ఊరుకోలేక వూర్ల పేర్ల వివాదం

అనవసర వివాదాలను లేవనెత్తి అసలు సమస్యలను దారి తప్పించడంలో బిజెపి సంఘ పరివార్ ఆరితేరాయి. ఇప్పుడు వారి అధీనంలోని కేంద్ర ప్రభుత్వానినికి రాష్ట్ర ప్రభుత్వాలకు పేర్ల మార్పిడి జ్వరం పట్టుకుంది.పారిశ్రామిక కేంద్రంగా పేరొందిన (హర్యానాలోని) గుర్‌గావ్ పేరు గురుగ్రామ్‌గా మార్చడంతో ఈ తతంగం మొదలైంది.ఈ మార్పుకు సంబంధించి కూడా సాంకేతికాంశాలు మిగిలివున్నా ఏకపక్షంగా బోర్డులు మార్చేయడం మొదలుపెట్టారు. మహాభారతంలో గురువైన ద్రోణాచార్యుడికి గురు దక్షిణగా ఇచ్చిన గ్రామం గనక గురుగ్రామ్ అని వారు వివరణ ఇస్తున్నారు. ద్రోణాచార్యుడు గురుదక్షిణ అనగానే ఈ దేశంలోని అణగారిన తరగతులకు ఏకలవ్యుడి బొటన వేలు తీసుకున్న దురంతమే గుర్తుకు వస్తుంది. ఈ ప్రభుత్వానికి పాలక పక్షానికి ఆ విధమైన అభ్యంతరాలేమీ వుండవు. అయితే అంతకన్నా ముఖ్యమైన విషయమేమంటే హిందీ రాష్ట్రాలలో గ్రామాన్ని గావ్ అని పిలవడం సర్వసాధారణం. బిజెపి ఎంపి ధర్మేంద్ర కథానాయకుడుగా నటించిన చిత్రం పేరే మేరాగావ్ మేరే దేశ్! ఇక్కడ సంసృత భాషను బట్టి జనం వాడుకలో వున్న పేర్లను మార్చడం ప్రజాస్వామిక సంప్రదాయం కాదు. కుండ కుంభమయ్యె.. కొండ పర్వతమయ్యె.. అంటూ వేమన ఏనాడో పండితుల పోకడలను ఆక్షేపించాడు. ఏలూరును హేలాపురి అని పిలవడం ఇలాటిదే. బ్రిటిష్ వాళ్లు చాలా పేర్లను నిర్యక్ష్యంగా పలికి తప్పుగా మార్చేశారు గనక వాటిని సవరించుకోవచ్చు. ఉదాహరణకు త్రివేండ్రం, బాంబే వంటివి అలా మారాయి గనక మొదటి పేర్లు పెట్టుకోవచ్చు. అనంతపురం కు తిరు కలిపితే తిరువనంతపురం అయింది.(అనంతపద్మనాభస్వామి ఆలయం వున్నందువల్ల) కొల్‌కతాను కలకత్తా అని, కర్నూలును కుర్నూలు అని కడపను కుడప అని వారు పలికారు. విజయనగరం వంటి పేర్లను మరింత విపరీతంగామార్చేవారు.అదంతాచరిత్ర.చెన్నపట్టణం పేరు మరుగున పడి మద్రాసు వచ్చింది గనక వారు చెన్నై అని మొదటి పేరుకుతిరిగి వెళ్లారు. కాని ఇప్పుడు బిజెపి ఉద్దేశించిన గుర్‌గావ్ గురుగ్రామ్ మార్పు అలాటిది కాదు.
ఇదేకోవలో మరో అడుగు ముందుకేసి ఇప్పుడు మతతత్వాన్ని పేర్లపై రుద్దడానికి సిద్ధమవుతున్నారు. ఢిల్లీలో ఔరంగజేబు రోడ్డును అబ్దుల్ కలాం రోడ్డుగా మార్చాలంటే కానీ అనుకున్నారు. తర్వాత ఇప్పుడు అక్బర్ రోడ్డును రాణా ప్రతాప్ రోడ్డుగా చేయాలంటూ ఏవోచరిత్రలు చెబుతున్నారు. ఔరంగజేబులా అక్బర్ పరమత ద్వేషి కాదు.ఇస్లామ్‌ను కూడా వదలిపెట్టి దీన్ ఇలాహి అనే స్వంత శాఖ పెట్టుకున్నాడు.హిందు వనితను పెళ్లాడాడు.ఆయన పేరు ఎందుకు మార్చడం? రాణా ప్రతాప్ పేరిట ఇప్పటికే కరోల్‌బాగ్‌లో ఒక రోడ్డు వుంది. ఢిల్లీ టర్మినస్‌కు కూడా ఆయన పేరే వుంది. ఇదంతా లేనిపోని తతంగం అని మీడియాలోనూ ప్రజల్లోనూ విమర్శలు వస్తున్నాయి. ఏదైనా సందర్భంలో ఎవరినైనా గౌరవించేందుకు వారి పేరు పెట్టొచ్చు గాని పనిగట్టుకుని వివాదాలు తీసుకురావడమెందుకు?
ఇంతటితో ఆగక అహ్మదాబాద్ పేరును కర్ణావతి అనీ, ఔరంగాబాద్ పేరును శంభాజీ నగర్ అనీ ఇలా రకరకాలుగా మార్పులు ప్రతిపాదిస్తున్నారు. ఈ వూపులోనే హైదరాబాద్‌ను భాగ్యనగర్‌గా మార్చాలని కూడా అవాస్తవిక ప్రతిపాదన తీసుకురావాలనుకుంటున్నారు. ఇదంతా చూస్తుంటే బిజెపి సంసృత భారత్ కేసి నడుస్తుందా అని సందేహం కలుగుతుంది. భిన్న మతాలకు విశ్వాసాలను నిలయమైన ఈ దేశంలో గత చరిత్రను వూరికే తిరగదోడాలనుకోవడం అవాంఛనీయం. ఫేకింగ్ న్యూస్‌లో లోడీ రోడ్డును మోడీ రోడ్డుగా మార్చాలని కూడా వ్యంగ్యంగా రాశారు! ఈ లేనిపోని వ్యవహారాలు విరమిస్తే మెరుగుకదా!