ప్రచారం కోసం ఒక అడ్వర్టయిజింగ్‌ ఏజన్సీని రంగంలోకి దించారు. ఎమర్జన్సీని ఓడించి ప్రజలు అధికారం అప్పగించిన జనతా ప్రభుత్వం రెండేళ్లలోనే కూలిపోవడంతో చాలా అసంతృప్తి తాండవిస్తున్న తరుణం. అప్పుడు ఇందిరాగాంధీ పనిచేసే ప్రభుత్వం(గవర్నమెంట్‌ దట్‌ వర్క్స్‌) అంటూ అడ్వర్టయిజింగ్‌ సంస్థ సహాయంతో ప్రచారం సాగించి ఓటర్లను ఆకట్టుకున్నారు. 1984లో ఆమె హత్యకు గురికావడంతో రాజీవ్‌గాంధీకి సానుభూతి అక్కరకు వచ్చింది గాని అడ్వర్టయిజ్‌మెంట్లు కూడా బాగా వాడుకున్నారు. 1989లోనైతే ఒక బ్రిటిష్‌ ఆడ్‌ ఏజన్సీని తీసుకొచ్చి ప్రత్యేక కార్టునులతో బొమ్మలతో ప్రచారం సాగించారు. ప్రతిపక్షాలను తేళ్లు పాములతో పోల్చి వేసిన బొమ్మలు ప్రభుత్వానికే బెడిసికొట్టాయి. ఆయన ఓడిపోయారు. మళ్లీ 1996,98లలో లో బిజెపి వాజ్‌పేయి విగ్రహం ఆధారంగా ప్రచారం చేసుకుంది. ‘ ద మ్యాన్‌ ఇండియా అవైట్స్‌’ (భారత దేశం ఎదురుచూస్తున్న మనిషి) అన్న నినాదం ప్రచారంలో పెట్టారు. అది ఫలితాలిచ్చింది. వారే మళ్లీ 2004లో ఫీల్‌గుడ్‌ ఫ్యాక్టర్‌ ముద్రతో ‘వెలిగే భారతం'(ఇండియా షైనింగ్‌)నినాదాన్ని ట్యాగ్‌లైన్‌గా చేసుకుని దెబ్బతిన్నారు. తాను అడ్వర్టయిజింగ్‌ సంస్థల సమావేశంలో పాల్గొంటున్నప్పుడు ఈ ఫీల్‌గుడ్‌ అనే మాట తట్టిందని తర్వాత కాలంలో అద్వానీ చెప్పుకున్నారు. అప్పటికే సరళీకరణ విధానాలు పదేళ్లు పూర్తిచేసుకున్నాయి. రాజకీయాలు కూడా మార్కెటింగ్‌ సరుకులుగా మారిపోయాయి. కాంగ్రెస్‌కూడా ప్రచార వ్యాపార సంస్థలనే ఆశ్రయించడంతో 2004,2009 ఎన్నికలు కూడా కార్పొరేట్‌ తరహా ప్రచారాలతోనే సాగాయి.
గవర్నమెంట్లా?ఈవెంట్లా?
గతంలో వలె అధికారంలో వున్న పార్టీలపై వ్యతిరేకత(యాంటీ ఇంకంబెన్సీ) రావడం లేదని పాలకవర్గాలు భావిస్తున్నాయి. మౌన మోహన్‌ సింగ్‌గా పేరొందిన ప్రధాని రెండవ సారి గెలవగాలేనిది శక్తివంతుడై మౌనరేంద్రుడిగా మిగిలిన మోడీ మళ్లీ వచ్చేలా చేసుకోవాలని చూస్తున్నాయి. జయలలిత,మమతా బెనర్జీ వంటి వారు మరోసారి విజయం సాధించడం ఇందుకు కారణమైంది. నిజానికి కేంద్రంలోనూ రాష్ట్రాలలోనూ వున్న ప్రభుత్వాలు రెండేళ్లయినా కాకముందే తదుపరి ఎన్నికల కోసం పరుగులు మొదలుపెడుతున్నాయి.మోస్ట్‌ హ్యాపెనింగ్‌, ఈవెంట్‌ , షో కోసింగ్‌, యూనిక్‌ సెల్లింగ్‌ పాయింట్స్‌, పర్సనల్‌ కెమిస్ట్రీ, క్యాచీ ట్యాగింగ్‌ వంటివి పాలక పక్షాల పాచికలుగా వున్నాయి. ఇలాటి త్రీడీ ప్రచారంతో మోడీ పాలన మేడిపండును మింగించేందుకే వికాస పర్వ ప్రహసనం. అయితే వాస్తవాలు ప్రత్యక్షంగా చూస్తున్న అనుభవిస్తున్న ప్రజలు మార్కెటింగ్‌ మర్మాలు తెలుసుకోలేరనుకోవడం కూడా పొరబాటే. జీవితానుభవాల ఆధారంగానే వారు అంచనాలకు వస్తారు, అధికార వ్యవస్థలపై తీర్పునిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *