రాజన్‌కు జైట్లీ అండలో ఆంతర్యం?

రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్‌పై బిజెపి ఎంపి సుబ్రహ్మణ్యస్వామి దాడి చేయడం, ఆయనను తొలగించాలని లేఖ రాయడం గతంలో చెప్పుకున్నాం. వాజ్‌పేయి హయాంలో బిజెపి వ్యతిరేకిగా వున్న స్వామిని ఎందుకు మోడీ కోరి కోరి రాజ్యసభకు ఎంపిక చేశారు, గతంలో లేని ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారనేదానిపై చాలా కథనాలు చలామణిలో వున్నాయి. చంద్రశేఖర్ మూడుమాసాల కీలుబొమ్మ ప్రభుత్వ హయాంలో ఆర్థిక శాఖ నిర్వహించిన స్వామి స్వతహాగా ఆర్థిక వేత్త అని పేరు.ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీకి వ్యతిరేకంగానే ఆయనను రంగంలోకి తెచ్చారనేది ఆ కథనాల్లో ఒకటి.దానికి తగినట్టే మోడీ వ్యతిరేకులపైనే డా.స్వామి మొదటినుంచి దాడి కేంద్రీకరిస్తున్నారు. ఆర్‌బిఐ గవర్నర్ సరిగ్గా పనిచేయడంలేదని ఆయన ధ్వజమెత్తిన మరునాడే అరుణ్‌జైట్లీ రాజన్ చాలా సమర్థుడని అంతర్జాతీయంగానే ఆయనకు గొప్ప పేరుందని కితాబునిచ్చారు. తనను ఆర్‌బిఐ గవర్నర్‌గా తీసుకోవడం వల్ల చాలా సత్పలితాలు కలిగాయన్నారు. అయితే ఆయన ప్రపంచంలో మరే ఇతర కేంద్ర బ్యాంకింగు అధికారి కన్నా సూటిగా మాట్లాడేస్తారని తనతో అంతర్జాతీయ నిపుణులు అన్నట్టు కూడా తెలిపారు. తమ శాఖకు ఆర్‌బిఐకి మధ్య పరిపక్వతతో కూడిన సంబంధాలున్నాయని ఒకటికి రెండుసార్లు చెప్పారు. ఇదంతా కూడా బిజెపిలో అంతర్గత వైరుధ్యాలకు ప్రతిబింబమనే భావన వుంది.దానికి తగినట్టే రఘురాం రాజన్‌ను కొనసాగించాలని పారిశ్రామిక వేత్తలు కొందరు మాట్లాడ్డం మొదలుపెట్టారు. ఆయన కూడా లైసెన్స్ రాజ్‌పోయింది గాని ఇన్‌స్పెక్షన్ రాజ్ పోవాలని సరళీకరణ స్వరంలో మాట్లాడ్డం ద్వారా ప్రభుత్వాన్ని మంచి చేసుకునే ప్రయత్నం ప్రారంభించారు. మొత్తంపైన తెరవెనక చాలా కథ నడుస్తున్నదన్నమాట.వ్యక్తులను బట్టి వ్యవస్థలుండవు గాని కీలక స్థానాల్లో వంతపాడేవారు గాక స్వతంత్ర భావాలున్న వారు వుండటం కొంత మెరుగు.