జిల్లాల లొల్లి పెట్టిందెవరు?
తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన టిఆర్ఎస్ ఎన్నికల వాగ్దానం. అయితే దానిపై తగు అధ్యయనం లేకుండానే ఈ జూన్2న ప్రకటన జరిగిపోతుందనే హడావుడి సృష్టించింది ప్రభుత్వమే. టిఆర్ఎస్ ప్రజాప్రతినిధి ఒకరు చెప్పిన ప్రకారం లీకులు ఇచ్చి మ్యాపులతో సహా కథనాలు రావడానికి కారణమైంది. దాంతో ఎక్కడికక్కడ మాకు జిల్లాలు కావాలంటే మమ్ముల్ను ఫలానా జిల్లాతో కలపొద్దనే కలకలం మొదలైంది. అదిలాబాద్, కరీనంనగర్, మహబూబ్ నగర్, నల్గొండ,ఖమ్మం(భద్రాచలం) వంటిచోట్ల ఇది ఆందోళనలు ప్రజా వేదికల రూపం తీసుకుంది. ఇదంతా జరుగుతుందని ముఖ్యమంత్రి కెసిఆర్ ముందుగా వూహించలేదనుకోవడం పొరబాటవుతుంది. బహుశా తొలి స్పందనను అంచనా వేయడానికే ప్రభుత్వం ఈ కసరత్తు చేసి వుంటుంది. కాని ఈ వూపులో అధికారులు అధినేతలు మరీ ముందుకు పోయి వూహలకు ఆస్కారమిచ్చారనేది నిజం. కెసిఆర్ తొలి వ్యాఖ్యలు చేసినప్పుడే కొంతలో కొంత మార్గదర్శకాలు చెప్పి వుంటే మంచిగా వుండేది. కాని చాలా విషయాల్లో మొదట లీకులు ఇవ్వడం తర్వాత దాన్నే ధృవపరుస్తూ మాట్లాడ్డం ఆ తర్వాత వెనక్కు తగ్గడం పరిపాటిగా మారింది. ఈ మల్లగుల్లాలకు బాధ్యత మీడియాపైనో లేక ప్రతిపక్షాలపైనే మోపేసి తమ బాధ్యత నుంచి తప్పించుకుంటారు! వాస్తవానికి జిల్లాల పునర్విభజనపై తగు అధ్యయనం లేకుండా హడావుడి పెరగడానికి కారకులు ముమ్మాటికి ముఖ్యమంత్రి గారే! ఆసక్తి పెంచడానికో లేక హడావుడి కోసమో కాదంటే ప్రతిస్పందన గమనించడానికో కావాలనే కదిలించారు. బండిని ముందు గుర్రం వెనక చందంగా వ్యవహరించారు.
తెలంగాణ ఏర్పాటులో దాదాపు అన్ని పార్టీలు భాగస్వాములైనప్పుడు ఈ భారీ పునర్వ్యవస్థీకరణలో వారిని భాగస్వాములను చేయడం ప్రజాస్వామికం అవుతుంది. అందులోనూ నూతనంగా ఏర్పడిన రాష్ట్రం గనక ఎవరి ఆలోచనలూ ఆకాంక్షలూ వారికి వుంటాయి. అన్నీ విని అంతిమ నిర్ణయం తీసుకునేది ఎలాగూ ముఖ్యమంత్రే గనక వారి సలహాలు సూచనలు వినడంలో నష్టమేముంది? అన్ని చొట్లా ఒకే విధంగా రాజకీయ సామాజిక పొందికలు వుండవు,. ఇందుకు సంబందించిన ప్రాథమిక ప్రాతిపదికను వారిముందు వుంచి అభిప్రాయాలు తీసుకోవచ్చు. కాని దీనిపై ఎలాటి ముసాయిదా విడుదల చేసినా తేనెతుట్టె కదిలించినట్టేనని ఆయన భావిస్తున్నారు. ఆ సమస్య వున్నప్పటికీ నిర్ణయం ప్రకటించిన తర్వాత ఇంకా తీవ్రంగా వుండొచ్చు. అప్పుడు పర్యవసానాలు కూడా తీవ్రంగా వుంటాయి.
అసలు కరువు, విద్యారంగం, ప్రాజెక్టులు తదితర అనేక తక్షణ సమస్యలు వెన్నాడుతుంటే ప్రాధాన్యతాక్రమంలో జిల్లాలను ముందుకు తేవడంలో రాజకీయాలు కూడా వుండకపోవు. ఇలాటి సమస్యలే వస్తే మిగిలినవన్న వెనకుÊ్క పోతాయని పాలకులకు బాగా తెలుసు. రాజకీయ నాయకులు చెప్పే ప్రకారం చేయబోమని కెసిఆర్ అనొచ్చు గాని కేవలం టిఆర్ఎస్ దృష్టితో చేస్తేఇ తరులు కూడా జీర్ణించుకోలేరు కదా! ప్రజా సౌలభ్యం కోసం శాస్త్రీయంగా చేస్తున్నారంటే అప్పుడు అందరితో మాట్టాడి ఒప్పించడం తేలికే కదా! టిఆర్ఎస్ మాత్రమే బాధ్యతగా ఆలోచిస్తుందనీ,మిగిలిన వారంతా రాజకీయాలే చేస్తారని అనుకోవడం సమంజసం కాదు. వరుస ఎన్నికల విజయాలు వచ్చాయి గనక అందరూ మా నిర్ణయాన్నే శిరోధార్యంగా భావించాలని చెప్పడం ప్రజాస్వామ్యంలో కుదరేది కాదు. ఒక విధంగా చెప్పాలంటే ఈ విషయంలో ఏకపక్షంగా తొందరపాటుగా ఏదైనా చేస్తే అది టిఆర్ఎస్ కోరి రాజకీయ ప్రతికూలత తెచ్చుకోవడానికి కూడా దారితీయొచ్చు. ఇప్పుడు దసరా ముహూర్తం పెట్టారు గాని అదైనా సరిపోతుందో లేదో తెలియదు. ఈ లోగా ఏదో రూపంలో విడివిడిగానైనా ప్రతిపక్షాలతో వ్యాపార వాణిజ్య సంస్థలు ప్రజాసంఘాలు పాలనా నిపుణులు సాధారణ ప్రజల అభిప్రాయాలు తీసుకోవడం అవసరం. ఎలాటి ప్రాతిపదిక లేకుండా అభిప్రాయ సేకరణ చేయడం అశాస్త్రీయమే అవుతుంది.కనుక ముఖ్యమంత్రి దీనిపై మరోసారిఆలోచించిఅడుగేస్తారని ఆశించాలి.