నీట్‌ నిజంగా ముగిసిందా?

neet111
దేశంలో, మరీ ముఖ్యంగా చివర వరకూ అలసత్వం అయోమయంలో వున్న తెలుగు రాష్ట్రాలలో విద్యార్థులను విపరీతమైన గందరగోళానికి గురి చేసిన నీట్‌ చెలగాటం ముగిసినట్టేనా? ఈ ఏడాదికి నీట్‌ జరిపే అవసరం లేకుండా కేంద్రం రూపొందించిన ఆర్డినెన్సుపై సోమవారం రాష్ట్రపతి సంతకం చేశారు గనక సమస్య వుండదంటున్నారు. కేంద్ర అధీనంలోని ప్రైవేటు కాలేజీల్లోని సీట్ల భర్తీకి మాత్రం జూలై 24న రెండవ దఫా నీట్‌ పరిమితమవుతుందంటున్నారు. అయితే ఇదైనా చివరి మలుపు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఈలోగా ఏదో ఒక ఉద్దేశంతో ఎవరైనా మళ్లీ సుప్రీంకోర్టులో సమస్యను తిరగదోడొచ్చు. ప్రభుత్వం తమ తీర్పును వమ్ము చేసిందనిన్యాయమూర్తులు ఆగ్రహించవచ్చు కూడా. కనుక మరిన్ని రోజులు నిరీక్షించిచూడాల్సిందే. అసలు రాష్ట్రపతికే కొన్ని సందేహాలు వచ్చాయంటే రేపు కోర్టుకు రావని చెప్పడం కష్టమే కదా..
నీట్‌ ఇంతకాలం అమలులోకి రాకపోవడానికి విద్యార్థులు కారణం కాదు. రాష్ట్ర ప్రభుత్వాలను కూడా నిందించలేము. వాస్తవానికి గతంలో తమ ధర్మాసనం ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు తనే అభిశంసించుకుంది. మరి తప్పు తమదైనప్పుడు ఈ ఏడాదే ఎలాగైనా పరీక్ష జరపాలని ఎందుకు పట్టుపట్టింది? మరోవైపున కేంద్రం ఈ ఆర్డినెన్సుతో సహా అనేక ప్రత్యామ్నాయాలను ఆలోచించకుండా ఎందుకు ఆలస్యం చేసింది? ఇక తెలుగు రాష్ట్రాల అధికార యంత్రాంగం కోర్టు తీర్పు అనుకూలంగా రావచ్చనే ఆధారం లేని ఆశతో ఆఖరి వరకూ అనిశ్చితిని ఎందుకు కారణమైనాయి?
నీట్‌ సిలబస్‌ నెగిటివ్‌ మార్కింగ్‌ పెద్ద సమస్యలైనా సరే- కొంతమంది పెద్దలు పెద్ద వైద్యులు మన పిల్లలు తెలివైన వారు గనక పరీక్షలు అవలీలగా రాసేస్తారు అనవసరంగా గందరగోళపెట్టొద్దని మా టీవీ చర్చల్లో అన్నారు. పిల్లలు అనేక రకాల ఎంట్రన్స్‌లు రాస్తున్న మాట నిజమే. కాని అందరి అవకావాలు అవగాహన ఒకే విధంగా వుంటాయా? ఇలా చీటిమాటికి నిర్ణయాలు మారిస్తే చికాకు పుట్టదా? ఆ ప్రభావం పరీక్షలపై పడదా? ఈ పరిస్థితికి బాధ్యులెవరో తేల్చొద్దా? ఇప్పుడు ఆర్డినెన్సు తర్వాత మళ్లీ ఎంట్రన్స్‌ రాయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
ఒకే ప్రవేశానికి ఇన్ని పరీక్షలు లేకుండా చేసే నీట్‌ మంచిదే. అయితే అదే ప్రైవేటు కాలేజీల సమస్యకు సమూల పరిష్కారం కాదు. పరోక్ష పద్ధతులలో వాటి దందా కొనసాగుతుంది.పైగా వాటి కోటా వాటికి ఎలాగూ వుంటుంది. ఈ కొత్త తరహా పరీక్షల కోచింగ్‌ పేరిట లక్షలు వసూలు చేస్తున్నారంటే పెట్టుకోలేని పిల్లల మాటేమిటి? కనక ఆర్డినెన్సుతోనైనా ఈ ఏడాది అయోమయానికి స్వస్తి చెబితే కొంత మెరుగు. ఆ మేరకు న్యాయస్థానం సంయమనం పాటిస్తుందని ఆశించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *